షార్ట్ సర్క్యూట్‌తో తాటాకిళ్లు దగ్ధం
● రూ.15 లక్షల ఆస్తి నష్టం
అంబాజీపేట: స్థలం కొనుగోలు కోసం అప్పు చేసి మరి కొద్ది సమయంలో ఆ మొత్తాన్ని అందజేస్తామనుకుంటే కళ్ల ఎదుటే రూ.7 లక్షలు కాలిపోయాయని బాధితులు బావురుమన్నారు. కె.పెదపూడి తిరుమనాథంవారిపాలెం శివారులో ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు తాటాకిళ్లు దగ్ధం కాగా నాలుగు కుటుంబాల వారు నిరాశ్రులయ్యారు. స్థానికులు తెలిపిన వివరాల మేరకు, ఈతకోట సుబ్బారావు, ఈతకోట శ్రీనివాసరావు, ఈతకోట ఈశ్వరరావు, ఈతకోట మంగాయమ్మలకు చెందిన రెండు తాటాకిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. తొలుత సుబ్బారావు, శ్రీనివాసరావులు నివాసమున్న ఇంటికి మంటలు వ్యాపించి పక్కనే ఉన్న ఈశ్వరరావు, మంగాయమ్మల ఇంటికి వ్యాపించాయి. స్థానికులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తుండగా ఇంటిలో ఉన్న సిలిండర్ పేలడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఈ అగ్ని ప్రమాదంలో స్థలం కొనుగోలు కోసం ఇంటిలో దాచుకున్న సుబ్బారావుకు చెందిన రూ.1.5 లక్షల నగదు, 12 గ్రాముల బంగారం, అతని కుమారుల స్టడీ సర్టిఫికెట్లు, శ్రీనివాసరావుకు చెందిన రూ.2.5 లక్షల నగదు, 18 గ్రాముల బంగారం, విదార్హత సర్టిఫికెట్లు, మంగాయమ్మకు చెందిన రూ.1.5 లక్షల నగదు, 18 గ్రాముల బంగారం, విద్యార్హత సర్టిఫికెట్లు, ఈశ్వరరావుకు చెందిన రూ.2,7 లక్షల నగదు, 14 గ్రాముల బంగారం, స్టడీ సర్టిఫికెట్లు, గృహోపకరణాలు ఈ ప్రమాదంలో కాలి బూడిదయ్యాయి. మొత్తంగా రూ.15 లక్షల ఆస్తి నష్టం సంభవించినట్లు అమలాపురం అగ్నిమాపక అధికారులు తెలిపారు. మంటలను అదుపు చేసేందుకు వచ్చిన అగ్నిమాపక వాహనం లోపలకు వచ్చే అవకాశం లేకపోవడంతో స్థానికులు మంటలను అదుపు చేసేందుకు నానా ఇబ్బందులు పడ్డారు. అంబాజీపేట భవాని సేవా సమితి ఆధ్వర్యంలో గురు భవానీలు దంగేటి సాయిబాబు, మల్లేశ్వరి దంపతులు, మట్టపర్తి ఏసు, మట్టపర్తి శ్రీనివాస్, పాటి శేఖర్, గుత్తుల పండు, పితాని శ్రీనులు బాధితులకు 50 కేజీల బియ్యం, చీరలను పంపిణీ చేశారు. సంఘటనా స్థలాన్ని పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పరిశీలించి బాధిత కుటుంబాలకు మనోధైర్యం కల్పించారు. ప్రభుత్వం అందించిన ఆర్థిక సాయం 10 కేజీల చొప్పున బియ్యం, కేజీ బంగాళదుంపలు, వంట నూనె, ఉల్లిపాయలను అంజేశారు. కార్యక్రమంలో ఆర్‌ఐ కె.ఏడుకొండలు, వీఆర్వో వెంకటరమణ, కూటమి నాయకులు పాల్గొన్నారు.


