నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారు | - | Sakshi
Sakshi News home page

నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టారు

Mar 24 2026 7:56 AM | Updated on Mar 24 2026 7:56 AM

చంద్రబాబు పాలనలో

లక్షల ఉద్యోగాలు పీకేశారు

1.72 లక్షల ఖాళీలకు

10,060 పోస్టులకు జాబ్‌ క్యాలెండరా?

ప్రజలను మోసగించడంలో

చంద్రబాబు సిద్ధహస్తుడు

వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం

రాష్ట్ర అధ్యక్షుడు జక్కంపూడి రాజా

సాక్షి, రాజమహేంద్రవరం: ఉగాది రోజు జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో చంద్రబాబు ప్రభుత్వం నిరుద్యోగులకు పచ్చడికి బదులు మట్టి కొట్టిందని వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 22 నెలల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో 1.72 లక్షల ఉద్యోగులను తీసేశారని అన్నారు. స్థానిక నివాసంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఐదేళ్లలో 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని ప్రకటించి నిరుద్యోగులను మోసం చేశారన్నారు. అదే సమయంలో లక్షల మంది ఉద్యోగులను ఇంటికి పంపిస్తున్నారని.. పైకి మాత్రం జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో హంగామా చేస్తున్నారని విమర్శించారు. 2024 మార్చి నాటికి రాష్ట్రంలో 11.79 లక్షల మంది ఉద్యోగులు ఉంటే 2025 డిసెంబర్‌ నాటికి 10.07 లక్షలకు తగ్గారని అసెంబ్లీలో ద్రవ్య విధాన పత్రంలో పేర్కొన్నారన్నారు.

హామీ అమలేదీ?

2024లో కూటమి ఉమ్మడి మేనిఫెస్టోలో ఏటా జనవరి 1న జాబ్‌ క్యాలెండర్‌ రిలీజ్‌ చేస్తామని ప్రకటించారు. అప్పటి వరకు ఒక్కో నిరుద్యోగికి రూ.3 వేలు భృతి చెల్లిస్తామన్నారు. 22 నెలల కాలంలో మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా పైసా కూడా కేటాయించిన దాఖలాలు లేవని దుయ్యబట్టారు. ఎన్నికల సమయంలో వలంటీర్ల జీతాన్ని రూ.10 వేలకు పెంచుతామని గద్దె నెక్కి.. అధికారంలోకి వచ్చాక 2.66 లక్షల మందిని రోడ్డున పడేశారన్నారు. రాష్ట్రంలో ఏటా 75 వేల మంది వయసు, ఇతర కారణాలతో ఉద్యోగాలకు అర్హత కోల్పోతుంటే 10,060 మందికి మాత్రమే జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయడం శోచనీయమన్నారు. ఉద్యోగాలు కూడా వచ్చే అక్టోబర్‌ లోపు విడతల వారీగా భర్తీ చేస్తామని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. పోలీస్‌ శాఖలో 11 వేల పోస్టులు ఖాళీ ఉన్నాయని స్వయంగా డీజీపీ ప్రకటిస్తే కేవలం 2,778 పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్‌ ఇచ్చారన్నారు. ఆరోగ్య శాఖలో 15 వేలు, పాలిటెక్నిక్‌ కళాశాలల్లో 975, ఎలక్ట్రికల్‌ డిపార్ట్‌మెంట్‌లో 4,130, జెన్‌కో 2,307, ఏపీ ట్రాన్స్‌కో 5,137 ఇలా అన్ని శాఖల్లోనూ వేల సంఖ్యలో ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయన్నారు. రాష్ట్రంలో సుమారు కోటి మంది నిరుద్యోగులు ఉన్నారని పచ్చ పత్రికలో కథనాలు ఇచ్చారన్నారు. ఈ లెక్కన ఒక్కో నిరుద్యోగికి రూ.3 వేలు లెక్కన రూ.66 వేల కోట్లు బకాయి పడ్డారన్నారు. చంద్రబాబు అసెంబ్లీ సాక్షిగా రెండేళ్ల కాలంలో 6.28 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చినట్లు ప్రకటిస్తే, శాసనమండలిలో మంత్రి 5.72 లక్షల మందికి ఇచ్చారంటూ అంకెల గారడీ చేస్తున్నారన్నారు. నిరుద్యోగుల సమస్యలను గాలికి వదిలి ఇప్పుడు 54,903 కన్సల్టెంట్లను ఏర్పాటు చేసుకొని రూ.3 వేల కోట్లు జీతాలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆరోపించారు. ఉమెన్‌ అండ్‌ చైల్డ్‌ వెల్ఫేర్‌లో 243 మంది నియామకానికి ఆర్థిక శాఖ అనుమతి ఇస్తే భర్తీకి చర్యలు లేవన్నారు.

భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం

నిరుద్యోగులను మోసం చేసిన చంద్రబాబు, పవన్‌, లోకేష్‌లను కోడిగుడ్లు, రాళ్లతో కొట్టే పరిస్థితి వస్తుందని రాజా అన్నారు. ఇప్పటికై నా చేసిన తప్పును గ్రహించి నిరుద్యోగులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో నిరుద్యోగుల పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయన్నారు. ప్రశ్నించిన వారిపై కక్ష సాధింపులు, బెదిరింపులు, భౌతిక దాడులు, కత్తులు పెట్టి నడిరోడ్లపై నరకడం వంటి పరిస్థితులు చూస్తున్నామన్నారు. ఇలాంటి సంస్కృతి వల్ల రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు సాహసించడం లేదన్నారు. సమావేశంలో పార్టీ నగర మాజీ అధ్యక్షుడు నందెపు శ్రీనివాస్‌, జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు అడబాల చినబాబు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ హయాంలో ఉద్యోగ విప్లవం

దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 1.34 లక్షల మందికి ఒకే నోటిఫికేషన్‌లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థలో ఉద్యోగాలు ఇచ్చిన ఘనత గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. 58 వేల ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసి వారి జీవితాల్లో వెలుగులు నింపిన ఘనత మాజీ సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. 78 నోటిఫికేషన్లతో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement