
ఎస్‌ఈజెడ్ భూములపై కపట ప్రేమ
● 2,800 ఎకరాల భూమిని మాజీ సీఎం జగన్ రైతులకు ఇచ్చారు
● చంద్రబాబు ప్రభుత్వంలో వారిపై అక్రమ కేసులు పెట్టారు
● విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన యేడాదిన్నరకు ఎస్‌ఈజెడ్ రైతులపై కపట ప్రేమ ఒలకబోస్తుందని వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి దాడిశెట్టి రాజా అన్నారు. శనివారం తునిలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జీఓ కాకుండా ఒక మెమో ఇచ్చి, 2,800 ఎకరాలను డిప్యూటీ సీఎం పవన్‌కళ్యాణ్ ఆదేశాల మేరకు చంద్రబాబు ఫ్రీగా తిరిగి ఇచ్చినట్టు గొప్పగా చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు. నిజానికి జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా ఆర్డర్ కాపీ ఇచ్చి ఆ భూములను రైతులకు వెనక్కు ఇచ్చారని గుర్తు చేశారు. గత వారం రోజులుగా ఎల్లో మీడియాలో రూపాయికే ఎకరం భూమి చంద్రబాబు ఇచ్చినట్టు గొప్పగా ప్రచారం చేసుకోవడమే కాకుండా, క్షీరాభిషేకాలు చేయించుకున్నారన్నారు. తన గురించి, తన క్యారెక్టర్ గురించి ఈనాడులో అవాకులు, చవాకులు రాశారన్నారు. చంద్రబాబు ఇటీవల మెమో మాత్రమే ఇచ్చారని, అది జీఓ కాదని, 2024, డిసెంబర్ 5న ఈనాడు పత్రికలో తనను వ్యక్తిత్వ హసనం చేసిన విషయంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
మెగాస్టార్‌నే గుడ్డలిప్పి నిలబెట్టారు
ఎల్లో మీడియాలో మెగాస్టార్ చిరంజీవికే దిక్కులేదని, ఆయననే గుడ్డలు విప్పి రోడ్డుపై నిలబెట్టారని, ఇక తామెంతని రాజా ప్రశ్నించారు. డిసెంబర్ 5, 2024లో ఈనాడు మొదటి పేజీలో కుడిచేత్తో ఇచ్చి ఎడమ చేత్తో లాక్కుని రైతులను అన్యాయం చేసి భూములు నొక్కేశారని తనపై అసత్య ప్రచారం చేశారన్నారు. ఈనాడు పేపర్ ఆ రోజు రాసింది తప్పా లేదంటే ఈ రోజు చంద్రబాబు భూములు వెనక్కు ఇచ్చేయడం అసత్యమా అనేది ఈనాడు స్పష్టం చేయాలని రాజా సవాలు విసిరారు.
నచ్చిన ధరకు అమ్ముకున్నారు
జగన్ ప్రభుత్వం రైతులకు భూములు ఇచ్చిన వారికి నచ్చిన ధరకే అమ్ముకున్నారన్నారు. ఆ ధరకే తాను కొనుగోలు చేశానన్నారు. ఆ భూములను ఈనాడుగానీ మరే కూటమి ప్రభుత్వం వారికిగాని కొనుగోలు చేస్తానంటే తాను తిరిగి అదే ధరకు అమ్మేస్తానన్నారు. కొన్న ధరకంటే రూ.లక్ష, రూ.రెండు లక్షలో అదనంగా వస్తుందని ఆశపడి కొనుగోలు చేశానని చెప్పారు. కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత రియల్ ఎస్టేట్ పడిపోయిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేస్తున్నామనే అక్కసుతో ఈనాడు తనపై అసత్యాలు ప్రచురిస్తోందన్నారు. చంద్రబాబు 1999లోనే రూ.370 కోట్లు ప్రజాధనంతో కాకినాడ పోర్టును మూడు బెర్త్‌లతో కట్టిన తరువాత పీపీపీ మోడ్‌లో కేవీ రావు అనే అయన బినామీకి రూ.50 కోట్లకే ధారాదత్తం చేశారని ఆరోపించారు. దీని ద్వారా వచ్చిన ఆదాయం చంద్రబాబుకా ఆయన బినామీకా, లేక ప్రభుత్వానికి వస్తుందో ఈనాడు స్పష్టం చేయాలని రాజా డిమాండ్ చేశారు. ఆ రోజుల్లో రూ.370 కోట్లు అంటే ఈ రోజు ఎన్ని వేల కోట్లో అర్థం చేసుకోవాలన్నారు. ఇటువంటి విషయాలను బయటపెట్టినందుకు తనను, తన వాళ్లను ఖూనీకోర్లు, అవినీతిపరులు అంటూ ఎల్లో మీడియాలో వార్తలు రాస్తారా? అని రాజా నిలదీశారు. ఇందుకు సంబంధించి సాక్ష్యాధారాలు, పత్రాలతో సహా ఎల్లో మీడియాలో ప్రచురించాలని సవాలు విసిరారు.
మాజీ సీఎం జగన్
ప్రభుత్వ ఆర్డర్ కాపీ ఇచ్చారు:
జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా అప్పటి మంత్రి కన్నబాబు నేతృత్వంలో ఈ విషయమై కొందరు ఐఏఎస్‌లను ప్రభుత్వం సబ్ కమిటీగా వేసి రైతు సమస్యలు తెలుసుకుని ఆ భూములను వెనక్కి ఇచ్చారని, అందులో 1,400 ఎకరాలు రైతులు ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్నారన్నారు. ఎస్‌ఈజెడ్ భూములపై రైతులు 20 ఏళ్ల నుంచి పోరాడుతున్నారన్నారు. వారిపై చంద్రబాబు హయాంలో అట్రాసిటీ కేసులు నమోదు చేయించారన్నారు. రిమాండ్‌లో ఉన్న రైతులతో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో మరుగుదొడ్లు శుభ్రం చేయించిందని గుర్తు చేశారు.