దేవరపల్లి: పొగాకు మార్కెట్ పట్ల రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజమహేంద్రవరం టుబాకో బోర్డు రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో బుధవారం కొనుగోళ్లకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ఉదయం 9.30 గంటలకు జంగారెడ్డిగూడెంలో బోర్డు చైర్మన్ సీహెచ్ యశ్వంత్‌కుమార్, కార్యదర్శి వేణుగోపాల్ కొనుగోళ్లు ప్రారంభించారు. అనంతరం కొయ్యలగూడెం వేలం కేంద్రాలో వేలం ప్రారంభించారు. గోపాలపురం వేలం కేంద్రంలో కొనుగోళ్లను రైతులు నిలుపుదల చేశారు. జంగారెడ్డిగూడెం, కొయ్యలగూడెం వేలం కేంద్రాల్లో కిలో గరిష్ఠ ధర రూ.265 పలకడంతో రైతులు నిరసన వ్యక్త చేశారు. దీంతో గోపాలపురం వేలం కేంద్రం, దేవరపల్లి వేలం కేంద్రాల్లో కొనుగోళ్లను రైతులు నిలుపుదల చేశారు. ఓ దశలో రైతులు, బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్ మధ్య తీవ్రస్థాయిలో వాగ్వావాదం జరిగింది. బోర్డు మాజీ వైస్ చైర్మన్ గద్దే శేషగిరిరావు, చైర్మన్ యశ్వంత్ మధ్య వాదోపవాదాలు జరగ్గా, కొంతమంది రైతులు గో బ్యాక్ చైర్మన్ అంటూ నినాధాలు చేశారు. మార్కెట్ ఆశాజనకంగా లేదని, గత ఏడాది కిలో గరిష్ఠ ప్రారంభ ధర రూ.290 ఉండగా, ఈ ఏడాది రూ. 265తో ప్రారంభించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులతో బోర్డు చైర్మన్, కార్యదర్శి చర్చలు జరిపి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికి అంగీకరించకపోవడంతో వేలం నిలుపుదల చేశారు. కిలో గరిష్ఠ ధర రూ. 300 ఉండాలని రైతులు డిమాండ్ చేశారు. అనంతరం దేవరపల్లి వేలం కేంద్రంలో వేలం ప్రారంభానికి సిద్ధం కాగా రైతులు అడ్డుకున్నారు. గరిష్ఠ ధర రూ. 300 ఇవ్వాలని, రూ.265 ధరకు కొనుగోలు చేయవద్దని రైతులు అధికారులకు వివరించారు. దీంతో అధికారులు, బోర్డు చైర్మన్ రైతులతో సమావేశం నిర్వహించి పరిస్థితిని వివరించి మూడు రోజుల్లో గుంటూరు బోర్డు కార్యాలయంలో కొనుగోలు సంస్థల ప్రతినిధులు, రైతు సంఘాల ప్రతినిధులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి మార్కెట్‌పై నిర్ణయం తీసుకుంటామని, అప్పటి వరకు కొనుగోళ్లు ఆపవద్దని రైతులకు సూచించారు.
మార్కెట్‌లో ధర గిట్టుబాటుగా లేనందున గుంటూరులో సమావేశం జరిగే వరకు కొనుగోలు చేయవద్దని రైతులు చెప్పడంతో వేలం ప్రారంభించకుండా నిలుపుదల చేసి అధికారులు వెళ్లిపోయారు. మధ్యాహ్నం 3 గంటలకు బోర్డు చైర్మన్ వేలం కేంద్రం రైతు సంఘం అధ్యక్షులు కరుటూరి శ్రీనివాస్, రైతు సంఘాల ప్రతినిధులతో సంప్రదించి, కొనుగోలుకు అంగీకరింపజేయడంతో ఎట్టకేలకు వేలం నిర్వహణాధికారి హేమస్మిత వేలం నిర్వహించారు. తొలిరోజు చెరుకుమిల్లి గ్రామం నుంచి 27 బేళ్లు వేలానికి రాగా, 24 బేళ్లు అమ్ముడు పోయాయి. 2,056 కిలోల పొగాకు కొనుగోలు చేసినట్టు హేమస్మిత తెలిపారు. కిలో గరిష్ఠ ధర రూ.265 పలికినట్టు ఆమె తెలిపారు. రీజనల్ మేనేజరు సురేంద్ర కుమార్, రైతు సంఘాల ప్రతినిధులు కాట్రు సత్యనారాయణ, యాగంటి వెంకటేశ్వరరావు, ఆచంట గోపాలకృష్ణ, సత్తి జగదీశ్వరరెడ్డి, సుంకవల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.
గోపాలపురంలో నిలిచిన వేలం
మార్కెట్ పట్ల రైతుల నిరసన
బోర్డు చైర్మన్, రైతుల మధ్య వాగ్వాదం
నాలుగు వేలం కేంద్రాల్లో
ప్రారంభమైన కొనుగోళ్లు


