రత్నగిరిపై తొమ్మిది రోజుల పాటు
జరగనున్న శ్రీరామనవమి వేడుకలు
అన్నవరం: రత్నగిరి క్షేత్ర పాలకుడు శ్రీసీతారామచంద్రస్వామివారి శ్రీరామనవమి వేడుకలు చైత్ర శుద్ధ అష్టమి, గురువారం ప్రారంభం కానున్న సందర్భంగా దేవస్థానంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా రత్నగిరి రామాలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. ఈ వేడుకలకు ఈ నెల 21వ తేదీన రామాలయం వద్ద ఘనంగా పందిరి రాట ముహూర్తం చేసిన విషయం తెలిసిందే.
నేడు వధూవరులను చేయడంతో
వేడుకలు ప్రారంభం
గురువారం నుంచి ఏప్రిల్ మూడో తేదీ వరకు తొమ్మిది రోజుల పాటు శ్రీరామనవమి వేడుకలు రత్నగిరి పై నిర్వహించనున్నారు. రత్నగిరి క్షేత్రపాలకులుగా పూజలందుకుంటున్న సీతారాముల కల్యాణ మహోత్సవాలను సాక్షాత్తూ సత్యదేవుడు, అమ్మవారు పెళ్లిపెద్దలుగా నిర్వహించడం ఆనవాయితీ. గురువారం సాయంత్రం నాలుగు గంటలకు సీతాదేవి, శ్రీరామచంద్రమూర్తిని వధూవరులను చేస్తారు. శుక్రవారం ఉదయం పది గంటల నుంచి సీతారాముల కల్యాణం నిర్వహిస్తారు. 28 తేదీన ప్రత్యేక పూజలు, 29 తేదీన పండిత సదస్యం, 30, 31 తేదీలలో సీతారాములకు ప్రత్యేక పూజలు, ఏప్రిల్ ఒకటో తేదీన సీతారాముల వారి వన విహారోత్సవం, రెండో తేదీన శ్రీ చక్రస్నానం, దండియాడింపు, మూడో తేదీ రాత్రి రామాలయంలో నిర్వహించే శ్రీపుష్పయాగంతో కార్యక్రమాలు ముగుస్తాయి.


