రత్నగిరి.. కిక్కిరిసి.. | - | Sakshi
Sakshi News home page

రత్నగిరి.. కిక్కిరిసి..

Mar 22 2026 1:54 AM | Updated on Mar 22 2026 1:54 AM

అన్నవరం: వేలాదిగా తరలి వచ్చిన భక్తులతో రత్నగిరి శనివారం కిక్కిరిసిపోయింది. సత్యదేవుని సన్నిధిలోను, వివిధ ప్రాంతాల్లోను శుక్రవారం రాత్రి, శనివారం తెల్లవారుజామున పెద్ద సంఖ్యలో వివాహాలు జరిగాయి. ఆ నవ దంపతులు, వారి బంధువులకు ఇతర భక్తులు కూడా తోడవడంతో ఆలయంలో విపరీతమైన రద్దీ ఏర్పడింది. సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించుకున్నారని అధికారులు అంచనా వేశారు. సత్యదేవుని వ్రతాలు మూడు వేలు నిర్వహించారు. వివిధ విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.40 లక్షల ఆదాయం సమకూరింది. ఇందులో ఒక్క వ్రతాల విభాగం ద్వారానే రూ.20 లక్షలు రాగా, ప్రసాద విక్రయాలు, ఇతర విభాగాల ద్వారా మరో రూ.20 లక్షలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. భక్తుల ఏర్పాట్లను దేవస్థానం చైర్మన్‌ ఐవీ రోహిత్‌, ఈఓ వి.త్రినాథరావు పర్యవేక్షించారు. రత్నగిరిపై ఆదివారం కూడా భక్తుల రద్దీ ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. నేడు కూడా సుమారు 40 వేల మంది భక్తులు వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు.

సత్యదేవుని దర్శించిన చీనాబ్‌ రైల్వే బ్రిడ్జి ఇంజినీర్‌ ˘

అన్నవరం: జమ్మూ కశ్మీర్‌లో చీనాబ్‌ నదిపై ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ–బెంగళూరు) ప్రొఫెసర్‌ గాలి మాధవీలత తన కుటుంబ సభ్యులతో కలసి సత్యదేవుని శనివారం దర్శించుకున్నారు. దర్శనానంతరం పండితులు వేదాశీస్సులు, స్వామివారి ప్రసాదాలు అందజేశారు. ప్రొఫెసర్‌ మాధవీలతను దేవస్థానం ఈఈ వి.రామకృష్ణ మర్యాదపూర్వకంగా కలిశారు.

జేఎన్‌టీయూలో విద్యాభ్యాసం

మాధవీలత కాకినాడ జేఎన్‌టీయూ ఇంజినీరింగ్‌ కళాశాలలో 1992లో బీటెక్‌, తరువాత వరంగల్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(నిట్‌)లో ఎంటెక్‌ చదివారు. ఐఐటీ మద్రాస్‌లో సివిల్‌ ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ చేశారు. తరువాత ఐఐటీ గౌహతిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పని చేస్తూనే బెంగళూరు ఐఐఎస్‌సీలో డాక్టోరియల్‌ రీసెర్చ్‌ చేశారు. అనంతరం మెకానిక్స్‌ ఆఫ్‌ సోయిల్‌ అండ్‌ గ్రౌండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పలు పరిశోధన పత్రాలు సమర్పించారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు చీనాబ్‌ నదిపై వంతెన నిర్మించేందుకు అక్కడి నేల, కొండల పరిస్థితిపై అధ్యయనం చేసి నివేదిక సమర్పించారు. ఆ తరువాత ఆ బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యే వరకూ మాధవీలత అక్కడే ఉండి పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement