రావులపాలెం: గోపాలపురం గ్రామ పరిధిలోని పి.గన్నవరం బ్యాంక్ కాలువలోకి సోమవారం మధ్యాహ్నం ఓ కారు దూసుకుపోయింది. అయితే కాలువలో నీరు పెద్దగా లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానిక సచివాలయం సమీపంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన కాకి నరేష్ విద్యుత్ శాఖలో పని చేస్తున్నారు. సోమవారం పని నిమిత్తం పొడగట్లపల్లి వెళ్లి కారులో గోపాలపురం ఇంటికి వస్తుండగా, రావిచెట్టు సమీపంలో కారు అదుపుతప్పింది. దీంతో పక్కనున్న విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, స్తంభాన్ని ఢీకొంది. తర్వాత పి.గన్నవరం బ్యాంక్ కెనాల్‌లోకి దూసుకుపోయింది. ఆ కాలువలో నీరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారులో ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో నరేష్‌ను స్థానికులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.


