అమలాపురం టౌన్: అమలాపురం రస వాహిని సాంస్కృతిక వేదిక నిర్వహణలో కేఎన్ మూర్తి నాటక పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక ముస్లిం షాదీఖానా భవన ప్రాంగణంలో మూడు రోజులుగా జరుగుతున్న ప్రథమ ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు సోమవారం రాత్రితో ముగిశాయి. ఈ మూడు రోజుల్లో ప్రదర్శించిన నాటికల్లో సోమవారం రాత్రి ప్రదర్శితమైన ‘ఇంద్రప్రస్థం’ నాటిక ఉత్తమ ప్రదర్శనగా నిలిచి రూ.30 వేల నగదు బహుమతిని గెలుచుకుంది. ప్రేమించుకున్న జంట ఒక వైపు, వారి తల్లిదండ్రులు మరోవైపు, వారి వాదనలు, చివరకు ఉభయుల అంగీకారంతో పెళ్లి జరగడంతో నాటిక ముగుస్తుంది. పోటీల ముగింపు సందర్భంగా జరిగిన కార్యక్రమానికి ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు, మాజీ ఎమ్మెల్సీ మహమ్మద్ షరీఫ్‌లు హాజరయ్యారు. రసవాహని సంస్థ అధ్యక్షుడు, కేఎన్ మూర్తి నాటక పరిషత్ వ్యవస్థాపక కార్యదర్శి మహ్మద్ షెహన్ షా పర్యవేక్షణలో జరిగిన ఈ పోటీల ముగింపు కార్యక్రమంలో పరిషత్ అధ్యక్షుడు కొండాబత్తుల వేణుగోపాలరావు, కేఎన్ మూర్తి, ఉపాధ్యక్షుడు ప్రొఫెసర్ గోకరకొండ నాగేంద్ర, విశ్వ హిందూ పరిషత్ జిల్లా ప్రతినిధి డాక్టర్ గోదశి గంగరాజు, అమలాపురం పంచాయితీ రాజ్ డీఈఈ అన్యం రాంబాబు, పరిషత్ కో ఆర్డినేటర్ ఎంవీఎస్ మూర్తి తదితరులు పాల్గొన్నారు. పరిషత్ ప్రతినిధులు కొండాబత్తుల నరసింహమూర్తి, కొండాబత్తుల శ్రీరాములును రస వాహిని రంగస్థల సేవా పురస్కారాలతో సత్కరించారు. అలాగే డాక్టర్ కె.సాంబశివరావు, మల్లాది శివన్నారాయణ, నాయుడు గోపి, దేవిశెట్టి రామకోటేశ్వరరావు, నటకుమారిలను దివంగత నల్లా సత్యనారాయణ రంగస్థల సేవా పురస్కారాలతో సత్కరించారు. కార్యక్రమంలో అమలాపురం చెన్నమల్లేశ్వర కళాపరిషత్ ప్రతినిధి నల్లా శ్రీధర్, రమణ పాల్గొన్నారు.


