కంబాలచెరువు (రాజమహేంద్రవరం): క్షయ వ్యాధిపై నిర్లక్ష్యం వీడి, ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ మేఘ స్వరూప్ అన్నారు. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం సందర్భంగా మంగళవారం రాజమహేంద్రవరంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్ట్స్ కళాశాలలో సమావేశం నిర్వహించారు. ముందుగా రాబర్ట్ కోచ్ చిత్రపటానికి పూలమాలలు వేసి, జ్యోతి ప్రజ్వలన చేశారు. క్షయ వ్యాఽధిపై నిర్వహించిన అవగాహన పోటీలలో విజేతలకు సర్టిఫికెట్లు అందజేసి, ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ 1882లో రాబర్ట్ కోచ్ క్షయవ్యాధికి కారణమైన జీవాణువును కనుగొనడం వైద్య రంగంలో ఒక గొప్ప మైలురాయన్నారు. ప్రజల భాగస్వామ్యంతో క్షయవ్యాధిని పూర్తిగా నిర్మూలించవచ్చన్నారు. జిల్లా కుష్ఠు నివారణ అధికారి డాక్టర్ ఎన్.వసుంధర మాట్లాడుతూ కుష్ఠు వ్యాధిని నిర్మూలిద్దాం, ప్రజల భాగస్వామ్యం కీలకం అనే నినాదంతో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఐఎంఏ సభ్యులు, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు.
నేటి నుంచి పొగాకు కొనుగోళ్లు
దేవరపల్లి: రాజమహేంద్రవరం రీజియన్ పరిధిలోని ఐదు వేలం కేంద్రాల్లో బుధవారం పొగాకు కొనుగోళ్లను ప్రారంభిస్తున్నట్టు టుబాకో బోర్డు రీజినల్ మేనేజర్ జె.సురేంద్ర కుమార్ తెలిపారు. ఆయన మంగళవారం దేవరపల్లి పొగాకు వేలం కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పొగాకు బయట అమ్మకాలను నియంత్రించడానికి గ్రామస్థాయిలో విజిలెన్స్ కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. బోర్డు చైర్మన్ సీహెచ్ యశ్వంత్ కుమార్ జంగారెడ్డిగూడెంలో వేలం ప్రారంభిస్తారని, అనంతరం ఐదు వేలం కేంద్రాలను సందర్శిస్తారన్నారు. గ్రామస్థాయి విజిలెన్స్ కమిటీలకు రైతులు సహకరించాలని, పొగాకు అక్రమ అమ్మకాల సమాచారాన్ని విజిలెన్స్ కమిటీకి తెలియజేయాలన్నారు. గత ఏడాది ఐదు వేలం కేంద్రాల్లో సుమారు 4 మిలియన్ల కిలోల పొగాకు బయట అమ్మకాలు జరిగినట్టు సమాచారం ఉందన్నారు. ఈ ఏడాది కిలో సగటు ధర రూ.320 లభించవచ్చునని తెలిపారు. సమావేశంలో వేలం కేంద్రం నిర్వహణాధికారి పి.హేమస్మిత, పొగాకు రైతు సంఘం ప్రతినిధులు కాట్రు భీమరాజు, సత్తి జగదీశ్వరరెడ్డి, యాగంటి వెంకటేశ్వరరావు, దుద్దునూడి హరిబాబు, రైతులు పాల్గొన్నారు.


