నల్లజర్ల: హైదరాబాద్ నుంచి నల్లజర్ల మండలం పోతవరానికి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో వస్తున్న ఓ ప్రయాణికురాలిపై అర్ధరాత్రి మత్తుమందు జల్లి ఆమె బ్యాగులో ఉన్న 15 కాసుల బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగదును గుర్తుతెలియని వ్యక్తులు దోచుకున్నారు. ఈ ఘటన ఫిబ్రవరి 28వ తేదీ రాత్రి జరగ్గా బాధితురాలు గద్దె భారతిలక్ష్మి మార్చి 2న నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోతవరంలో సోమవారం ఆ వివరాలను విలేకరులకు తెలిపారు. పోతవరానికి చెందిన గద్దె భారతీలక్ష్మి ఫిబ్రవరి 20న హైదరాబాద్‌లో బంధువుల పెళ్లికి వెళ్లారు. తిరిగి వచ్చేటప్పుడు గద్దె భారతీలక్ష్మి, బంధువు కరుటూరి నాగశిరోమణి కలసి 28న రాత్రి ఏయస్‌బీఆర్ ట్రావెల్స్ బస్సులో హైదరాబాద్ నుంచి బయలుదేరారు. డ్రైవర్ వెనుక ఉన్న స్లీపర్‌లో వీరద్దరూ పడుకున్నారు. రాత్రి పడుకునే ముందు భారతీలక్ష్మి ఫోన్ బ్యాగ్‌లో పెట్టేటప్పుడు అందులో ఉన్న బంగారు ఆభరణాలు సరిచూసుకున్నారు. బస్సు ఎక్కడా ఆగలేదు. పోతవరం వచ్చాక బంధువులకు ఫోన్ చేసేందుకు బ్యాగులో చేయిపెడితే నగల ఆచూకీ లేదు. తలదగ్గర పెట్టుకున్న బ్యాగు పెట్టుకున్నట్టే ఉంది. కానీ అందులో నగలు లేవు. దీంతో కంగారు పడి బంధువులకు ఫోన్‌చేసి చెప్పారు. బస్సు ప్రయాణంలో తన నగలు బంగారు నెక్లెస్, గాజులు, ఉంగరాలు, చెవిదిద్దులు మొత్తం 15 కాసుల బంగారు ఆభరణాలు, రూ.20 వేల నగదు చోరీకి గురైనట్టు భారతీలక్ష్మి ఫిర్యాదు చేశారు. బస్సు సిబ్బందే తమపై మత్తుమందు చల్లి ఈ చోరీకి పాల్పడి ఉంటారని ఆమె పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా తాను ఫిర్యాదు చేసి 15 రోజులు దాటినా ఇంతవరకు పోలీసులు విచారణ చేపట్టక పోగా కనీసం కేసు కూడా నమోదు చేయలేదని ఆమె విలేకరులకు వివరించారు. దీనిపై నల్లజర్ల ఎస్‌ఐ ఆంజనేయబాబును వివరణ కోరగా ఈ కేసును వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని అందుకే కేసు నమోదు చేయడంలో జాప్యం జరిగిందన్నారు. ట్రావెల్స్ బస్సు డ్రైవర్‌తో పాటు భారతీలక్ష్మితో పాటు ప్రయాణించిన 15 మంది ప్రయాణికులను విచారించామని ఈరోజు కేసు నమోదు చేయనున్నట్టు తెలిపారు.


