రైలు ఢీకొని వ్యక్తి మృతి | - | Sakshi
Sakshi News home page

రైలు ఢీకొని వ్యక్తి మృతి

Apr 28 2026 8:17 AM | Updated on Apr 28 2026 8:17 AM

రాజమహేంద్రవరం సిటీ: స్థానిక సరస్వతీ ఘాట్‌ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి (40) రైలు ఢీకొని మృతి చెందాడని రాజమహేంద్రవరం జీఆర్పీ హెడ్‌ కానిస్టేబుల్‌ సోమవారం తెలిపారు. మృతుడి ఎత్తు 5.3 అడుగులు, ముదురు పసుపు రంగు షర్ట్‌, ముక్కుపోడుం రంగు ఫ్యాంట్‌ ధరించి ఉన్నాడన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి మృతదేహాన్ని మార్చురీకి తరలించామన్నారు. ఆచూకీ తెలిస్తే రాజమహేంద్రవరం జీఆర్పీ స్టేషన్‌ నంబర్లు 91545 78496, 0883 2442821లలో సంప్రదించాలని అన్నారు.

రోడ్డు ప్రమాదంలో..

కాకినాడ క్రైం: స్థానిక సాంబమూర్తి నగర్‌ ఐదో వీధిలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో ఆమె భర్తకు తీవ్ర గాయాలై చికిత్స పొందుతున్నాడు. పోలీసుల కథనం ప్రకారం.. కాకినాడ డైరీఫారానికి చెందిన దంపతులు సుజాత (42), సుదర్శన్‌లు సాంబమూర్తినగర్‌ నుంచి ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళుతుండగా వేగంగా వచ్చిన చేపల లోడు వ్యాన్‌ ఢీకొంది. ఈ ప్రమాదంలో సుజాత కిందపడి అక్కడికక్కడే మృతి చెందింది. సుదర్శన్‌ను కాకినాడ జీజీహెచ్‌కు తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు.

గడ్డి మందు తాగి..

నల్లజర్ల: గడ్డి మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. నల్లజర్ల ఏఎస్సై శ్రీనివాసరావు కథనం ప్రకారం.. తూర్పుచోడవరం గ్రామానికి చెందిన మాండ్రాజు మురళీ (33) వ్యవసాయ కూలీగా పని చేస్తున్నాడు. అతనికి భార్య మంగాదేవి, కుమార్తె, కుమారుడు ఉన్నారు. గ్యాస్‌ నొప్పి రావడంతో భరించలేక ఈ నెల 25న గడ్డి మందు తాగగా కుటుంబ సభ్యులు తాడేపల్లిగూడెంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. భార్య మంగాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై చెప్పారు.

గుర్తుతెలియని వ్యక్తి ఆత్మహత్య

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): స్థానిక తూర్పు రైల్వేస్టేషన్‌ సమీపంలోని చెట్టుకు గుర్తు తెలియని వ్యక్తి (30) సోమవారం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషయాన్ని స్థానికులు రెండో పట్టణ పోలీసులకు తెలపడంతో వారు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం వద్ద ఆచూకీ కోసం గాలించారు. ఎటువంటి ఆధారాలు లభించలేదు. అతను అస్సోం వాసిగా పోలీసులు అనుమానిస్తున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రి మార్చురీలో భద్రపరిచారు.

జీతాలు వెంటనే ఇవ్వాలి

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ప్రభుత్వం ఐదు నెలలుగా బకాయి పెట్టిన జీతాలు వెంటనే చెల్లించాలని ఏపీ మెప్మా, ఆర్‌పీ ఉద్యోగుల సంఘం గౌరవాధ్యక్షురాలు జి.బేబీరాణి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈశ్వరిబాయి డిమాండ్‌ చేశారు. ఏపీ మెప్మా, ఆర్‌పీ ఉద్యోగుల సంఘం, ఏపీ వెలుగు వీఓఏ (యానిమేటర్స్‌) ఉద్యోగుల సంఘం ఆధ్వర్యాన ఐదు నెలల వేతన బకాయిలు చెల్లించాలనే డిమాండుతో కలెక్టరేట్‌ వద్ద సోమవారం నిర్వహించిన ధర్నానుద్దేశించి వారు మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ వేధింపులు ఎక్కువైపోయాయని, వాటిని వెంటనే అరికట్టాలని డిమాండ్‌ చేశారు. రూ.10 లక్షల జీవిత బీమా కల్పించాలని, స్వావలంబన, అభయహస్తం, మహిళా మార్ట్‌ల పేరుతో పెట్టిన పెట్టుబడులను మహిళా సంఘాలకు తిరిగి చెల్లించాలని, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేయాలని కోరారు. ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తున్నా తమ జీవితాల్లో ఏ మార్పూ రావడం లేదని, వేతనాలు నెలలు తరబడి బకాయి పెడితే ఎలా జీవించాలని ప్రశ్నించారు. తమకు సంబంధం లేని పనులన్నీ మెప్మా, ఆర్‌పీలపై రుద్దుతూ పని ఒత్తిడి తీవ్రంగా పెంచారని, సెల్‌ ఫోన్లు ఇచ్చి సిమ్‌ కార్డులు ఇవ్వడం మానేశారని, రీచార్జిలు కూడా సొంత డబ్బులతో చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణం పని ఒత్తిడి తగ్గించి, ప్రభుత్వమే రీచార్జ్‌ చేయించాలని కోరారు. ప్రభుత్వం స్పందించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్‌, కోశాధికారి మలకా రమణ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement