అణువణువూ జల్లెడ
కోరింగ అభయారణ్యంలో పక్షుల గణన
తాళ్లరేవు: కోరింగ అభయారణ్యంలో పక్షుల లెక్క తేల్చేందుకు ప్రత్యేక బృంద సభ్యులు శ్రమించారు. ప్రత్యేక కెమెరాలతో అభయారణ్యం, సముద్ర తీర ప్రాంతంలో అణువణువూ జల్లెడ పట్టారు. ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సెస్– 2026లో భాగంగా ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన 12 బృందాల సభ్యులు ఇందులో పాల్గొని పక్షుల సంఖ్యను లెక్కించారు. పర్యావరణంలోని ప్రస్తుత పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు, దూర ప్రాంతాల నుంచి వచ్చే వలస పక్షుల సంఖ్యను లెక్కించేందుకు ప్రభుత్వం ఏటా జనవరిలో పక్షుల గణన చేపడుతోంది. దీనికోసం ఫారెస్ట్ రేంజ్ అధికారి ఎస్‌ఎస్‌ఆర్ వరప్రసాద్ నేతృత్వంలో సుమారు 100 మందితో కూడిన బృందానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అటవీ సిబ్బందితో పాటు ఒక వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రాఫర్, ఒక సైంటిస్ట్, ఒక స్టూడెంట్‌తో పాటు ఒక వలంటీర్ ఈ లెక్కింపులో పాల్గొన్నారు. సోమవారం తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి ప్రత్యేక కెమెరాలతో కోరింగ మడ అటవీ ప్రాంతం, సముద్ర తీర ప్రాంతంలో సంచరించే వివిధ రకాల పక్షులు, దూర ప్రాంతాల నుంచి వలస వచ్చే పక్షులను లెక్కించారు. నేషనల్ బయో డైవర్సిటీ అథారిటీ, సీనియర్ సైంటిస్ట్‌లు, బీఎన్‌హెచ్‌ఎస్ ప్రతినిధుల నేతృత్వంలో ఈ లెక్కింపు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఫారెస్ట్ రేంజర్ ఎస్‌ఎస్‌ఆర్ వరప్రసాద్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్లు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా కోరంగి బయో డైవర్సటీ కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పక్షి గణనలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ వరప్రసాద్, సత్య సెల్వం చేతుల మీదుగా సర్టిఫికెట్లను అందజేశారు. అన్నీ పరిశీలించిన తరువాత పక్షుల సంఖ్యను ప్రకటించనున్నట్లు వరప్రసాద్ తెలిపారు. కార్యక్రమంలో అటవీ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.
అణువణువూ జల్లెడ


