ఆత్రేయపురం: వాడపల్లి వేంకటేశ్వరునికి హుండీల ద్వారా 27 రోజులకు రూ.82,94,288 ఆదాయం లభించినట్లు ఆలయ ఈవో, దేవదాయ శాఖ ఉప కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు తెలిపారు. ఆలయ ఆవరణలో బుధవారం జిల్లా దేవదాయ శాఖ అధికారి వి.సత్యనారాయణ, రాజమహేంద్రవరం తనిఖీదారు ఎస్‌టీపీటీ శ్రీనివాస్, గ్రూపు దేవాలయాల ఈవోలు పీవీఎస్ కామేశ్వరరావు, బి.కిరణ్‌ల సమక్షంలో హుండీలు లెక్కించారు. హుండీల ద్వారా విశ్వేశ్వరస్వామి హుండీలతో కలిపి రూ.1,47,36,474, అన్న ప్రసాదం హుండీల ద్వారా రూ.35,57,814 లభించాయన్నారు. బంగారం 19 గ్రాములు, వెండి 860 గ్రాములు, 12 దేశాలకు చెందిన 51 విదేశీ కరెన్సీ నోట్లు లభించాయని తెలిపారు. ఆలయ చైర్మన్ ముదునూరి వెంకటరాజు, కమిటీ సభ్యులు, గ్రామస్తులు, ఆలయ అర్చకులు, వేద పండితులు, సిబ్బంది, శ్రీవారి సేవకులు, రావులపాలెం కెనరా బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్‌ల సిబ్బంది పాల్గొన్నారు.
భీమేశ్వరుని హుండీ ఆదాయం రూ.15.74 లక్షలు
రామచంద్రపురం రూరల్: ద్రాక్షారామలో కొలువై ఉన్న మాణిక్యాంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయ హుండీల ఆదాయం రూ.15,74,920 వచ్చినట్లు దేవస్థానం సహాయ కమిషనర్ అల్లు వెంకట దుర్గా భవాని వెల్లడించారు. ఫిబ్రవరి 12వ తేదీ నుంచి ఈనెల 25 వరకు 42 రోజులకు ఈ హుండీలను లెక్కించారు. అన్నదానం హుండీ ద్వారా రూ.26,333 వచ్చిందని కమిషనర్ తెలిపారు. కార్యక్రమాన్ని రామచంద్రపురం డివిజన్ ఆలయ తనిఖీదారు ఆర్.బాలాజీ రాంప్రసాద్ పర్యవేక్షించారు. ఓదురు గ్రూప్ టెంపుల్స్ ఈఓ విత్తనాల శ్రీనివాస్, కె.గంగవరం గ్రూప్ టెంపుల్స్ ఈఓ టి.బాలకృష్ణ, అర్చకులు, ద్రాక్షారామ పోలీస్ సిబ్బంది సేవా సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.
దాడి కేసులో ముగ్గురి అరెస్టు
అమలాపురం టౌన్: అమలాపురం రోహిణి ఆస్పత్రి వీధిలో గత సంక్రాంతి పండుగ రోజుల్లో ఇద్దరిపై దాడి చేసి డబ్బులు కాజేసిన కేసులో ముగ్గురిని బుధవారం అరెస్ట్ చేసినట్లు సీఐ పి.వీరబాబు తెలిపారు. అప్పట్లో స్థానిక మున్సిపల్ కాలనీకి చెందిన పాలెపు గంగరాజు, దుర్గా ప్రసాద్‌లపై పట్టణంలోని వడ్డెర (ఉప్పర) కాలనీకి చెందిన వేముల సీత, గుంజు దేవి, వేమల దత్తాత్రేయలు దాడి చేశారన్నది అభియోగం. ఈ ఫిర్యాదుపై పట్టణ ఎస్సై ఎన్‌ఆర్ కిషోర్‌బాబు కేసు నమోదు దర్యాప్తు చేశారు. ఈ ముగ్గురి నిందుతులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా మెజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. వారిని రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించినట్లు సీఐ వీరబాబు తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో ఉందని, మరి కొంత మందిని ఇంకా అరెస్టు చేయాల్సి ఉందని ఎస్సై కిషోర్‌బాబు తెలిపారు.
రైలు నుంచి పడి వ్యక్తి మృతి
రాజమహేంద్రవరం సిటీ: కొవ్వూరు రైల్వే స్టేషన్, గోదావరి రైల్వే స్టేషన్‌ల మధ్య గోదావరి ఆర్చ్ బ్రిడ్జి పై సుమారు 27 ఏళ్ల వయసున్న వ్యక్తి గుర్తు తెలియని రైలు నుంచి జారి పడి మృతి చెందాడని జీఆర్పీ హెడ్ కానిస్టేబుల్ వై.నాగేశ్వరావు బుధవారం తెలిపారు. మృతుడు 5.4 అడుగులు ఎత్తు, లైట్ బ్లూ కలర్ జీన్స్ ఫ్యాంట్, లైట్ గ్రీన్ కలర్ చొక్కా ధరించి ఉన్నాడన్నారు. మృతుని వివరాలు తెలిస్తే జీఆర్పీ స్టేషన్ నంబరు 0883 2442821, అధికారి సెల్ నెంబర్ 9154578496ను సంప్రదించాలన్నారు.


