అటు రంకెలేస్తూ.. ఇటు దౌడు తీస్తూ..
● రసవత్తరంగా రాష్ట్ర స్థాయి
ఎడ్ల బళ్లు, గుర్రపు స్వారీ పోటీలు
● వివిధ జిల్లాల నుంచి వచ్చిన
67 జతల ఎడ్లు, 23 గుర్రాలు
● సందడిగా మారిన ఏడీబీ రోడ్డు
రంగంపేట: మండలం వడిశలేరు సమీపంలో గన్ని వ్యవసాయ క్షేత్రం వద్ద ఆదివారం నిర్వహించిన 7వ రాష్ట్రస్థాయి ఎడ్లబళ్లు, గుర్రాల పోటీలు రసవత్తంరంగా సాగాయి. దివంగత ఆదర్శరైతు గన్ని సత్యనారాయణమూర్తి స్మారకార్థం ఆయన కుమారుడు, రాజానగరం జీఎస్‌ఎల్ వైద్య కళాశాల చైర్మన్ డాక్టర్ గన్ని భాస్కరరావు సహకారంతో కూటి కోటేశ్వరరావు, బొప్పన బ్రహ్మాజీరావుల నిర్వహణలో ఈ పోటీలు జరిగాయి. ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు వరకు సాగిన ఈ పోటీలను మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించగా రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు చూడడానికి వచ్చారు. రాష్ట్రలోని వివిధ జిల్లాల నుంచి 67 జతల ఎడ్లు, 23 గుర్రాలు పోటీలకు హాజరు కాగా, సీనియర్స్ 1600 మీటర్ల విభాగంలో 11 జతలు, జూనియర్స్ విభాగం వెయ్యి మీటర్లలో 56 జతల ఎడ్లు పాల్గొన్నాయి. ఈ పోటీల వల్ల వడిశలేరు నుంచి రంగంపేట వరకు గల ఏడీబీ రోడ్డు కోలాహలంగా మారింది. పోలీసు బందోబస్తు నడుమ పోటీలు ప్రశాంతంగా ముగిసాయి. ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఎమ్మెల్యేలు బత్తుల బలరామకృష్ణ, ముప్పిడి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ మార్గాని భరత్‌రామ్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు పోటీలు తిలకించారు.
విజేతలు వీరే...
సీనియర్స్ విభాగంలో 11 జతల ఎడ్లు పాల్గొనగా మొదటి బహుమతి రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను జి.మేడపాడుకి చెందిన మలిరెడ్డి అన్నపూర్ణ, గుమ్మిలేరుకు చెందిన కోరా శృతి చౌదరి ద్వితీయ, తృతీయ బహుమతులుగా బైక్‌లను గెలుచుకున్నారు. మరికొందరు కన్సొలేషన్ బహుమతులు గెలుచుకున్నారు. విజేతలకు ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బహుమతులు అందజేశారు. జూనియర్స్ విభాగంలో 56 జతల ఎడ్లు పాల్గొనగా మొదటి బహుమతి రాయల్ ఎన్‌ఫీల్డ్‌ను చౌడవాడకు చెందిన గెడ్డం అప్పారావు, ద్వితీయ బహుమతిని కంకటపాలేనికి చెందిన కొండేటి పద్మ, తృతీయ బహుమతిని బి.కొత్తూరుకు చెందిన మురుకుర్తి శంకరరావు గెలుచుకున్నారు.
గుర్రాల పందెం విజేతలు వీరే..
మొదటి బహుమతి రూ.40 వేలను అగ్రహారానికి చెందిన చేమల మణికంఠ, ద్వితీయ బహుమతి రూ.30 వేలను యలమంచిలికి చెందిన ఎల్లపు జగదీష్, తృతీయ బహుమతి రూ.25 వేలను రామన్నపాలేనికి చెందిన చోడమాంచిక విక్రమ్ సాధించారు. నాల్గవ బహుమతి సాధించిన సింగపూర్ సత్యనారాయణకు రూ.20 వేలు, ఐదో బహుమతిని అరకుపాలేనికి చెందిన మోదమాంబ మురుగన్‌కు రూ.15 వేలు, ఆరో బహుమతి సాధించిన సోమలింగంపాలేనికి చెందిన యల్లపు జగదీష్‌కు రూ.10 వేలు, ఏడో బహుమతి సాధించిన కోటనందూరుకు చెందిన శివరాజుకు రూ.10 వేల చొప్పున నగదు అందించారు. విజేతలకు గన్ని కృష్ణ నగదు బహుమతులు అందజేశారు.
అటు రంకెలేస్తూ.. ఇటు దౌడు తీస్తూ..


