31 నాటికి నూరు శాతం పన్నులు వసూలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

31 నాటికి నూరు శాతం పన్నులు వసూలు చేయాలి

Mar 25 2026 7:14 AM | Updated on Mar 25 2026 7:14 AM

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): గ్రామ పంచాయతీల ఆర్థిక పరిపుష్టి, గ్రామీణ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనకు పన్నులే ప్రధాన ఆధారమని, ఈ నెల 31వ తేదీ నాటికి నూరు శాతం పన్నులు వసూలు అయ్యేలా అధికారులు కట్టుదిట్టంగా పనిచేయాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్‌ కమిషనర్‌ వీఆర్‌ కృష్ణతేజ మైలవరపు స్పష్టం చేశారు. విధుల్లో నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్న అధికారులపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, పనితీరు మెరుగుపర్చుకోని క్షేత్రస్థాయి పంచాయతీ సిబ్బందికి షోకాజ్‌ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. స్థానిక ఆనం కళాకేంద్రంలో గ్రామీణ అభివృద్ధి, పంచాయతీరాజ్‌ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలపై పంచాయతీ సెక్రటరీలు, గ్రామ అభివృద్ధి అధికారులు, ఎంపీడీవోలు, ఇతర అధికారులతో మంగళవారం ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా కృష్ణతేజ మాట్లాడుతూ జిల్లాలోని కొన్ని గ్రామ పంచాయతీలలో భారీ మొత్తంలో పన్నులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొంటూ, ఎంపీడీవోలు ప్రత్యేక దృష్టి సారించి వసూలు ప్రక్రియను వేగవంతం చేయాలని సూచించారు. జిల్లా పంచాయతీ అధికారి వి.శాంతకుమారి మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటికి రూ.82 కోట్ల పన్ను వసూలు జరిగినట్లు తెలిపారు. గ్రామాల వారీగా ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి మిగిలిన పన్నుల వసూలు త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సమావేశంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జెడ్పీ సీఈవో వీవీ లక్ష్మణ్‌, డీడీవోలు పి.వీణాదేవి, ఎ.స్లీవారెడ్డి, డీఎల్‌పీవో ఎం.నాగలత తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement