భూగర్భ జలాలను పెంచాలి | - | Sakshi
Sakshi News home page

భూగర్భ జలాలను పెంచాలి

Apr 8 2026 7:50 AM | Updated on Apr 8 2026 7:50 AM

సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం): జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జలాలు ప్రస్తుతం 20 మీటర్ల లోతులో ఉన్నాయని, వాటిని కనీసం 5 మీటర్ల పైకి తీసుకుని వచ్చేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ కీర్తి చేకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. జలధార కార్యక్రమంపై క్షేత్ర స్థాయి అధికారులతో మంగళవారం నిర్వహించిన టెలి కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. గోపాలపురం, కోరుకొండ, అనపర్తి, రాజానగరం, నల్లజర్ల తదితర మండలాల్లో భూగర్భ జలాల స్థాయి తక్కువగా ఉన్నందున ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. జలధార కార్యక్రమం సత్ఫలితాలు సాధించడంలో ఇరిగేషన్‌తో పాటు ఇతర కోర్‌ శాఖల మధ్య సమన్వయం అత్యంత కీలకమని అన్నారు. మండలాల వారీగా ఇరిగేషన్‌ ఇంజనీరింగ్‌ అధికారులు చొరవ తీసుకోవాలని, గ్రామం నుంచి డివిజన్‌ స్థాయి వరకూ సమన్వయంతో సాగితేనే భూగర్భ జలాల పెంపు సాధ్యమవుతుందని చెప్పారు. ప్రతి మండలంలో ఇంజినీరింగ్‌ అసిస్టెంట్లు, వ్యవసాయ సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. గ్రామాల్లో చెరువులకు నీరు వచ్చే ఫీడర్‌ చానెల్స్‌, సబ్‌ చానెల్స్‌ను గుర్తించి ఉపాధి హామీ పథకం కింద పూడికతీత, జంగిల్‌ క్లియరెన్స్‌ చేపట్టాలని, చెరువులు నింపేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జలధార పనుల్లో 99 శాతం వరకూ ఉపాధి హామీ పథకం కింద వినియోగించుకోవాలని కలెక్టర్‌ అన్నారు.

కార్యదర్శుల వేతన శ్రేణిని

సవరించడం దుర్మార్గం

అల్లవరం: గ్రామ పంచాయతీ గ్రేడు–3 కార్యదర్శుల వేతన శ్రేణిని సవరించడం దుర్మార్గమైన చర్య అని ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయిల్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. జీఓ 91లో పేర్కొన్న రూ.28,280–89,720 గా ఉన్న వేతన శ్రేణిని రూ. 25,220–80,910 వేతన శ్రేణీగా సవరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడం ద్వారా సచివాలయ ఉద్యోగులకు తీవ్రా అన్యాయం జరుగుతుందని ఇజ్రాయిల్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం సచివాలయం వ్యవస్థను నిర్వీర్యం చేయాలని, ఉద్యోగులను ఇబ్బంది పెడుతోందన్నారు. రేషనలైజేషన్‌ పేరిట సచివాలయ ఉద్యోగులను కుదించి, మిగిలిన వారిని వేర్వేరు శాఖలకు బదలాయించడం, తాజాగా కార్యదర్శులు వేతన శ్రేణీని సవరించడం, ఉద్యోగుల పొట్టకొట్టడమేనని ఆక్షేపించారు. ఎన్నికలకు ముందు వలంటీర్లను కొనసాగించి, రూ. 10 వేలు చేస్తామని ఆశలు కల్పించి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత వేలాది మంది వలంటీర్లను తొలగించారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సచివాలయం వ్యవస్థను గ్రామాల్లో ఏర్పాటు చేస్తే చంద్రబాబు ప్రభుత్వం దానిని నిర్వీర్యం చేస్తోందన్నారు.

నేటి నుంచివైద్య ఉద్యోగుల నిరసనలు

అమలాపురం టౌన్‌: ఏపీ మెడికల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వైద్య ఉద్యోగులు తమ 29 సమస్యల (డిమాండ్ల) పరిష్కారాన్ని కోరుతూ జిల్లాలో బుధవారం నుంచి దశల వారీ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. అమలాపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో పనిచేస్తున్న ఏపీ మెడికల్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి, జిల్లా కార్యదర్శి పీవీవీ సుబ్బారావు ఈ దశల వారీ నిరసన కార్యక్రమాల వివరాలను వెల్లడించారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రుల సమన్వయకర్త డాక్టర్‌ కార్తీక్‌కు యూనియన్‌ నేత సుబ్బారావు స్థానిక ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో ఈ నెల 8వ తేదీ నుంచి జిల్లా వైద్య ఉద్యోగులు చేపట్టనున్న నిరసన కార్యక్రమాలు, తమ డిమాండ్లపై ఇప్పటికే వినతి పత్రం అందించారు.

అమలాపురం, రామచంద్రపురం ప్రభుత్వ ఏరియా ఆస్పత్రులు, జిల్లాలోని తొమ్మిది ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రులకు చెందిన దాదాపు 200 మంది వైద్య ఉద్యోగులు ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. బుధ, గురువారాల్లో (8,9 తేదీల్లో) ఈ రెండు రోజులూ వైద్య ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు తెలుపుతారు. ఈ నెల 10, 11 తేదీల్లో రెండు రోజులూ ఓ గంట సేపు ఆయా ఆస్పత్రుల వద్ద ఉద్యోగులు ధర్నాలు చేయనున్నారు. కాంట్రాక్ట్‌ వైద్య ఉద్యోగులకు నూరు శాతం గ్రాస్‌ జీతం, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఏడాదిలో 35 రోజుల సెలవులు, కనీస వేతనం రూ.28 వేలు ఇవ్వాలని ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement