గోదావరిలో మునిగి విద్యార్థి మృతి
కపిలేశ్వరపురం (మండపేట): అంబాజీపేట మండలం పుల్లేటికుర్రు గ్రామానికి చెందిన పదో తరగతి విద్యార్థి నామాడి బన్ను (17) గౌతమి గోదావరి నదిలో స్నానానికి దిగి ప్రమాదవశాత్తూ మృతి చెందాడు. అంగర ఎస్సై జి.హరీష్‌కుమార్ కథనం ప్రకారం బన్ను మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కపిలేశ్వరపురం మండలం కేదారిలంక గ్రామ శివారు వీధివారిలంకలోని పర్యాటక కేంద్రం ధనమ్మమర్రికి వచ్చాడు. స్నేహితులతో కలిసి గోదావరిలో స్నానానికి దిగారు. ఇంతలో బన్ను ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతిచెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి తండ్రి అబ్బులు ఫిర్యాదుపై మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. అబ్బులుకు బన్ను పెద్ద కుమారుడు కాగా చిన్న కుమారుడు అభిషేక్ ఆరో తరగతి చదువుతున్నాడు.
పుల్లేటికుర్రులో విషాదఛాయలు
అంబాజీపేట: అప్పటివరకు స్నేహితులతో ఉల్లాసంగా గడిపిన బన్ను నీట మునిగి మృతి చెందడంతో చీకురుమెల్లివారిపేటలో విషాదం అలుముకుంది. బన్ను స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతుండగా, అతని తండ్రి నామాడి అబ్రహం ఆటో నడిపి కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బన్ను మృతి వార్త తెలిసి గ్రామ సర్పంచ్ జల్లి బాలరాజు, ఉప సర్పంచ్ వీరా రవి, ఎంపీటీసీలు కుసుమ వెంకటేష్, వడలి కృష్ణమూర్తి, హెచ్‌ఎం, ఉపాధ్యాయులు, స్థానికులు సంతాపం వ్యక్తం చేశారు.
వివాహిత ఆత్మహత్య
కపిలేశ్వరపురం: భర్త వ్యవహార శైలితో మనస్తాపానికి గురై మండపేట మండలం ద్వారపూడి గ్రామ శివారు వేములపల్లికి చెందిన మట్టా రేఖ (24) ఆదివారం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై వి.కిశోర్ కథనం ప్రకారం రేఖకు అల్లవరం మండలం బోడసకుర్రు గ్రామానికి చెందిన మట్టా వేణుతో వివాహమైంది. కొంతకాలం క్రితం రేఖ వేములపల్లిలోని తండ్రి నేదునూరి శ్రీను ఇంటికి ప్రసవానికి వచ్చింది. ఆ సమయంలో రేఖ, వేణుల మధ్య తరచుగా ఫోన్‌లో వాగ్వాదం జరిగేది. దీంతో మనస్తాపం చెందిన రేఖ ఆదివారం వేములపల్లిలోని కొబ్బరితోటలో ఉరి వేసుకుని మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తండ్రి శ్రీను ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై కిశోర్ తెలిపారు. రేఖకు నాలుగు నెలల కుమారుడు ఉన్నాడు.


