● జూన్ 21న పరీక్ష
● 9 కేంద్రాల్లో ఏర్పాట్లు
● హాజరుకానున్న 3363 మంది
● డీఆర్వో భాస్కర్ రెడ్డి
సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్ యూజీ)–2026ను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎస్. భాస్కర్ రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన చాంబర్‌లో ఈ పరీక్షల నిర్వహణపై పోలీసు, రెవెన్యూ, విద్యుత్, రవాణా, వైద్య, అగ్నిమాపక, పోస్టల్ తదితర శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో ఈ పరీక్షను 21వ తేదీ (ఆదివారం) మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పెన్ అండ్ పేపర్ (ఆఫ్‌లైన్) విధానంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 9 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, వీటిలో రాజమహేంద్రవరం అర్బన్ పరిధిలో 7, రాజానగరం మండలంలో 2 కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. వాటిలో మొత్తం 3,363 మంది పరీక్షకు హాజరు కానున్నారని పేర్కొన్నారు. ఎస్‌కేవీటీ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ప్రభుత్వ కళాశాల (ఆటానమస్), ఆది కవి నన్నయ విశ్వవిద్యాలయం, ఎస్‌కేవీటీ ఈఎం ప్రభుత్వ ఉన్నత పాఠశాల, కేంద్రీయ విద్యాలయ, ఓఎన్జీసీ బేస్ కాంప్లెక్స్, ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, నెహ్రూ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, దానవాయిపేట మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్‌లో పరీక్షల నిర్వహణలో భద్రతా ఏర్పాట్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని పోలీసు శాఖ అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద తగిన పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ, అభ్యర్థుల సజావు రాకపోకలకు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమన్వయ కమిటీ సభ్యులు ముందుగా పరీక్ష కేంద్రాల్లో ఏర్పాట్లు పరిశీలించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు, పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.


