బతుకుతెరువుకు వచ్చి కడతేరిపోయారు
గండేపల్లి: బతుకుతెరువు కోసం జిల్లా దాటి వచ్చిన వారు విగత జీవులయ్యారు. యజమానిని రక్షించే యత్నంలో సహాయకుడితో సహా విద్యుదాఘాతానికి గురై సెకన్ల వ్యవధిలో ఇద్దరూ మృత్యువాత పడ్డారు. పోలీసుల కధనం మేరకు పశ్చిమ గోదావరి జిల్లా ఇరగరవం మండలం పేకేరు గ్రామానికి చెందిన కరిపెట్టి సింహాద్రి(57) తన దగ్గర ఉన్న వరికోత యంత్రంతో స్థానికంగా పలు ప్రాంతాల్లో వరి కోత కోస్తుంటాడు. ఈ క్రమంలో ఆదివారం మండలంలోని గండేపల్లి, రామయ్యపాలెం మీదుగా ఐషర్ వ్యాన్‌లో వరికోతకు యంత్రాన్ని తీసుకువెళ్తున్నాడు. రామయ్యపాలెం గ్రామ శివారుకు వచ్చే సరికి యంత్రం పైపునకు 11 కేవీ విద్యుత్ తీగలు అడ్డం వచ్చాయి. వాటిని తొలగించేందుకు డ్రైవింగ్ సీటు నుంచి కిందకు దిగిన సింహాద్రి వ్యాన్‌కు అడుగు భాగంలో కర్రను తీసే యత్నంలో తలుపుపై చేయి వేయడంతో ఒక్కసారిగా విద్యుదాఘాతానికి గురయ్యాడు. ఆ వెనుకే మోటారు సైకిల్‌పై వస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం రాపాక గ్రామానికి చెందిన సహాయకుడు గెడ్డం సందీప్ (17) సింహాద్రిని రక్షించబోయాడు. దీంతో అతడు సైతం విద్యుదాఘాతానికి గురై ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఓనర్ కం డ్రైవర్‌గా పనిచేసుకుంటున్న సింహాద్రికి భార్య విజయలక్ష్మి, ఇద్దరు కొడుకులు ఉన్నారు. సందీప్‌కు తల్లి, తండ్రి, ఇద్దరు అక్కలు ఉండగా మరో అక్కకు వివాహం కావాల్సి ఉందన్నారు.
సీతానగరానికి కోతలకు వెళ్తుండగా..
కలవచర్లలో శనివారం వరికోత ముగించుకున్న సింహాద్రి, సందీప్‌లు ఆదివారం సీతానగరం వెళ్లాల్సి ఉండగా ఇక్కడకు వచ్చి ఇలా మృతి చెందారని వరికోత యంత్రాన్ని పురమాయించిన వ్యక్తి పేర్కొన్నాడు. చాలా కాలంగా కిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలను అధికారులు పట్టించుకోకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. ప్రమాదస్థలం వద్దకు చేరుకున్న సీఐ వైఆర్కే శ్రీనివాస్, ఎసై యు.వి.శివ నాగబాబు, సిబ్బంది క్షేత్రస్థాయిలో వివరాలు తెలుసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జెడ్.రాగంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేయనున్నట్టు తెలియజేశారు. విద్యుత్‌శాఖ ఏఈ సంఘటన వద్ద ప్రమాదకరంగా ఉన్న తీగలను సరిచేయించారు.
గమనించి ఉంటే ప్రమాదం తప్పేది
సింహాద్రి వెళ్తున్న మార్గంలో కొద్ది నిమిషాల ముందు మరో వాహనం వరికోత యంత్రాన్ని తీసుకువెళ్లిందని ఆ వాహన డ్రైవర్ సమాచారం అందజేసేంతలో ఇలా జరిగిపోయిందని స్తానికులు పేర్కొన్నారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే రామయ్యపాలెం, సింగరంపాలెం గ్రామస్తులు సంఘటనాస్థలం వద్దకు చేరుకుని సహాయక చర్యలు అందజేసే యత్నం చేసినప్పటికి ప్రయోజనం లేకపోయిందన్నారు.
వరికోత యంత్రానికి
విద్యుత్ తీగలు తగిలి ఘటన
యజమానితో సహా సహాయకుడూ
క్షణాల్లో మృతి
మృతులిద్దరూ ‘పశ్చిమ’ వాసులే
బతుకుతెరువుకు వచ్చి కడతేరిపోయారు
బతుకుతెరువుకు వచ్చి కడతేరిపోయారు
బతుకుతెరువుకు వచ్చి కడతేరిపోయారు


