ఏసీబీ వలలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌

Apr 1 2026 7:30 AM | Updated on Apr 1 2026 7:30 AM

కాకినాడ క్రైం: ఏసీబీ వలకు ఓ శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ చిక్కాడు. కాకినాడ మున్సిపాలిటీ కొత్తపేట మార్కెట్‌ సర్కిల్‌ 10లో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌గా పని చేస్తున్న వంగల రాజేంద్ర ప్రసాద్‌ రూ.15 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు. ఆ పరిధిలో ఓ దుస్తుల దుకాణానికి ట్రేడ్‌ లైసెన్సు మంజూరు చేసేందుకు సూరంపూడి అరవింద్‌ను రూ.15 వేల లంచం డిమాండ్‌ చేశాడు. మంగళవారం సాయంత్రం 5.43 గంటలకు తన కార్యాలయంలో లంచం తీసుకుంటూండగా రాజమహేంద్రవరం ఏసీబీ డీఎస్పీ ఎం.కిషోర్‌ కుమార్‌ ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్లు భాస్కరరావు, వాసుకృష్ణ, సతీష్‌ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లంచం సొత్తు రూ.15 వేలే కాక, మరో రూ.18,640 లెక్కలో లేని మొత్తాన్ని అతడి నుంచి ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకుని సీజ్‌ చేశారు. లంచం కోసం రాజేంద్ర ప్రసాద్‌ చేస్తున్న వేధింపులను తాళలేక ఏసీబీ అధికారులను ఆశ్రయించినట్లు ఫిర్యాదుదారు సూరంపూడి అరవింద్‌ తెలిపారు.

హత్య కేసులో

ముగ్గురికి జీవిత ఖైదు

సామర్లకోట: హత్య కేసులో ముగ్గురికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష, రూ.వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ పెద్దాపురం కోర్టు మంగళవారం తీర్పు వెల్లడించింది. సీఐ వైఆర్‌కే శ్రీనివాస్‌ తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దాపురం మండలం తాటిపర్తి గ్రామానికి చెందిన మాజీ వైస్‌ ఎంపీపీ గోపు సతీష్‌ రాజాపై 2016 మే 15వ తేదీ రాత్రి పెద్దాపురం మండలం దివిలి గ్రామంలోని రాజుగారి కాంప్లెక్స్‌ వద్ద గల శ్రీరామా ఎంటర్‌ప్రైజెస్‌ షూమార్టు సమీపంలో ముగ్గురు వ్యక్తులు కత్తితో దాడి చేసి హత్య చేశారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్సై వై.సతీష్‌ కేసు నమోదు చేయగా సీఐ కె.శ్రీధర్‌ కుమార్‌ దర్యాప్తు చేసి 2016 మే 28న కొప్పిరెడ్డి అచ్చిరాజు (ఏ1), అతడి కుమారులు రాంబాబు (ఏ2), రాజేష్‌ (ఏ3)లను అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. తదుపరి సీఐ వీరయ్య గౌడ్‌ చార్జిషీట్‌ ఫైల్‌ చేశారు. వాదోపవాదాలు పూర్తయిన తర్వాత ఏడో అదనపు జిల్లా, సెషన్స్‌ కోర్టు జడ్జి జి.చంద్రమౌళీశ్వరి ఈ కేసులో తీర్పును వెలువరించారు. ముగ్గురు నిందితులకు పైవిధంగా శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ కేసులో నిందితులను పట్టుకోవడం, వారికి శిక్ష పడేలా చేసిన అప్పటి సీఐలు కె. శ్రీధర్‌ కుమార్‌, వీరయ్య గౌడ్‌, అప్పటి డీఎస్పీ శ్రీహరిరాజు, ప్రస్తుత ఇన్‌చార్జి డీఎస్పీ కేవీవీ సత్యనారాయణ, ఇటీవల బదిలీ అయిన సీఐ పి.విజయ్‌ శంకర్‌, ఎస్సై మౌనిక, కోర్టు లైన్‌ ఆఫీసర్‌, ఏఎస్సై బీవీ నారాయణలను ఎస్పీ బిందు మాధవ్‌ ప్రత్యేకంగా అభినందించారు. పీపీలుగా గన్నం వినయతేజ, ఎం.జయరావు వాదించారు.

ప్రభుత్వ వైద్య కళాశాలకు

రూ.2 లక్షల విరాళం

కంబాలచెరువు (రాజమహేంద్రవరం): మైక్రో బయాలాజీ విభాగాధిపతి ప్రొఫెసర్‌ డాక్టర్‌ ఎం.భారతి తన తల్లి లోలాక్షి జ్ఞాపకార్థం రాజమహేంద్రవరం ప్రభుత్వ వైద్య కళాశాలకు రూ.రెండు లక్షల విరాళం అందించారు. ఈ మొత్తాన్ని మంగళవారం కళాశాల ప్రిన్సిపాల్‌ కేవీ శివప్రసాద్‌కు అందజేశారు. ఈ సొమ్మును ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేసి, దానిపై వచ్చే ఆదాయంతో ఏటా మైక్రోబయాలాజీలో ప్రథమ స్థానంలో ఉత్తీర్ణులైన వారిని బంగారు పతకంతో సత్కరించాలని కోరారు. ఆ పని కోసమే తన తల్లి పేరుతో ఈ మొత్తాన్ని వినియోగించాలని భారతి విజ్ఞప్తి చేశారు. తన తల్లి వైద్య విద్యను ఎంతో ప్రోత్సహించేవారని, అందుకే తాను ఈ స్థాయిలో ఉన్నానన్నారు. కార్యక్రమంలో జనరల్‌ హాస్పిటల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కెనడీ, వైద్య కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ శారద తదితరులు పాల్గొన్నారు.

లారీ డ్రైవర్‌ మృతి

గండేపల్లి: ముందు వెళుతున్న లారీని ఢీకొన్న ప్రమాదంలో వెనుక వస్తున్న లారీ డ్రైవర్‌ మృతి చెందాడు. గండేపల్లి పోలీసులు మంగళవారం తెలిపిన వివరాల ప్రకారం.. రాజమహేంద్రవరం వైపు బొగ్గు లోడుతో వెళుతున్న ఓ లారీ తెల్లవారుజాము 3 గంటల సమయంలో మండలంలోని మురారి శివారుకు వచ్చే సరికి సడన్‌గా స్లో అయ్యింది. దీంతో లారీని వెనుక వస్తున్న గ్రావెల్‌ లోడు లారీ బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో గ్రావెల్‌ లోడు లారీ డ్రైవర్‌ మేడవలిమి యోగయ్య అలియాస్‌ దావీదు (50) క్యాబిన్‌లో ఇరుక్కుని మృతి చెందాడు. మృతుడు మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలేనికి చెందిన వాడని, కుటుంబ సభ్యులు పిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

గుర్తు తెలియని వ్యక్తి మృతి

దేవరపల్లి: గుండుగొలను – కొవ్వూరు జాతీయ రహదారిపై దేవరపల్లి మండలం కృష్ణంపాలెం వద్ద మంగళవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడని ఎస్సై సుబ్రహ్మణ్యం తెలిపారు. అతడి వయసు సుమారు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందన్నారు. ఆచూకీ తెలిసినవారు 94407 96624, 94407 96584 నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement