హత్యాయత్నం చేసినవారిని స్వేచ్ఛగా వదిలేస్తారా? | - | Sakshi
Sakshi News home page

హత్యాయత్నం చేసినవారిని స్వేచ్ఛగా వదిలేస్తారా?

Mar 26 2026 7:47 AM | Updated on Mar 26 2026 7:47 AM

అనపర్తి: తన భర్తపై హత్యాయత్నం చేసిన నిందితుల పట్ల పోలీసులు ఉదాసీనంగా వ్యవహరించడంతో తమ కుటుంబం ప్రాణభయంతో బిక్కుబిక్కుమని కాలం వెళ్లదీస్తోందని బిక్కవోలు మండలం పందలపాకకు చెందిన వైఎస్సార్‌ సీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ తమలంపూడి దుర్గారెడ్డి భార్య లలిత ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక వినాయక నగర్‌లో నివసిస్తున్న దుర్గారెడ్డి ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తుంటారు. ఈ నెల ఐదో తేదీ రాత్రి సుమారు 8:30 గంటలకు నూజివీడు నుంచి ఇంటికి వచ్చిన దుర్గారెడ్డి బయటకు వెళ్లి వస్తానని భార్యతో చెప్పి రాత్రి 10:30 అవుతున్నా తిరిగి రాలేదు. ఫోన్‌ చేసినా స్పందన లేదు. మరికొద్ది సేపటికి ఫోన్‌ చేస్తే తరవాత వస్తాను ఆగు అని మెసేజ్‌ పెట్టారని లలిత చెప్పారు. మళ్లీ 11:42 గంటలకు ఫోన్‌ చేస్తే స్పందన లేకపోవడంతో తెలిసినవాళ్లందరికీ ఫోన్లు చేసి తలో దిక్కూ వెతికినట్టు తెలిపారు. ఈ పరిస్థితుల్లో నిందితులలో ఒకరైన స్థానికుడు కొవ్వూరి రాజేష్‌రెడ్డి ఆ అర్ధరాత్రి 01:22 గంటలకు లలిత తమ్ముడు కృష్ణారెడ్డికి ఫోన్‌ చేసి తమ ఇంటికి రావాలని చెప్పడంతో అక్కడికి వెళ్లి చూడగా దుర్గారెడ్డి తీవ్ర రక్తగాయాలతో ఇంటి వద్ద మెట్లపై పడి ఉన్నాడని లలిత తెలిపారు. దీంతో ఆమె స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసి, హుటాహుటిన అతడిని రాజానగరం జీఎస్‌ఎల్‌ ఆస్పత్రికి తీసుకువెళ్లారు. అక్కడి వైద్యులు మెడికో లీగల్‌ కేసు నమోదు చేసి దుర్గారెడ్డిని పరీక్షించి పరిస్థితి విషమంగా ఉందని కడుపులో రక్తస్తావం ఎక్కువైందని, ప్రాణాలకు ప్రమాదమని చెప్పారన్నారు. అప్పటికే దుర్గారెడ్డి అపస్మారకస్థితిలో ఉన్నాడని తెలిపారు. రాజేష్‌రెడ్డి, అతని సోదరుడు, మరి కొందరు కలసి కర్రలతో తీవ్రంగా కొట్టి, కడుపులో బలంగా పొడవడంతో ఇలా జరిగిందని, వెంటనే శస్త్ర చికిత్స చేయడంతో ప్రాణాలు దక్కాయని లలిత పేర్కొన్నారు. వీపు పైన, మర్మాంగాల పైన తీవ్రంగా కొట్టడంతో సుమారు 15 రోజులు అపస్మారక స్థితిలోనే ఉన్నారని ఆమె తెలిపారు. అధికారపక్షం చేస్తున్న అవినీతి, ఆక్రమాలను సోషల్‌ మీడియా వేదికగా ప్రశ్నిస్తుండడం వల్లే ఆయనపై కక్షతో అధికార పార్టీ నాయకులు రాజేష్‌రెడ్డి ద్వారా ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారని ఆమె ఆరోపిస్తున్నారు. నిందితుడికి స్టేషన్‌ బెయిల్‌ ఇచ్చి స్వేఛ్ఛగా వదలి వేయడం ఏమిటో అర్ధం కాలేదని ఆమె వాపోయారు. జిల్లా ఉన్నతాధికారులు విచారణ జరిపి నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని లలిత ఆ ప్రకటనలో కోరారు.

వైఎస్సార్‌ సీపీ సోషల్‌ మీడియా కన్వీనర్‌ దుర్గారెడ్డిపై దాడి

నిందితులకు

స్టేషన్‌ బెయిల్‌ ఇవ్వడంపై ఆవేదన

తన కుటుంబానికి ప్రాణభిక్ష పెట్టాలని బాధితుడి భార్య లలిత వేడుకోలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement