‘ఉత్తరాయణంలో మరణించిన పాపులకు ఉత్తమ గతులుండవు’
ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్): ‘ఉత్తరాయనం ప్రశస్తమయిన కాలమే. కానీ, ఉత్తరాయణంలో మరణించిన పాపులకు ఉత్తమ గతులు కలగవు. అలాగే, దక్షిణాయనంలో మరణించిన పుణ్యాత్ములకు ఉత్తమ గతులు కలుగుతాయి’ అని ప్రవచన విరించి సామవేదం షణ్ముఖశర్మ అన్నారు. స్థానిక హిందూ సమాజంలో చేస్తున్న వ్యాస భారత ప్రవచనంలో భాగంగా సోమవారం ఆయన ద్రోణపర్వంలోని యుద్ధ సన్నివేశాలను వివరించారు. ‘జీవన్ముక్తులకు ఏ అయనమూ అవసరం లేదు. వారు బ్రహ్మంతో తాదాత్మ్యం చెంది ఉంటారు. నిష్కామ కర్మానుష్ఠానపరులు, యోగులు, ఉపాసకులు ఏ యానంలో మరణించినా, దేవయాన మార్గంలో సగుణబ్రహ్మ లోకానికి వెళ్తారు. కామ్యకర్మానుష్ఠానపరులు కోరికతో సత్కర్మలు చేస్తే, ఊర్థ్వ లోకాలకు వెళ్లి, పుణ్యబలం క్షీణించాక, తిరిగి జన్మిస్తారు. ఇక లోకంలో ఎక్కువ సంఖ్యలో ఉండే నిషిద్ధ కర్మానుష్ఠానపరులు అధోలోకాలకు వెళ్తారు’ అని వివరించారు. మనం భారత యుద్ధం జరిగిన సమయంలోనే ప్రవచనం చెప్పుకుంటున్నామన్నారు. దక్షిణాయన సమయంలో మరణించిన అనేకమంది వీరులు దేవ, బ్రహ్మ, వరుణ లోకాలకు వెళ్లడాన్ని ఆశ్రమవాస పర్వంలో వ్యాసుడు వివరించాడని చెప్పారు. అయితే, స్వచ్ఛంద మరణం వరంగా ఉన్న భీష్ముడు ఉత్తరాయనం ప్రశస్తమయిన కాలం కనుక, ఆ సమయం వచ్చే వరకూ నిరీక్షించసాగాడని తెలిపారు. జ్ఞానం, భక్తి, యోగాలు మూడింటినీ తనలో నింపుకొన్నవాడు భీష్ముడని, తాను చేస్తున్నాననే అహంకారం లేని నిస్సంగుడని, అన్నారు. శాంతి, అనుశాసన పర్వాల్లో భీష్ముడు చెప్పిన నీతులు, ధర్మాలు పురాణ వాఙ్మయంలో మరెక్కడా కనపడవని సామవేదం అన్నారు. ‘‘భీష్ముడు శర తల్పం చేరాక, కర్ణుడు సంగ్రామానికి వచ్చాడు. ద్రోణుడు సర్వసైన్యాధిపతి అయ్యాడు. ధర్మరాజును బంధించి తీసుకు రమ్మని ద్రోణుడిని దుర్యోధనుడు కోరాడు. ధర్మరాజును వధించి తీసుకు రమ్మనకుండా, బంధించి తీసుకు రమ్మనడంలో దుర్యోధనుని అంతరంగంలో మంచి భావాలు కలిగాయని భావించరాదు. పాండవుల్లో ఏ ఒక్కరు మిగిలినా పోరు తప్పదు. వారిలో ఎవరూ మిగలకపోయినా, కౌరవులదరినీ కృష్ణుడు బంధించి రాజ్యాన్ని ద్రౌపదికి ధారాదత్తం చేస్తాడు. ధర్మరాజును బంధించి, తిరిగి ద్యూతానికి ఆహ్వానించి, పాండవులందరినీ వనవాసానికి, అజ్ఞాతవాసానికి పంపాలన్నది దుర్యోధనుడి కుటిల భావం. అర్జునుడు సమీపంలో లేకపోతే, ధర్మరాజును బంధించి తీసుకువస్తానని ద్రోణుడు దుర్యోధనునికి మాట ఇస్తాడని సామవేదం అన్నారు. ద్రోణపర్వంలోని యుద్ధ వ్యూహ ప్రతివ్యూహాలను సామవేదం వివరించారు.


