సాక్షి, తూర్పుగోదావరి: రాజమండ్రి కల్తీ పాల ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కల్తీ పాల ఘటనను మానవ హక్కుల సంఘం సుమోటోగా స్వీకరించింది. ఏపీ సీఎస్, డీజీపీకి ఎన్‌హెచ్‌ఆర్‌సీ నోటీసులు జారీ చేసింది. రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని సీఎస్, డీజీపీని ఆదేశించింది. నివేదికలో బాధితుల ఆరోగ్య పరిస్థితి, దర్యాప్తు వివరాలు, చనిపోయిన వారి కుటుంబాలకు నష్టపరిహారం చెల్లింపు తదితర అంశాలను వెల్లడించాలని ఎన్‌హెచ్‌ఆర్‌సీ పేర్కొంది.
గత ఫిబ్రవరిలో తూర్పుగోదావరి జిల్లా లాలా చెరువు చౌడేశ్వరి నగర్ స్వరూపనగర్‌లో కల్తీపాల తాగి 16 మంది మృత్యువాత పడ్డారు మరో నలుగురు పరిస్థితి విషమంగా ఉంది. పాలలో విషపూరిత రసాయనాలు ఇథైల్ గ్లైకోల్ కలిసింది. విషపూరిత పాలను నరసాపురం గ్రామంలోని డెయిరీ నుంచి సరఫరా అయినట్లు గుర్తించారు. దాదాపు 100 ఇళ్లకు సరఫరా చేసినట్లు నివేదికలు వెల్లడించాయి. మీడియా ద్వారా సమాచారాన్ని తెలుసుకున్న జాతీయ మానవ హక్కుల సంఘం.. ఘటనపై విచారణకు స్వీకరించింది. ఇది మానవ హక్కుల ఉల్లంఘనేనని ఎన్‌హెచ్‌ఆర్‌సీ స్పష్టం చేసింది.


