● ఈద్ ముబారక్
పవిత్ర రంజాన్ మాస ఉపవాస దీక్షల అనంతరం జిల్లావ్యాప్తంగా ముస్లింలు శనివారం ఈద్ ఉల్ ఫితర్ (రంజాన్) పండగను ఘనంగా నిర్వహించుకున్నారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని కోరుతూ మసీదుల వద్ద సామూహికంగా ప్రత్యేక ప్రార్థనలు (దువా) నిర్వహించారు. పరస్పరం ఆత్మీయ ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు చెప్పుకొన్నారు. మత పెద్దలు ఖురాన్ చదివి వినిపించారు. సంపాదించిన దానిలో కొంత మొత్తాన్ని పేదలకు దానధర్మాలు చేయాలని, అలా చేసే వారి పట్ల అల్లాహ్ దయ ఎన్నటికీ ఉంటుందని మత పెద్దలు చెప్పారు. రాజమహేంద్రవరం రాజేంద్ర నగర్ దర్గాలో వేలాది మంది ముస్లింలు దువా చేసి స్వీట్లు పంచుకున్నారు.
– సీటీఆర్‌ఐ (రాజమహేంద్రవరం)
ప్రాభవం తగ్గుతూ..
ఇళ్ల వద్ద మూలకు చేరిన రాతి రోళ్లు
● రాతి పనిముట్లకు తగ్గిన ఆదరణ
● శుభకార్యాలకే పరిమితమవుతున్న
రోళ్లు, సన్నికల్లు, తిరగళ్లు
● ఆధునికత మేళవింపుతో
అక్కడక్కడ అమ్మకాలు
పిఠాపురం: ఒకప్పుడు ఏ ఇంట చూసినా రోలు, రోకలి, కల్వం, రుబ్బురోలు, సన్నికల్లు వంటి రాతి పనిముట్లు అతివలకు వంటింటి నేస్తాలుగా ఉండేవి. వీటిని సాక్షాత్తూ దైవ స్వరూపాలుగా భావించేవారు. రోలు సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మి.. రోకలి శ్రీమన్నారాయణుడు.. తిరగలి శివుడు.. దాని పిడి పార్వతీదేవి.. ఈ పవిత్ర భావనతోనే వాటికి పొరపాటున కూడా కాలు తగలకుండా జాగ్రత్త పడేవారు. ఒకవేళ అలా కాలు తగిలితే మహాపాపంగా భావించేవారు. ప్రతి ఇంట్లో ఆయా రాతి పనిముట్లకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. కానీ, కాలక్రమంలో మిక్సీలు, గ్రైండర్ల వంటి ఆధునిక గృహోపకరణాలు వచ్చిన తరువాత నాటి శ్రీపాత రాతి యుగంశ్రీ ప్రాభవం క్రమంగా తగ్గుతోంది. అక్కడక్కడ కనిపిస్తున్నప్పటికీ.. ఎక్కువగా వివాహాది శుభకార్యాల్లో.. అది కూడా పసుపు కొట్టడం వంటి కార్యక్రమాలకే పరిమితమవుతోంది.
ఆ రుచే వేరు
పండగలు సమీపిస్తున్నా, ఊరగాయల సీజన్ మొదలైనా.. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగబోతున్నా.. గతంలో రోళ్లు, రోకళ్లు, తిరగళ్లు, సన్నికల్లు వంటి రాతి పనిముట్లకు బోలెడంత పని. పప్పులను రోటిలో దంచేవారు. మసాలాలు కల్వంలో నూరేవారు. రుబ్బురోటిలో చేసే రోటి పచ్చడి అంటే ఇప్పటికీ చాలా మంది శ్రీఆ రుచే వేరుశ్రీ అంటూ లొట్టలేస్తారు. అంతే కాదు.. వీటిల్లో ఎప్పటికప్పుడు తయారు చేసే పచ్చళ్లు, రకరకాల పొడులు తాజాగా ఉంటాయి.
అంతా రెడీమేడ్
పాత కాలం నాటి రాతి పనిముట్లు వాడాలనే ఆసక్తి ఉన్నప్పటికీ.. ఆధునిక జీవితంలో వేగం పెరిగింది. బతుకుతెరువు కోసం కాలంతో పోటీ పడాల్సిన పరిస్థితి. అటువంటి వారి కోసం మిక్సీలు, గ్రైండర్ల వంటి రకరకాల యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. ఇవి పాత రాతి పనిముట్ల స్థానాన్ని ఆక్రమించాయి. గతంలో పెళ్లి కుదిరిందంటే రెండు నెలల ముందు నుంచి వడ్లు దంచుకోవడం, కారం, పసుపు కొట్టడం, అరిసెల పిండి దంచడం వంటి పనులను పది మంది కలసి చేసేవారు. ఇప్పుడన్నింటికీ యంత్రాలే. పైగా, అన్నీ షాపులో రెడీమేడ్‌గా దొరుకుతున్నాయి. కారం, పసుపు, పిండి, చివరకు ఊరగాయలు, కూరలు కూడా రెడీమేడ్. అయితే, వీటిలో ఏ కల్తీలు జరుగుతున్నాయో.. మన ఆరోగ్యానికి ఎంత చేటు చేస్తున్నాయో గమనించే పరిస్థితి కూడా ఉండటం లేదు.
ఆధునిక రూపంలో..
రోళ్లు, రోకళ్లు, తిరగలి ఎంత పెద్దగా ఉన్నా గతంలో చాలా సులభంగా ఉపయోగించేవారు. తిరగలి పై భాగాన్ని సులువుగా లేపేవారు. మరీ పెద్దదైతే ఇద్దరు కలిసి లేపేవారు. రుబ్బురోలు పొత్రాన్ని సులభంగా ఎత్తేవారు. ఇప్పుడు ఎవ్వరికీ రోటిలో దంచే తీరికా లేదు.. పొత్రం ఎత్తే ఓపికా లేదు. అయితే, ఈ పనిముట్లపై ఇప్పటికీ కొంత మందికి మోజు ఉంది. వారిని దృష్టిలో పెట్టుకుని వీటి తయారీదారులు ఇప్పటి అవసరాలకు తగినట్లుగా రాతి రోళ్ల తయారీలో స్మార్ట్ టెక్నిక్స్ వాడుతున్నారు. మార్బుల్, గ్రానైట్‌తో పాటు సోప్ స్టోన్స్, శాండ్ స్టోన్లతో తక్కువ బరువుతో ఈ పనిముట్లు తయారు చేస్తున్నారు. రుబ్బుతున్నప్పుడు, విసురుతున్నప్పుడు పిండి సులువుగా తీసుకునేందుకు అనుకూలంగా ట్రేలు ఏర్పాటు చేస్తున్నారు. తిరగలిలో పైన పప్పులు పోసేందుకు చెక్కతో మూతలు సైతం ఏర్పాటు చేస్తున్నారు. సన్నికల్లును సన్నగా కత్తిరిస్తున్నారు. రుబ్బురోలుకు స్టెయిన్‌లెస్ స్టీల్ హ్యాండిల్స్ పెడుతున్నారు. ఆధునిక కిచెన్లకు సంప్రదాయ పనిముట్లను జోడించేలా వీటిని తయారు చేస్తున్నారు.
నాపరాతితో తయారు చేసిన స్మార్ట్ రుబ్బురోలు
స్మార్ట్ రాతి పరికరాలు
పెళ్లిళ్లలోనే ప్రాధాన్యం
వివిధ ప్రాంతాలు, సంప్రదాయాలకు అనుగుణంగా వివాహ వేడుకల్లో రాతి రోళ్లకు ఇప్పటికీ ప్రాధాన్యం ఉంది. ప్రతి శుభకార్యానికీ పసుపు కొట్టడం ఆనవాయితీ. వీటితో ధాన్యం దంచడం, కొట్నాలు వంటి సంప్రదాయ పద్ధతులు ఇప్పటికీ నిర్వహిస్తున్నారు. ఎక్కువ మంది తమ ఇళ్లల్లో చాన్నాళ్లుగా పక్కన పెట్టేసిన వీటిని శుభకార్యాల్లో మాత్రం తప్పనిసరిగా బయటకు తీస్తారు. కొందరైతే రెడీమేడ్ పనిముట్లతో శుభకార్యాలు పూర్తి చేస్తున్నారు. పెళ్లితంతులను బట్టి వీటికి ప్రాధాన్యం పెరుగుతుంది. బ్రాహ్మణ కుటుంబాల్లో అయితే తాళిబొట్టును రోకలికి, కాడికి కట్టి, పాలు పోస్తూం చేసే పద్ధతి ఇప్పటికీ కొనసాగుతోంది.
– వెలిది రమేష్‌శర్మ, పురోహితుడు, కొత్తపల్లి


