● 7 నెలల అనంతరం
సొంత గూటికి చేరిన వైనం
రాజమహేంద్రవరం సిటీ: భర్త, కుటుంబ సభ్యుల నిరాదరణతో వీధి స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందిన కల్లేపల్లి లక్ష్మీ సుజాత ఏడు నెలల అనంతరం ఆశ్రమం నుంచి మంగళవారం అయినవారింటికి చేరింది. వివరాల్లోకి వెళ్తే 50 ఏళ్ల లక్ష్మీ సుజాత తల్లిదండ్రులది ద్వారపూడి కాగా ప్రస్తుతం భీమవరంలో నివసిస్తున్నారు. అత్తవారిది విశాఖపట్నం జిల్లా నక్కపల్లి. పైళ్లె 30 ఏళ్లయినా పిల్లల కలగలేదని భర్త, ఆడపడుచులు, అత్తగారి సూటిపోటి మాటలతో ఏడు నెలల క్రితం ఆమె ఇల్లు విడిచి వచ్చి రాజమహేంద్రవరం లాలాచెరువు స్వర్ణాంధ్ర వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందింది. భర్త, కుటుంబ సభ్యులు ఆమె వెతుకుతుండగా ఇక్కడి ఆశ్రమంలో ఉన్నట్లు తెలియడంతో వారు వచ్చి నిర్వాహకుడు గుబ్బల రాంబాబును కలసి మాట్లాడారు. వారితో మాట్లాడిన అనంతరం ఆమె తన కుటుంబ సభ్యులతో వెళ్లేందుకు ఒప్పుకున్నారు. నిర్వాహకుడు రాంబాబు సుజాతను ఆమె తల్లి చేకూరి సుబ్బలక్ష్మి, అన్నయ్య శ్రీనివాసరాజు, తమ్ముడు రామరాజులకు అప్పగించారు. తన కుమార్తెను ఇన్ని రోజులు సంరక్షించిన రాంబాబుకు వారు ధన్యవాదాలు తెలిపారు. సుజాతకు స్వర్ణాంధ్ర వృద్ధులు అందరూ వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో స్వర్ణాంధ్ర మేనేజర్ ఎద్దు హరి కృష్ణ, జి.దివ్యపూర్ణ తదితరులు పాల్గొన్నారు.
దేవీపట్నం పరిసరాల్లో పులి
దేవీపట్నం: మండలంలోకి పదిహేను రోజుల క్రితం మళ్లీ ప్రవేశించిన పెద్దపులి ప్రస్తుతం దేవీపట్నం పరిసర ప్రాంతాల్లో సంచరిస్తోంది. ఈ నెల మూడో తేదీన గంగంపాలెం వద్ద 13 లేగ దూడలను చంపిన ఈ పులి రామదుర్గం, నేలకోట ఆవ పరిసర ప్రాంతాల్లో సంచరించి, నాలుగు రోజుల క్రితం దండంగి వాగు దాటింది. ప్రస్తుతం గోదావరి నది పరీవాహక గ్రామాలైన దేవీపట్నం, మంటూరు పరిసర ముంపు గ్రామాల్లో దీని కదలికలను అటవీ అధికారులు గుర్తించారు.


