అగ్ని ప్రమాదంలో తాటాకిల్లు దగ్ధం
● రూ.4.5 లక్షల ఆస్తి నష్టం
కడియం: మండలంలోని కడియపులంక పంచాయతీ పరిధిలోని దోసాలమ్మకాలనీలో తెల్లవారు జామున జరిగిన ప్రమాదంలో ఎల్లంశెట్టి సముద్రుడుకు చెందిన తాటాకిల్లు దగ్ధమైంది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు చెలరేగి, ఇంటిని చుట్టుముట్టడంతో ఇల్లు, అందులోని వస్తువులు పూర్తిగా కాలిపోయాయని బాధితులు తెలిపారు. ఈ ప్రమాదంలో రూ.4.5 లక్షల విలువైన ఆస్తి నష్టం సంభవించిందని వారు తెలిపారు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు అగ్నిమాపక శకటం అక్కడికి చేరుకుని మంటలు పక్క ఇళ్లకు వ్యాపించకుండా సిబ్బంది ఆర్పారు. బాధితులను ఆదివారం పలువురు పరామర్శించి సాయం అందజేశారు. కడియపులంక ఉప సర్పంచ్ పాటంశెట్టి రాంజీ రూ.10వేలు, ఏపీఐఐసీ సభ్యుడు మార్గాని సత్యనారాయణ నగదు సాయం అందజేశారు. అలాగే తహసీల్దార్ ఆదేశాల మేరకు 25 కిలోల బియ్యం, నిత్యావసర వస్తువులను వీఆర్వో జ్యోతి బాధితులకు ఇచ్చారు.
ఘనంగా శశి రీ యూనియన్
నిడదవోలు: ఉండ్రాజవరం మండలం వేలువెన్ను శశి విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఆదివారం శశి రీ యూనియన్–2025ను ఘనంగా నిర్వహించారు. సుమారు 1200 మంది తల్లిదండ్రులు, 2025 టాపర్స్, ర్యాంక్ హోల్డర్లు, అలుమ్నిలు పాల్గొన్నారు. శశి విద్యార్థుల నృత్యాలు, సంగీతం వంటి సాంస్తృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథి రాజమహేంద్రవరంలోని శస్త్రచికిత్స నిపుణులు డాక్టర్ భాస్కర్ చౌదరి మాట్లాడుతూ విద్యార్థులు నిత్యం ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలని, బోధన–వైద్య వృత్తులు పవిత్రమైనవన్నారు. గౌరవ అతిధి వరంగల్ ఎమిరిటస్ ప్రొఫెసర్ డి.దినాకర్ మాట్లాడుతూ విద్యార్థులకు మార్కులతో పాటు కమ్యూనికేషన్ స్కిల్స్, స్కిల్ డెవలప్‌మెంట్ ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు. ఈ సందర్భంగా 2025లో వివిధ విభాగాల్లో టాప్ ర్యాంకులను సాధించిన విద్యార్థులను, వారి తల్లిదండ్రులను శశి విద్యాసంస్థల చైర్మన్ డాక్టర్ బూరుగుపల్లి రవి కుమార్, వైస్ చైర్మన్ లక్ష్మీ సుప్రియ సత్కరించారు. ఈ కార్యక్రమంలో శశి విద్యా సంస్థల డైరెక్టర్ భాస్కర్, అడ్మినిస్ట్రేటివ్ డైరెక్టర్ డాక్టర్ వెంకటేశ్వరరావు, సీనియర్ అధ్యాపక బృందం పాల్గొన్నారు.
కోడి పందేలు ఆడుతున్న ముగ్గురి అరెస్టు
జగ్గంపేట: మండలంలోని గొల్లలగుంట గ్రామ శివారులో రహస్యంగా నిర్వహిస్తున్న కోడి పందేల శిబిరంపై ఎస్సై రఘునాథరావు ఆదివారం దాడి చేశారు. ఈ దాడిలో కోడి పందేలు ఆడుతున్న ముగ్గురిని అరెస్టు చేసి వారి నుంచి రూ.5.6 వేలు, వీటితో పాటు 2 పందెం కోళ్లు, కత్తులను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సై తెలిపారు. మండలంలో జూద క్రీడలు ఎక్కడ నిర్వహించినట్టు కనిపించినా, తెలిసినా 94949 33233కి నంబర్‌కు కానీ, 100కు కానీ, 112 నంబర్‌కు కాల్ చేసి కానీ ఫిర్యాదు చేయాలన్నారు. ప్రజల సహకారంతోనే జూదాలు నిరోధించగలమని తెలిపారు.
అగ్ని ప్రమాదంలో తాటాకిల్లు దగ్ధం


