అరటి ఆకును విస్తరించక.. | - | Sakshi
Sakshi News home page

అరటి ఆకును విస్తరించక..

Apr 28 2026 8:17 AM | Updated on Apr 28 2026 8:17 AM

తగ్గిన అరటి ఆకుల వ్యాపారం

రెడీమేడ్‌ ప్లేట్ల రాకతో ఉపాధికి గండి

ప్రత్తిపాడు: పోషకాల గని.. ఆరోగ్యానికి రారాణి.. అరటి ఆకు. శుభకార్యంలోనైనా.. విందు భోజనాలకై నా.. ఇది తప్పనిసరి. అరటి ఆకులో భోజనం చేస్తే ఆరోగ్యానికి ఎంతో మేలని పూర్వీకులు చెబుతుంటారు. విషాహారం వడ్డిస్తే అరటి ఆకు రంగు మారుతుందని విశ్వసిస్తారు. పర్యావరణానికి మేలు చేసే అరటి ఆకు మన సంస్కృతికి ప్రతీక.. ఒకప్పుడు ఈ ఆకుల వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా సాగేది. ఎందరో గ్రామీణులు అరటి ఆకులనే జీవనాధారంగా చేసుకుని జీవించేవారు. ఎన్నో కుటుంబాలకు ప్రధాన ఆదాయ వనరులుగా ఉండేది. కాలక్రమేణా వాటి స్థానంలోకి రెడీమేడ్‌ విస్తరాకులు వచ్చాయి. దీంతో ఈ వ్యాపారం చేసేవారి సంఖ్య నానాటికీ తగ్గుతోంది.

అరటి పంటను ఎక్కువగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పండిస్తున్నారు. అక్కడి నుంచి ఈ అరటి ఆకులను సేకరించి వివిధ ప్రాంతాలకు ఎగుమతి చేస్తూ, అనేక మంది ఉపాధి పొందుతున్నారు. విందులో విస్తరాకులకు బదులుగా అరటి ఆకులను వినియోగించడంతో రాష్ట్ర వ్యాప్తంగా వీటికి గిరాకీ ఏర్పడింది. పెళ్లిళ్ల సీజన్‌లో వీటికి ఎక్కువగా డిమాండ్‌ ఉన్న దృష్ట్యా వేలాది మంది ఈ వ్యాపారాన్ని సాగించేవారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అరటి ఆకుల సేకరణ, రవాణా, విక్రయం ద్వారా సుమారు ఐదు వేల మంది పైబడి ఉపాధి పొందుతున్నారు. మెట్ట ప్రాంత మండలాలు ఏలేశ్వరం, ప్రత్తిపాడు, శంఖవరం, రౌతులపూడితో పాటు ఆలమూరు, ఆత్రేయపురం, కపిలేశ్వరపురం, రావులపాలెం తదితర మండలాల్లోని లంక గ్రామాల్లో వేలాది ఎకరాల్లో అరటి సాగవుతోంది. పెళ్లిళ్ల సీజన్‌కే పరిమితం కాకుండా, ఏడాది పొడవునా ఈ ఆకులకు గిరాకీ ఉండడంతో సంవత్సరం పొడవునా ఈ వృత్తినే కొనసాగిస్తున్నారు. పంట దిగుబడి దెబ్బతింటుందన్న ఉద్దేశంతో పెద్ద చెట్ల ఆకులను కోయనివ్వరు. ఈ చెట్ల ఆకులను కోయనిస్తే కొడవలి ద్వారా అంటువ్యాధులు ఒక చెట్టు నుంచి మరో చెట్టుకు సోకే ప్రమాదముంది. అందువల్ల సాధారణంగా అవసరమైన అరటి ఆకులను అరటి పిలకల నుంచి మాత్రమే కోస్తారు. లేదా పంట దిగుబడి వచ్చిన తర్వాత చెట్టు నుంచి ఆకులను సేకరిస్తారు. ఆకులు కోసిన రెండు రోజుల వరకూ బాగుంటాయి. ఆపైన పాడవుతాయి. ఒక మనిషి రోజుకు 400 నుంచి 500 ఆకులను వరకూ కోస్తారు. 50, 100, 200 ఆకుల చొప్పున కట్టలు కట్టి రవాణా చేస్తుంటారు. సీజన్‌లో వంద అరటి ఆకులను రూ. 40 నుంచి రూ. 50 వరకు అమ్ముతారు. అన్‌ సీజన్‌లో అవే ఆకులను అయినకాడికి అమ్ముకుంటామని కిర్లంపూడి మండలం వేలంక గ్రామానికి చెందిన అరటి ఆకుల వ్యాపారులు చెబుతున్నారు.

వ్యాపారం తగ్గి..

మెట్ట ప్రాంతం నుంచి రోజూ అరటి ఆకులను రాజమహేంద్రవరం, తుని, పిఠాపురం, కాకినాడలకు రవాణా చేస్తుంటారు. యర్రవరం, రావులపాలెం నుంచి హైదరాబాద్‌ వంటి దూర ప్రాంతాలకు సైతం రవాణా అవుతుంటాయి. ప్రకృతి వైపరీత్యాలు, వివిధ వ్యాధుల కారణంగా నష్టాలను చవిచూసిన రైతాంగం అరటి సాగును తగ్గించేస్తోంది. ఫలితంగా ఆకుల సేకరణ కష్టతరమవుతోందని వ్యాపారులు చెబుతున్నారు.

లాభసాటిగా లేదు

ఒకప్పుడు మా గ్రామంలోనే వంద మందికి పైగా అరటి ఆకుల వ్యాపారం చేసేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. అరటి గెలలు కోసిన తర్వాత రైతులే ఉదారంగా ఆకులను కోసుకోమంటున్నారు. ఆకులు కోసి దూర ప్రాంతాలకు చేర్చినా గిట్టుబాటు కావడం లేదు. వేరే మార్గం లేకపోవడంతో ఈ వృత్తినే కొనసాగిస్తున్నా.

–కిల్లాడి రాంబాబు, అరటి ఆకుల వ్యాపారి, వేలంక, కిర్లంపూడి మండలం

రెడీమేడ్‌ ప్లేట్ల రాకతో..

రెడీమేడ్‌ ప్లేట్ల రాకతో అరటి ఆకుల వ్యాపారం మందగిస్తోంది. వివిధ మోడళ్లు, ఆకర్షణీయంగా పేపర్‌, అట్ట, ప్లాస్టిక్‌ ప్లేట్లు మార్కెట్‌లోకి రావడంతో అరటి ఆకుల వ్యాపారం తగ్గుతోందని వ్యాపారులు చెబుతున్నారు. పట్టణాల్లోనే కాకుండా మారుమూల ప్రాంతాల్లోని దుకాణాల్లో కూడా రకరకాల ప్లేట్లు దొరకడంతో ప్రజలు వాటివైపు మొగ్గు చూపుతున్నారు. దీనివల్ల చాలామంది ఇతర వ్యాపారాల వైపు మళ్లుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement