సాక్షి, రాజమహేంద్రవరం: ‘గోదావరి మహా పుష్కరాలు అంగరంగ వైభవంగా నిర్వహించాలి. అందుకు అవసరమైన నిధులు, అభివృద్ధి పనులపై ప్రతిపాదనలు సిద్ధం చేశారు. అతి త్వరలోనే నిధులు మంజూరవుతాయి. పనులు యుద్ధప్రాతిపదికన ప్రారంభిస్తాం’ అంటూ ప్రజాప్రతినిధులు, అధికారులు నిత్యం గొప్పగా ప్రకటిస్తున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు ప్రతి నెలా సమావేశం కావడం.. పుష్కర పనులపై సమీక్షించడంతోనే సరిపోతోంది. కానీ, పుష్కరాలను పురస్కరించుకుని చేపట్టాల్సిన వివిధ పనుల కోసం అధికారుల ప్రతిపాదనలు పంపించి ఏడాది గడుస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం కిమ్మనడం లేదు. నేటికీ నయాపైసా విడుదలైన దాఖలాలు లేవు. ఎప్పుడు విడుదలవుతాయో స్పష్టతా లేదు. వాస్తవానికి గోదావరి పుష్కరాలు వచ్చే ఏడాది జూలై నెలలో జరగనున్నాయి. అంటే, ఇక దాదాపు 14 నెలలు మాత్రమే సమయం ఉంది. ఇప్పటి నుంచీ ప్రారంభిస్తే తప్ప అప్పటికి అభివృద్ధి పనులు పూర్తయ్యే అవకాశం లేదు. కానీ, క్షేత్ర స్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. పుష్కరాలు ప్రారంభానికి కొద్ది రోజుల ముందు హడావుడిగా పనులు చేపట్టి, నిధులు దిగమింగేందుకే ఇలా తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలు ఓవైపు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పుష్కరాలకు నిధులివ్వకుండా తప్పించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం పావులు కదుపుతోందని.. కేంద్ర నిధుల పైనే ఆధారపడుతోందన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగానే ప్రతిపాదనలు పంపించినా.. నిధుల విడుదలపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వడం లేదన్న వాదన వినిపిస్తోంది.
తొలుత రూ.1,578 కోట్లతో..
గోదావరి పుష్కరాలకు గత ఏడాది అప్పటి కలెక్టర్ ప్రశాంతి, అన్ని శాఖల జిల్లా అధికారులు విస్తృత కసరత్తు చేశారు.
మంత్రులు, ఎమ్మెల్యేల ఆమోదంతో పుష్కరాల నిర్వహణకు రూ.1,578 కోట్లు అవసరమని అప్పట్లో ప్రతిపాదనలు రూపొందించారు. పుష్కరాల ప్రారంభానికి ముందే ఆ నిధులతో ఘాట్ల అభివృద్ధి, రోడ్లు, మురుగు కాలువల ఆధునీకరణ, యాత్రికులకు అవసరమైన సదుపాయాల కల్పన, క్రౌడ్ మేనేజ్‌మెంట్, ట్రాఫిక్ మేనేజ్‌మెంట్‌కు తీసుకోవాల్సిన పది రకాల పనులను ప్రజాప్రతినిధులు, అధికారులు ప్రతిపాదించారు. అందుకయ్యే ఖర్చును కేటగిరీల వారీగా అంచనా వేసి, ప్రభుత్వానికి ప్రతిపాదదించారు. అయితే, ఆ ప్రతిపాదనలపై ప్రభుత్వం ఇప్పటికీ స్పందించలేదు.
రెండోసారి రూ.2 వేల కోట్లకు పైగా..
పుష్కరాలకు సంబంధించి సీఎం చంద్రబాబుతో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఇటీవల సమావేశమయ్యారు. ఆ సందర్భంగా పుష్కర పనుల జాబితాను సీఎంకు అధికారులు అందించారు. జిల్లావ్యాప్తంగా కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం, రాజమండ్రి సిటీ, రాజమండ్రి రూరల్, రాజానగరం నియోజకవర్గాల్లో చేపట్టాల్సిన పనులకు సంబంధించి సుమారు రూ.2,105.96 కోట్లతో రెండోసారి ఈ ప్రతిపాదనలు రూపొందించారు. ఈ పనులను మూడు దశలుగా విభజించి చేపట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు. నిధులు త్వరలోనే విడుదల చేస్తామని చెప్పారు. ఈ సమావేశం జరిగి రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకూ నయాపైసా కూడా విడుదల చేయలేదు.
అవగాహన లేమితో అవస్థలు
పుష్కర పనుల నిర్వహణపై ప్రజాప్రతినిధులు, అధికారులకు అవగాహన లేకపోవడంతో ఇలాంటి పరిస్థితి తలెత్తినట్లు చెబుతున్నారు. గత పుష్కరాల్లో పని చేసిన అధికారులు, విశ్రాంత ఉద్యోగులను సంప్రదించి పనుల ప్రతిపాదనలు రూపొందించారు. వాటినే ప్రభుత్వానికి పంపారు. పుష్కరాలకు వివిధ ప్రాంతాల నుంచి రాజమహేంద్రవరం నగరానికి కోట్లాదిగా యాత్రికులు వస్తారు. ఈ నేపథ్యంలో రహదారుల విస్తరణ పనులకు ఎంతో ప్రాధాన్యం ఉంది. ఆక్రమణలు తొలగించి రోడ్లను వెడల్పు చేయడం ద్వారా ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. అయినప్పటికీ నగరంలో ఇప్పటి వరకూ రోడ్ల విస్తరణ చేపట్టలేదు. నగరపాలక సంస్థ పరిధిలో సాధారణ నిధులతో ఈ పనులు చేయడం లేదు. ఆర్‌అండ్‌బీ, ఇరిగేషన్, దేవదాయ శాఖ, రాజమహేంద్రవరం నగరాభివృద్ధి సంస్థ, పంచాయతీరాజ్ తదితర శాఖలు సైతం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నాయనే విమర్శలు వస్తున్నాయి.
● ప్రభుత్వానికి ప్రతిపాదించాం
గోదావరి పుష్కరాల నేపథ్యంలో చేపట్టాల్సిన పనులపై ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదించాం. ప్రభుత్వం నిధులు విడుదల చేసిన వెంటనే పనులు ప్రారంభిస్తాం. త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటాం. పుష్కర పనుల్లో భాగంగా ఇప్పటికే కొన్ని చేపడుతున్నాం. – రాహుల్ మీనా, కమిషనర్,
రాజమహేంద్రవరం నగర పాలక సంస్థ
ప్రతిపాదనల్లో కొన్ని ఇవీ..
గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని 11,616 పనుల నిర్వహణకు గాను అధికారులు రూ.2,105.96 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వాటిలో మచ్చుకు కొన్ని..
పనులు ప్రతిపాదించిన నిధులు
(రూ.లక్షల్లో)
రహదారులు 64,112.81
సీసీ రోడ్లు 9,163.24
బీటీ రోడ్లు 5,086.58
రోడ్లు, పరిహారం 48,382.99
మురుగు కాలువలు 19,571.94
నీటి సరఫరా 12,757.75
తాత్కాలిక విద్యుత్ సదుపాయం 7,749.00
పార్కులు, మరుగుదొడ్ల నిర్వహణ 4,194.35
తదితరాలు
డివైడర్లు, ఫుట్‌పాత్‌ల నిర్వహణ 1,351.00
పార్కింగ్ ప్రదేశాలు 2,023.43
అద్దె వాహనాలకు 80.00
నూతన కట్టడాలు 6,700.00
వీఐపీ గెస్ట్‌హౌస్‌లు 500.00
ఘాట్ల నిర్వహణ 29,810.00
డిజాస్టర్ మేనేజ్‌మెంట్ 400.00
ఫ వచ్చే ఏడాదే పుష్కరాలు
ఫ అభివృద్ధి పనులకు రూ.2,106 కోట్లతో
ప్రతిపాదనలు
ఫ ఏడాదైనా కిమ్మనని ప్రభుత్వం
ఫ సమీక్షలకే ప్రజాప్రతినిధులు, అధికారులు పరిమితం
ఫ నిధుల మంజూరుపై స్పష్టత కరువు
ప్రస్తుతం అరకొర పనులే..
పుష్కరాల సందర్భంగా శాశ్వతంగా చేపట్టాల్సిన పనులు ఇప్పటికే ప్రారంభం కావాల్సి ఉంది. యాత్రికుల సదుపాయాలు, వసతుల కల్పనపై కసరత్తు జరగాలి. ప్రధానంగా గోదావరి ఘాట్‌ల విస్తరణ, దగ్గరగా ఉన్నవాటి అనుసంధానం, కొవ్వూరు, నిడదవోలుల్లో ఘాట్‌ల అభివృద్ధి పనులు చేపట్టాల్సి ఉంది. ప్రస్తుతం రాజమహేంద్రవరం పుష్కర ఘాట్‌లో ఉన్న రాళ్లు తొలగించి, కొత్తవి అమర్చడం, వీఐపీ ఘాట్ వద్ద ఆధునికీకరణ, అప్పర్ రివర్‌ఫ్రంట్ పనులు మాత్రమే అరకొరగా జరుగుతున్నాయి. నిధులు విడుదల చేయకపోవడంతో మిగిలిన వాటి నిర్వహణ ప్రశ్నార్థకంగా మారింది.


