రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆందోళన | - | Sakshi
Sakshi News home page

రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆందోళన

Apr 28 2026 8:17 AM | Updated on Apr 28 2026 8:17 AM

రామచంద్రపురం: పండించిన పంటను కొనుగోలు చేసేవారు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్టు రైతులు వాపోయారు. నియోజకవర్గంలో ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసే బాయిల్డ్‌ రైస్‌ మిల్లు కేంద్రాలు లేక పండించిన పంట సగం ధరకే దళారులు చేతుల్లోకి పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణ టీడీపీ అధ్యక్షుడు వుండవల్లి శివ ఆధ్వర్యంలో సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని సోమవారం స్థానిక ఆర్డీఓ కార్యాలయంలో ఏఓకు అందజేశారు. రైతుల సమస్యలపై ఎమ్మెల్యే, రాష్ట్ర కార్మిక శాఖామాత్యులు దృష్టికి తీసుకెళ్లగా అధికారులకు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేసినా ఏవిధమైన కార్యచరణ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శివ మాట్లాడుతూ జిల్లాల పునర్విభజనలో భాగంగా అత్యధిక బాయిల్డ్‌ రైస్‌ మిల్‌ కేంద్రాలు కలిగి ఉన్న మండపేట నియోజకవర్గం తూర్పుగోదావరి జిల్లాలో విలీనం కావడం వల్ల రామచంద్రపురంలో ప్రభుత్వం ద్వారా కొనుగోలు చేసే బాయిల్‌ రైస్‌ మిల్‌ కేంద్రాలు లేకుండా పోయాయని వాపోయారు. నియోజకవర్గం నుంచి సుమారు లక్షా నలభై వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని, అధికారులు దృష్టిసారించి రామచంద్రపురానికి పది కిలోమీటర్ల లోపు దూరం కలిగిన మండపేట, రాయవరం మండలాల్లో ఉన్న బాయిల్డ్‌ రైస్‌ మిల్‌ కేంద్రాలకు అనుసంధానం చేసి ధాన్యం కొనుగోలు చేసే విధంగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. నాయకులు కొమరిన వీర్రాజు, జెడ్పీటీసీ మాజీ సభ్యులు మేడిశెట్టి రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement