జేసీబీలతో తొక్కించి చంపబోయారు | - | Sakshi
Sakshi News home page

జేసీబీలతో తొక్కించి చంపబోయారు

Jun 17 2026 12:28 AM | Updated on Jun 17 2026 12:28 AM

రంగంపేట: మండలంలోని పెద్ద దొడ్డిగుంట గ్రామంలో గల ముసలయ్య చెరువు పూడ్చివేత మంగళవారం ఉద్రిక్తతకు దారితీసింది. చెరువు పూడ్చివేతను అడ్డుకున్న ఆయకట్టు రైతులపై జేసీబీలతో దాడి చేసి తొక్కించి చంపేందుకు ప్రయత్నించారని రైతులు ఆరోపించారు. ఈ ఘటనలో పలువురు రైతులు గాయపడినట్టు తెలిపారు. గ్రామంలోని 799 సర్వేలో ఉన్న ఈ చెరువును కొందరు గత నెల 30వ తేదీ నుంచి అక్రమంగా పూడ్చివేస్తున్నారని ఆయకట్టు రైతులు ఆరోపించారు. ఆ పూడ్చివేత నిలిపివేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌, తహసీల్దార్‌, గ్రామ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వారు స్పందించలేదన్నారు. తాజాగా మంగళవారం అర్ధరాత్రిలో జేసీబీలు, ట్రాక్టర్లతో చెరువు పూడ్చివేస్తుండగా రైతులు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా తమపై దాడికి పాల్పడి జేసీబీలతో తొక్కించి చంపేందుకు ప్రయత్నించారని రైతులు అడబాల శ్రీను, రమేష్‌, రామదాసు, వీరభద్రరావు, కృష్ణ, వెంకట్రావు, చిన్నారావు, కనకం ఆరోపించారు. ఈ ఘటనపై తహసిల్దార్‌, పోలీసులకు సమాచారం ఇచ్చామని, దీంతో వారు ఘటన స్థలానికి చేరుకుని జేసీబీలు, ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని తహసీల్దార్‌ కార్యాలయ ఆవరణకు తరలించారని రైతులు తెలిపారు. ఈ ఘటనలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు అధికారులను డిమాండ్‌ చేశారు.

పూడ్చివేతపై వైఎస్సార్‌ సీపీ ఆగ్రహం

ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి అండదండలతోనే టీడీపీ నాయకులు ముసలయ్య చెరువును పూడ్చివేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు అడబాల వెంకటేశ్వరరావు ఆరోపించారు. కొద్ది రోజులుగా టీడీపీకి చెందిన పలువురు వ్యక్తులు ఈ చెరువును పూడ్చివేస్తున్నారని ఆయన అన్నారు. ప్రజలకు ఉపయోగపడే చెరువులను కబ్జా చేసి పూడ్చివేయడం దుర్మార్గమని ఆయన విమర్శించారు. చెరువు పూడ్చివేస్తున్న టీడీపీ నాయకులు రైతులకు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని, ఈ ఘటనపై ఎమ్మెల్యే ప్రజలకు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు. హత్యాయత్నానికి పాల్పడిన వారిపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement