
యువకుడిని కాపాడిన ట్రైనీ ఎస్సై
గోపాలపురం: చెరువులో పడి ఆత్మహత్యకు పాల్పడిన యువకుడిని పోలీసులు కాపాడిన సంఘటన గోపాలపురం మండలం చెరుకుమిల్లి గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. ఆ వివరాల ప్రకారం.. దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామానికి చెందిన పురిటిగడ్డ భానుప్రకాష్ అనంతపురం జేఎన్‌టీయూలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల సెలవుల్లో స్వగ్రామానికి వచ్చాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో మనస్థాపానికి గురై చెరువులోకి దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు తన వాట్సాప్ స్టేటస్‌లో పోస్టు చేశాడు. అతని స్టేటస్‌ను చూసిన మిత్రుడు అనంతపురం నుంచి 112 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాడు. ఈ సమాచారం అందుకున్న గోపాలపురం ట్రైనీ ఎస్సై పి.శివగణేష్, తనతో పాటు విజయ్ అనే కానిస్టేబుల్‌ను తీసుకుని సంఘటనా స్థలానికి మూడు నిమిషాల్లో చేరుకుని, చెరువులో మునిగిపోతున్న భానుప్రకాష్‌ను కాపాడారు. భానుప్రకాష్ తల్లిదండ్రులు, బంధువులు, అతని స్నేహితులు, గ్రామస్తులు ట్రైనీ ఎస్సైను అభినందించారు.