కంబాలచెరువు(రాజమహేంద్రవరం): జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పీజీఆర్‌ఎస్‌కు 47 ఫిర్యాదులు వచ్చాయి. ఎస్పీ డి.నరసింహకిశోర్ ఆర్జీదారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అర్జీలపై సంబంధిత స్టేషన్ పోలీసు అధికారులతో ఫోన్‌లో మాట్లాడి ఫిర్యాదుదారుల సమస్యలను చట్ట పరిధిలో పరిష్కరించి, సత్వరమే న్యాయం చేయాలని ఉత్తర్వులు ఇచ్చారు. పీజీఆర్‌ఎస్‌కు సివిల్ కేసులు, కుటుంబ సమస్యలు, చీటింగ్ కేసులు, కొట్లాట కేసులు, ఇతర కేసులకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించారు. కార్యక్రమంలో ఏఎస్పీ ఎంబీఎన్ మురళీకష్ణ పాల్గొన్నారు.
కల్తీపాల ఘటనలో
మరొకరు డిశ్చార్జి
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): కల్తీపాల ఘటనలో రాజమహేంద్రవరం కిమ్స్ బొల్లినేని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జి.వెంకటేశ్వరరావు కోలుకుని సోమవారం డిశ్చార్జి అయ్యారు. గత నెల 16న కల్తీపాలు తాగి 21 మంది రాజమహేంద్రవరంలోని వివిధ ఆసుపత్రుల్లో చేరారు. అయితే వారికి అత్యవసర వైద్య చికిత్సలు అందించినా వీరిలో ఇప్పటి వరకు 17 మంది మృత్యువాత పడ్డారు. నలుగురు వైద్య చికిత్సలు పొందుతుండగా ఈ నెల 16న ఒకరు ఆరోగ్యం మెరుగుపడి డిశ్చార్జి అయిన విషయం తెలిసిందే. దీంతో కల్తీ పాల ఘటనలో కోలుకుని ఇంటికి వెళ్లిన వారి సంఖ్య రెండుకు చేరింది. అయితే ఇంకా ఇద్దరు చిన్నారులు రెయిన్‌బో చిల్డ్రన్ ఆసుపత్రిలో అత్యవసర వైద్య చికిత్స పొందుతున్నారు.
జాతీయ స్థాయి సెపక్ తక్రా
పోటీలకు కోనసీమ విద్యార్థులు
అమలాపురం రూరల్: ఈ నెల 24 నుంచి 28 వరకు జార్ఖండ్ రాష్ట్రం రాంచీ వేదికగా 28వ సబ్–జూనియర్ బాల బాలికల జాతీయ స్థాయి సెపక్ తక్రా పోటీలు జరుగుతున్నట్లు జిల్లా అధ్యక్షుడు జవ్వాది తాత బాబు తెలిపారు. కోనసీమ జిల్లా నుంచి గోసంగి సందీప్, జి.శశిధర్ నాగ్, సాయి సూర్య, అప్పారి యశ్వంత్, మట్టపర్తి అవంతి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. జిల్లాలో ఈ క్రీడా దినదినాభివృద్ధి చెందుతోందని, దానికి నిదర్శనమే ఈ ఐదుగురు జాతీయ స్థాయికి ఎంపిక అవడమని తెలిపారు. జిల్లాకు చెందిన కేత సాయి దుర్గా ప్రసాద్, రాష్ట్ర బాలుర, బాలికల జట్టు కోచ్‌గా యాండ్ర గౌతమ్, కోచ్‌లు గా రాష్ట్ర కార్యదర్శి ఎ.శ్రీనివాసులను నియమించినట్లు తెలిపారు. జిల్లా క్రీడాకారులు రాంచీలో శిక్షణలో ఉన్నారని, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొని స్వర్ణ పతకం తీసుకురావాలని తెలిపారు.
ఉమ్మడి గోదావరి జిల్లా
స్ట్రాంగ్ మెన్ వీరేంద్ర
అమలాపురం రూరల్: ఉమ్మడి గోదావరి జిల్లాల స్ట్రాంగ్ మెన్ విన్నర్‌గా అమలాపురానికి చెందిన ఎం.వీరేంద్ర, రన్నర్‌గా యశ్వంత్ గెలుపొందారు. హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్ ఆధ్వర్యంలో ఈదరపల్లిలో జనహిత కార్యాలయంలో జరిగిన పోటీలు సోమవారంతో ముగిసాయి. పోటీలలో 206 మంది సబ్ జూనియర్, జూనియర్, సీనియర్, మాస్టర్స్ విభాగాల్లో పోటీ పడగా అమలాపురం హెల్త్ అండ్ ఫిట్నెస్ జిమ్‌కు చెందిన వీరేంద్ర 690 కేజీల బరువును ఎత్తి స్ట్రాంగ్ మెన్‌గా నిలిచారు. యశ్వంత్ 570 కేజీల బరుఎత్తి రన్నర్‌గా గెలుపొందారు. ఏప్రిల్ 3, 4, 5 తేదీల్లో విజయనగరం జిల్లా రాజాంలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోటీలకు జిల్లా నుంచి 24 మందిని జిల్లా జట్టుకు ఎంపిక చేసినట్టు కోచ్ వెంకటేశ్వరరావు తెలిపారు.


