నేతల చుట్టూ ప్రదక్షిణలు | - | Sakshi
Sakshi News home page

నేతల చుట్టూ ప్రదక్షిణలు

Mar 26 2026 7:47 AM | Updated on Mar 26 2026 7:47 AM

సాక్షి, రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌) శాఖ ఉద్యోగుల్లో బదిలీల భయం పట్టుకుంది. రాజమహేంద్రవరం, కోనసీమ, కాకినాడ, ఏలూరు, భీమవరం సర్కిళ్ల పరిధిలో సాధారణ బదిలీలకు రంగం సిద్ధమైంది. వచ్చే నెలలో ఈ ప్రక్రియ ప్రారంభం అవుతుంది. ఈసారి పెద్ద ఎత్తున మార్పులు ఉంటాయని ఆ శాఖ అధికారుల్లో విస్తృతమైన చర్చ జరుగుతోంది. ఇందులో భాగంగానే తమకు అనువైన ప్రాంతాల్లో పోస్టింగ్‌ పొందడంపై దృష్టి పెడుతున్నారు. అందుకు తమకు అనుకూలమైన మార్గాలను ఎంచుకుంటున్నారు. ఎవరిని సంప్రదిస్తే పని సులువుగా అవుతుంది. ఏ నేతను ఆశ్రయించాలన్న లెక్కలు వేసుకుంటున్నారు. ఆ దిశగా ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. ఆదాయ వనరులు పుష్కలంగా ఉన్న రాజమహేంద్రవరం సర్కిల్‌పై కొందరు ఉద్యోగులు కన్నేశారు. ఎలాగైనా ఇక్కడ స్థానం దక్కించుకోవాలని వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు తమకు పరిచయం ఉన్న టీడీపీ నేతలను ఆశ్రయిస్తున్నారు. వారి ద్వారా పైరవీలు చేస్తున్నారు. ఎలాగైనా తాము ఆశించే సీటును కై వసం చేసుకునేందుకు నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నట్టు సమాచారం.

ఫెవికాల్‌ వీరులకు చెక్‌ పడేనా?

రాజమహేంద్రవరం సర్కిల్‌ పరిధిలోని విద్యుత్‌ శాఖలో కొందరు ఉద్యోగులు కొన్నేళ్లుగా ఇక్కడే తిష్ట వేశారు. అక్రమాదాయం ఉండటంతో బదిలీల సమయంలో ఉన్నతాధికారులకు ఆమ్యామ్యాలు సమర్పించి తమ స్థానాలు పదిలం చేసుకుంటున్నారు. అలాంటి అధికారులకు ప్రస్తుతం చెక్‌ పడే అవకాశం ఉన్నట్లు ఆ శాఖ ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది.

పోలవరం సర్కిల్‌ పరిస్థితేంటో?

నూతనంగా ఏర్పాటైన పోలవరం జిల్లాకు ప్రత్యేకంగా విద్యుత్‌ శాఖ సర్కిల్‌ కార్యాలయాన్ని కేటాయించారు. కానీ అధికారుల నియామకం మాత్రం జరగలేదు. కలెక్టర్‌ను నియమించిన ఉన్నతాధికారులు వచ్చే నెలలో జరిగే బదిల్లో ఎస్‌ఈ పోస్టు భర్తీ చేయనున్నట్లు తెలిసింది. అందులో భాగంగా పోస్టు కోసం ఇప్పటికే పైరవీలు మొదలయ్యాయి. పోలవరం ఎస్‌ఈగా వెళ్లేందుకు ఏలూరు సర్కిల్‌లోని ఓ ఈఈ, వైజాగ్‌ కార్పొరేట్‌ కార్యాలయంలోని ఓ ఈఈ పోటీ పడుతున్నారు. ఎవరి స్థాయిలో వారు పావులు కదుపుతున్నారు. చివరికి ఎవరు విజయం సాధిస్తారో అంతుచిక్కని ప్రశ్నగా మారింది.

వచ్చే నెలలో బదిలీలు

ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్‌)లో ఏప్రిల్‌ నెలలో సాధారణ బదిలీలకు ఆ శాఖ ఉన్నతాధికారులు కసరత్తు ప్రారంభించారు. ఈ పరిణామం ఉద్యోగుల్లో ఉత్కంఠను రేపుతోంది. ముందస్తుగా మేల్కొంటున్న అధికారులు తమకు అనువైన పోస్టింగ్‌ దక్కించుకునేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ప్రధానంగా ఎస్‌ఈ (సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌) పోస్టులకు భారీగా పోటీ నెలకొంది.

కోనసీమ సర్కిల్‌ ఎస్‌ఈ స్థానానికి ఓ ఈఈ పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఆయన అదే శాఖలో ఈఈ టెక్నికల్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. బదిలీలు జరిగితే ఎలాగైనా ఎస్‌ఈ స్థానం దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ మంత్రి, ఎమ్మెల్యేలతో సైతం సిఫారసు చేయించినట్లు తెలిసింది.

కాకినాడ ఎస్‌ఈ త్వరలో పదవీ విరమణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో నూతన ఎస్‌ఈ నియామకం తప్పనిసరి. అతని స్థానం కోసం కోనసీమ సర్కిల్‌లో విధులు నిర్వర్తిస్తున్న ఓ ఉన్నతాధికారిణి ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలిసింది. సదరు అధికారిణికి కూటమి నేతల అండదండలు పుష్కలంగా ఉండటంతో కాకినాడ ఎస్‌ఈకి లైన్‌ క్లియరైనట్లు సమాచారం.

జగ్గంపేట ఈఈ పోస్టు కోసం రాజమహేంద్రవరం సర్కిల్‌లో కన్‌స్ట్రక్షన్‌ (నిర్మాణం) విభాగంలో ఓ ఈఈ(ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌) పావులు కదుపుతున్నట్లు తెలిసింది.

అమలాపురం ఎస్‌ఏఓ (సీనియర్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌) పోస్టు కోసం గతంలో పనిచేసిన ఓ అధికారి ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది.

భీమవరం సర్కిల్‌ ఎస్‌ఈ స్థానానికి మెట్ట ప్రాంతానికి చెందిన ఓ ఈఈ, ఏలూరు సర్కిల్‌ ఎస్‌ఈ పోటీ పడుతున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. భీమవరం సర్కిల్‌ ఏఓ రెవెన్యూ పోస్టుకు విశాఖలోని కార్పొరేట్‌ కార్యాలయంలో ఇద్దరు, రాజమహేంద్రవరం సర్కిల్‌ కార్యాలయంలో ఒకరు తీవ్రంగా పోటీ పడుతున్నారు.

విద్యుత్‌ శాఖలో బదిలీల ఫీవర్‌

వచ్చే నెలలో భారీగా

మార్పులు చేపట్టాలన్న యోచన

అందుకు అనుగుణంగా

పావులు కదుపుతున్న ఉద్యోగులు

తమకు అనువైన ప్రాంతాల్లో

పోస్టింగ్‌ కోసం ప్రయత్నాలు

రాజకీయ నేతల వద్దకు

క్యూ కడుతున్న వైనం

జీతం కంటే.. గీతం వచ్చే స్థానాలపై కన్ను

పోలవరం సర్కిల్‌కు

ఎస్‌ఈ నియామకంపై మీమాంస

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement