పెద్దాపురం (సామర్లకోట): తొలి తిరుపతిగా ప్రసిద్ధి చెందిన పెద్దాపురం మండలం తిరుపతి గ్రామంలో కొలువైయున్న శృంగార వల్లభ స్వామి ఆలయానికి ఽశనివారం భక్తులు వేలాదిగా పోటెత్తారు. సెలవు రోజు కావడంతో తెల్లవారుజాము నుంచే అధిక సంఖ్యలో భక్తులు వివిధ గ్రామాల నుంచి స్వామి వారి దర్శనానికి రావడంతో ఆలయం రద్దీగా మారింది. స్వామివారి తొలి హారతిని తిలకించడానికి భక్తులు పోటీ పడ్డారు. సుమారు 35 వేల మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నట్లు ఆలయ ఈఓ వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. ఆలయాన్ని పూలమాలలతో అలంకరించి, స్వామివారికి అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రత్యేక దర్శనం టికెట్ల ద్వారా రూ.2,39,875, అన్నదాన విరాళాలు రూ.84,972, కేశఖండన ద్వారా రూ.6,760, తులాభారం ద్వారా రూ.550, లడ్డూ ప్రసాద విక్రయం ద్వారా రూ.22,095 కలిపి మొత్తం రూ.3,54,147 ఆదాయం సమకూరిందని ఈఓ వివరించారు. ఏడు వేల మంది భక్తులు స్వామివారి అన్నప్రసాదం స్వీకరించారని తెలిపారు. భక్తులకు గ్రామ సర్పంచ్ మొయిలి కృష్ణమూర్తి, ట్రస్టు బోర్డు చైర్‌పర్సన్ మొయిలి సంధ్య, దేవస్థానం సిబ్బంది, గ్రామ పెద్దలు సేవలందించారు.
ఘనంగా పందిరి రాట
ముహూర్తం
అన్నవరం: ఈ నెల 26న ప్రారంభం కానున్న రత్నగిరి క్షేత్ర పాలకుడు శ్రీ సీతారామచంద్రస్వామివారి శ్రీరామ నవమి వేడుకలకు, వచ్చే నెల 26 నుంచి జరగనున్న సత్యదేవుని కల్యాణ మహోత్సవాలకు శనివారం రాట ముహూర్తం ఘనంగా నిర్వహించారు. రత్నగిరి రామాలయం వద్ద పండితులు విఘ్నేశ్వర పూజ తదితర కార్యక్రమాలు నిర్వహించి, మంత్రోచ్చారణల నడుమ ఉదయం 10.25 గంటలకు పందిరి రాట వేశారు. దేవస్థానం చైర్మన్ ఐవీ రోహిత్, ఈఓ వి.త్రినాథరావు దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సరైన భద్రతా ఏర్పాట్లు లేకపోవడంతో ఈ కార్యక్రమంలో తోపులాట జరిగింది. పెద్ద ఎత్తున వచ్చిన మహిళలు చైర్మన్, ఈఓల కన్నా ముందుగానే పందిరి రాటను ముట్టుకునేందుకు పోటీ పడ్డారు. వారిని నియంత్రించేందుకు సెక్యూరిటీ సిబ్బంది లేకపోవడంతో కొంతసేపు గందరగోళం ఏర్పడింది. ఈఓ దంపతుల మధ్య నుంచే ఒక మహిళ చేయిపెట్టి పందిరి రాటను పట్టుకోవడం వివాదాస్పదమైంది. ఈ కార్యక్రమం గురించి ముందుగానే ప్రకటించినప్పటికీ తగిన ఏర్పాట్లు చేయలేదంటూ సిబ్బందిపై ఈఓ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


