● వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో నిబంధనల కొర్రీ
● మూడేళ్ల ఈ–క్రాప్ ఉన్నవారే అర్హులంట
● పచ్చచొక్కాలకే లబ్ధి అంటున్న రైతులు
రాజమహేంద్రవరం రూరల్: వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో చంద్రబాబు ప్రభుత్వం మాయాజాలం ప్రదర్శిస్తోంది. నిబంధనల పేరుతో రైతులకు రాయితీ యంత్రాలను దూరం చేస్తోంది. కూటమి ప్రభుత్వం రెండేళ్ల తర్వాత రాయితీపై యంత్రాల పంపిణీకి సిద్ధం కాగా, రైతుల మెడపై నిబంధనల కత్తి పెట్టింది. తూర్పుగోదావరి జిల్లాకు మొత్తం 1,238 యూనిట్ల ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో హార్వెస్టింగ్, నూర్పిడి యంత్రాలు 18 యూనిట్లు, స్ప్రేయర్లు 817, పంట తరువాత మరియు విలువ జోడింపు యంత్రాలు 16 యూనిట్లు, పవర్ టిల్లర్లు 59, అవశేష నిర్వహణ/ ఎండుగడ్డి మరియు మేత సామగ్రి 53 యూనిట్లు, స్వీయచోదక ఇంప్లిమెంట్ యూనిట్లు 100, విత్తడం మరియు నాటడం తవ్వే యంత్రాలు 13 యూనిట్లు, ట్రాక్టర్ పనిముట్లు 118, ట్రాక్టర్లు (40 హెచ్‌పీ) మరియు మినీ ట్రాక్టర్లు 44 యూనిట్లు ఇవ్వనున్నారు. ఈ మేరకు జిల్లాకు రూ.4.43 కోట్లు మంజూరు చేశారు. అయితే ఇవన్నీ అర్హులకు అందుతాయా లేక కేవలం అధికార పార్టీ నాయకులు చెప్పిన వారికే ఇస్తారా అనే సందేహం రైతుల్లో వ్యక్తమవుతోంది. ఉపాధి నిధులతో గతేడాది గ్రామాల్లో పశువుల శాలలు మంజూరు చేయగా, అవన్నీ టీడీపీ వారికే ఇచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా పథకం ఏదైనా పచ్చ చొక్కాలకే వెళ్తున్నాయని అంటున్నారు. దీంతో తాజాగా వ్యవసాయ యంత్ర పరికరాలూ అర్హులకు అందుతాయా అనే అనుమానం వ్యక్తమవుతోంది.
అర్హత ఉన్నా, అదృష్టం కావాలి
చంద్రబాబు ప్రభుత్వం రాయితీ యంత్ర పరికరాలు పొందేందుకు పలు నిబంధనలు విధించి సామాన్య రైతులకు తీరని అన్యాయం చేస్తోంది. మూడేళ్లలో మూడుసార్లు ఈ–పంట నమోదు చేసి ఉండాలన్న నిబంధన చాలామంది రైతులకు ఇబ్బందిలా మారింది. ఒకవేళ అర్హత సాధించినా, లాటరీలో అదృష్టం వరించాలి. ఆపై జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఆమోదంతోనే జాబితా తయారవుతోంది. ట్రాక్టర్ మంజూరై డిపాజిట్లు మొత్తం ముందే చెల్లించినా, రాయితీ మాత్రం జూలైలో అందజేస్తామని పేర్కొనడం గమనార్హం.
ఆమోదం ఉంటేనే!
నిబంధనల పేరిట ప్రభుత్వం ఈ పథకాన్ని అర్హులకు దూరం చేయనుందనే విమర్శలు ఉన్నాయి. దరఖాస్తు చేసుకునే రైతులు తప్పనిసరిగా మూడేళ్లపాటు ఈ–క్రాప్ నమోదు కలిగి ఉండాలి. కుటుంబంలో ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలనే నిబంధన తప్పనిసరి చేశారు. జిల్లాలోని 18 మండలాల్లో 3,02,640.86 ఎకరాల్లో 1,55,977 మంది రైతులు ఈ–క్రాప్ కలిగి ఉన్నారు. సన్న, చిన్నకారు రైతులు ఎస్సీ, ఎస్టీ రైతులకు 50 శాతం సబ్సిడీ, మిగిలిన రైతులకు 40 శాతం సబ్సిడీ ఇస్తున్నట్లు ప్రకటించారు. ఇక్కడి వరకూ బాగున్నా.. దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను లాటరీ ప్రక్రియ ద్వారా జిల్లా ఇన్‌చార్జి మంత్రి ఎంపిక చేయనున్నారు. ఇక్కడే అసలు తిరకాసు ఉంది. లాటరీలో టీడీపీకి చెందని వారి పేరు వస్తే వారికి యంత్ర పరికరాలను అందించేందుకు ఆమోదముద్ర వేస్తారని చర్చించుకుంటున్నారు. నియోజకవర్గాల్లోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ నేతలను కాదని ఇతర రాజకీయ పార్టీలకు చెందిన వారికి యంత్రాల పంపిణీ కలగానే మిగలనుందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వ్యవసాయదారులకు యంత్ర సాయమన్నారు.. మసిపూసి మారేడు కాయ చేస్తున్నారు.. నిబంధనల కొర్రీ పెట్టి అర్హులకు అన్యాయం చేసేందుకు సిద్ధమయ్యారు.. పచ్చ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు ప్రణాళిక రచించారు.. వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో నిబంధనల కొర్రి పెట్టారు.. చంద్రబాబు ప్రభుత్వంలో సాగుదారులకు అన్యాయం చేస్తున్నారని అంతా కోడై కూస్తున్నారు.
అప్పట్లో పంటగే
మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హయాంలో గ్రామ సచివాలయాల్లో దరఖాస్తు చేసిన వెంటనే వైఎస్సార్ రైతు సేవా పథకంలో భాగంగా ప్రతి ఏటా రాయితీపై ట్రాక్టర్లు, ట్రాక్టరు పనిముట్లు, వ్యవసాయ యంత్ర పరికరాలను పారదర్శకంగా అందజేశారు. పంపిణీ చేసిన రోజే వాటికి సంబంధించిన రాయితీ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేశారు. దీంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు. అప్పట్లో ప్రతి సచివాలయానికి ఒక ట్రాక్టరు మంజూరు చేశారు. ఇక వ్యవసాయ పనిముట్లు అడిగిన రైతులందరికీ అందించారు. ట్రాక్టర్లు, నూర్పిడి యంత్రాలు, వరికోత మెషీన్లు, ట్రాక్టరు పనిముట్లు, రోటోవేటర్, స్ప్రేయర్లు అందజేశారు.


