గెలగిల | - | Sakshi
Sakshi News home page

గెలగిల

Mar 22 2026 1:54 AM | Updated on Mar 22 2026 1:54 AM

ఆదివారం శ్రీ 22 శ్రీ మార్చి శ్రీ 2026

ఖండవల్లిలో అరటి తోట

పెరవలి: ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందన్నట్టు.. ఇతర రాష్ట్రాల్లో ఉత్పత్తి ఇబ్బడిముబ్బడిగా పెరగడం.. మన అరటి రైతులకు నష్టాల్ని తెచ్చి పెడుతోంది. నెల రోజుల క్రితం వరకూ 10 టన్నుల లారీ అరటి గెలల ధర రూ.2.20 లక్షలు పలకగా.. ప్రస్తుతం అది సగానికి పైగా తగ్గి, రూ.లక్షకు పడిపోయింది. తోటల వైపు కన్నెత్తి కూడా చూసేవారు లేకపోవడంతో రైతులు.. ఒకవేళ గెలలు కొన్నా అమ్ముకునే దారి లేక వ్యాపారులు దిక్కు తోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. పక్వానికి వచ్చిన గెలలు తోటల్లోనే ముగ్గిపోతూండటం చూసి రైతులు తల్లడిల్లుతున్నారు. వాటిని అలాగే వదిలేయలేక కొంత మంది పక్వానికి వచ్చిన గెలలను మార్కెట్‌కు తరలించి, అయినకాడికి అమ్ముకుంటున్నారు.

7,500 హెక్టార్లలో..

జిల్లాలో అన్ని రకాలు కలిపి 7,500 హెక్టార్లలో అరటి సాగు జరుగుతోంది. పెరవలి, నిడదవోలు, ఉండ్రాజవరం, నల్లజర్ల, చాగల్లు, కొవ్వూరు, దేవరపల్లి, గోపాలపురం, తాళ్లపూడి, సీతానగరం, రాజానగరం, అనపర్తి తదితర మండలాల్లో దాదాపు 8 వేల మంది రైతులు అరటి సాగు చేస్తున్నారు. అరటి తోటలను నమ్ముకుని కూలీలు, వెదురు వేసే కూలీలు, గెలలకు అరటి ఆకులు చుట్టే కూలీలు, గెలలు కోసే కూలీలు, అరటి వ్యాపారులు సుమారు 30 వేల మంది ఉన్నారు. మార్కెట్లో ధరలు పడిపోవడంతో వీరందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఎగుమతులకు బ్రేక్‌

గత ఏడాది డిసెంబర్‌లో 10 టన్నుల అరటి ధర రూ.1.80 లక్షలు పలకగా.. అప్పటి నుంచీ అది క్రమంగా పెరుగుతూ గత నెలలో ఏకంగా రూ.2.20 లక్షలకు చేరింది. మన జిల్లా నుంచి ఒడిశా, తమిళనాడు, పశ్చిమ బెంగాల్‌, బిహార్‌ తదితర రాష్ట్రాలకు అరటి ఎగుమతులు జరిగేవి. గతంలో బెంగాల్‌లో అరటి సాగు పెద్దగా ఉండేది కాదు. ఇప్పుడు అక్కడ ఇతర రాష్ట్రాలకు సైతం ఎగుమతి చేసే స్థాయిలో సాగు జరుగుతోంది. దీనికితోడు తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో కొన్నాళ్లుగా అరటి ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. ఫలితంగా మన అరటికి నెల రోజులుగా డిమాండ్‌ తగ్గింది. ఎగుమతులు క్రమంగా తగ్గిపోయాయి. గతంలో జిల్లా నుంచి ప్రతి రోజూ 80 నుంచి 100 లారీల గెలల ఎగుమతి జరిగితే నేడు అది 40 నుంచి 50 లారీలకే పరిమితమవుతోంది. ఈ పరిస్థితుల్లో మన జిల్లాలో అరటి ధరల పతనమవుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ప్రస్తుతం జిల్లాలో 6 వేల హెక్టార్లలో తోటల నుంచి దిగుబడి వచ్చే పరిస్థితి ఉంది. కానీ, ఇతర రాష్టాలకు ఎగుమతులు పడిపోయాయి. ఆ సరకంతా స్థానిక మార్కెట్లకు ఒక్కసారిగా వస్తూండటంతో ఇక్కడ కూడా రైతులు ఆశించిన ధర రావడం లేదు. మరోవైపు ఎగుమతులు కూడా తగినంతగా లేక నష్టాల ఊబిలో కూరుకుపోతున్నామని స్థానిక వ్యాపారులు గగ్గోలు పెడుతున్నారు.

ధరలు పతనమయ్యాయిలా..

ప్రస్తుతం మార్కెట్లో 10 టన్నుల లారీ కర్పూర అరటి ధర గతంలో రూ.2 లక్షల వరకూ పలకగా.. ప్రస్తుతం రూ.లక్షకు పతనమైంది. గతంలో వ్యాపారులు తోటలు కొనుగోలు చేసినప్పుడు చక్కెరకేళీ గెలకు రూ.250 నుంచి రూ.300 వరకూ పెట్టారు. ప్రస్తుతం దానికి రూ.250 మాత్రమే దక్కుతోంది. అలాగే, ఎర్ర చక్కెరకేళీ గెలకు తోటల వద్ద రూ.400 నుంచి రూ.500 వరకూ పెట్టగా, మార్కెట్లో ఇప్పుడు రూ.300 మాత్రమే వస్తోంది. ఫలితంగా తాము తీవ్రంగా నష్టపోతున్నామని వ్యాపారులు వాపోతున్నారు. మార్కెట్లో ధర లేకపోవడంతో వారు తోటలను వదిలేస్తున్నారు. అయితే, పక్వానికి వచ్చిన గెలలు కోయకపోతే అది పండిపోయి మొత్తం తోట పాడైపోతుందని, దీంతో మొదటికే మోసం వస్తుందని రైతులు వాపోతున్నారు. ఈ పరిస్థితుల్లో కొంత మంది రైతులు గెలలను సైకిళ్లపై మార్కెట్‌కు తరలించి అమ్ముకుంటున్నారు. మార్కెట్లో సైకిల్‌ లోడ్‌ (6 గెలలు) కర్పూరం అయితే నాణ్యతను బట్టి రూ.వెయ్యి నుంచి రూ.1,200, చక్కెరకేళీకి రూ.1,500 నుంచి రూ.2 వేలు, ఎర్ర చక్కెరకేళీకి రూ.2 వేల నుంచి రూ.2,500 వరకూ ధర పలుకుతోంది.

కుదేలైన అరటి ధరలు

నెల క్రితం 10 టన్నుల లారీ ధర రూ.2.20 లక్షలు

నేడు రూ.లక్ష

గతంలో రోజూ 100 లారీల్లో ఇతర రాష్ట్రాలకు..

ప్రస్తుతం అందులో సగమే ఎగుమతులు

రైతులు, వ్యాపారుల గగ్గోలు

నష్టపోతున్నాం

తోటలు అమ్మినప్పుడు ధరలు బాగానే ఉన్నాయి. ఒక్కో గెలను రూ.250కి అమ్మాను. సగం తోట కోసిన తరువాత ధరలు పతనమవడంతో వ్యాపారులు గెలలు కోయడమే మానేశారు. దీంతో నష్టాల పాలవుతున్నాం.

– కాపకా పాపారావు, అరటి రైతు, కాకరపర్రు, పెరవలి మండలం

గెలలు పాడైపోతున్నాయి

ఈ ఏడాది ప్రారంభంలో ధరలు బాగానే ఉన్నాయి. నెల రోజులుగా ధరలు తగ్గడంతో వ్యాపారులు తోటల వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. పక్వానికి వచ్చిన గెలలు ముగ్గిపోయి, పాడైపోతున్నాయి.

– సంఖు ప్రభాకరరావు, అరటి రైతు, మల్లేశ్వరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement