కపిలేశ్వరపురం (మండపేట): ఉగాది రోజున రాష్ట్ర ప్రజలకు కానుక ఇచ్చామంటూ చంద్రబాబు ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన ప్రకటన కంటితుడుపు చర్య మాత్రమేనని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. 20 నెలల చంద్రబాబు పాలనలో 6,28,347 ఉద్యోగాలిచ్చామంటూ ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు చెప్పడాన్ని తీవ్రంగా ఖండించారు. అధికారంలోకి వచ్చాక 20 లక్షల ఉద్యోగాలిస్తామంటూ సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నేతలు ప్రకటించారని గుర్తు చేశారు. ఆరు లక్షలకు పైగా ఉద్యోగాలిచ్చామంటూ ప్రభుత్వం చెబుతున్న గణాంకాలన్నీ అబద్ధాలని ప్రజా సంఘాల నాయకులు చెబుతున్నారన్నారు. రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులతో 25 లక్షల ఉద్యోగావకాశాలు కల్పించే దిశగా ఒప్పందాలు చేసుకున్నామంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలు బూటకమన్నారు. రాష్ట్రంలో ఏయే కంపెనీఎల్లో ఎంత మందికి ఉద్యోగాలొచ్చాయో నియామక ఆర్డర్లతో కూడిన వివరాలను వెల్లడించాలని డిమాండ్ చేశారు. అవినీతి, అక్రమాలు, అరాచక పాలనతో సామాన్య ప్రజలకు ప్రభుత్వం పట్ల అసహనం కలుగుతోందన్నారు. విసిగి వేసారిన నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఉద్యోగాల్లో చేరిన వారు ప్రభుత్వ పరంగా సేవలందిస్తున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు పాలన తీరుపై వైఎస్సార్ సీపీ ఉద్యమిస్తుందని, ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చాలనే డిమాండ్‌తో ప్రజలతో కలిసి పోరాడతామని ఎమ్మెల్సీ తోట స్పష్టం చేశారు.


