ఆదాయానికి పాతర | - | Sakshi
Sakshi News home page

ఆదాయానికి పాతర

Apr 1 2026 7:30 AM | Updated on Apr 1 2026 7:30 AM

కాకినాడ లీగల్‌: ప్రభుత్వ సొమ్ముకు రక్షణగా ఉండాల్సిన ట్రెజరీ (ఖజానా) కార్యాలయంలోనే నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అధికారుల ఉదాసీనత వల్ల లక్షల రూపాయల విలువ చేసే ప్రభుత్వ ఆస్తి తుప్పు పట్టిపోతోంది. కొత్త భవనంలోకి మారడానికి ఉత్సాహం చూపిన అధికారులు.. పాత సామగ్రిని మాత్రం గాలికొదిలేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నాలుగేళ్లుగా పార్కింగ్‌లోనే..

స్థానిక కోర్టు ప్రాంగణంలో జిల్లా ఇంటిగ్రేటెడ్‌ ఫైనాన్స్‌ కాంప్లెక్స్‌ ప్రారంభమై నాలుగేళ్లు గడుస్తోంది. ఈ భవనంలో జిల్లా ట్రెజరీ కార్యాలయంతో పాటు సబ్‌ ట్రెజరీ వంటి ఇతర విభాగాలు కొలువుదీరాయి. కొత్త కార్యాలయాలు ప్రారంభమైన సమయంలో కోట్లాది రూపాయలతో సరికొత్త టేబుళ్లు, కుర్చీలు, ఇతర ఫర్నిచర్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే పాత కార్యాలయం నుంచి తీసుకొచ్చిన టేబుళ్లు, కుర్చీలు, ఇనుప బీరువాలు, కంప్యూటర్‌ భాగాలు వీటన్నింటినీ భవనంలోని పార్కింగ్‌ ప్రాంతంలో ఒక మూలన పడేశారు.

నిబంధనలు ఇవే..

సాధారణంగా ప్రభుత్వ కార్యాలయాల్లో వాడని పాత సామగ్రి జాబితాను ఎప్పటికప్పుడు తయారు చేసి, నిబంధనల ప్రకారం ప్రభుత్వం నుంచి అనుమతి పొంది వేలం వేయాల్సి ఉంటుంది. ఆ వేలం ద్వారా వచ్చే నగదును ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలి. కానీ ఇక్కడ అధికారులు నాలుగేళ్లనా ఆ దిశగా అడుగులు వేయడం లేదు.

పలు ఆరోపణలు

ఏటా పాత ఫర్నిచర్‌ లెక్కలు చూడకపోవడంతో విలువైన వస్తువులను కొందరు సిబ్బంది గుట్టుచప్పుడు కాకుండా మాయం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నిర్లక్ష్యం వెనుక ఉన్న అసలు కారణాలు బయటపడాలంటే ఉన్నతాధికారులు స్పందించాల్సి ఉంది. పాత కార్యాలయం నుంచి ఇక్కడకు ఎన్ని వస్తువులు తరలించారు. ఇప్పుడు అక్కడ ఎన్ని ఉన్నాయి అనే విషయాలపై సమగ్రంగా తనిఖీ జరగాలి. పనికిరాని వస్తువులను వెంటనే వేలం వేసి ప్రభుత్వ ఆదాయాన్ని కాపాడాలి. ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేసిన అధికారులపై విచారణ జరిపించాలి. ప్రభుత్వ కార్యాలయంలో రూపాయి లెక్క కూడా పక్కాగా ఉండాలి. కానీ ఇక్కడ కళ్ల ముందే విలువైన ఫర్నిచర్‌ పాడవుతున్నా పట్టించుకోకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనంగా నిలుస్తోందని పలువురు ఆరోపిస్తున్నారు.

పాత సామగ్రిపై అధికారుల నిర్లక్ష్యం

నిబంధనల మేరకు వేలం వేయని వైనం

కాకినాడ జిల్లా ట్రెజరీలో

తుప్పుపడుతున్న బీరువాలు, కుర్చీలు

ప్రభుత్వ ఆదాయానికి గండి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement