
అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
రాజానగరం: స్థానిక పోలీస్ స్టేషన్ పరిధి పాలచర్ల శివారులో టిప్పర్ చోరీ చేసిన అంతర్ రాష్ట్ర ముఠాను పట్టుకున్నట్లు నార్త్ జోన్ డీఎస్పీ వై.శ్రీకాంత్ తెలిపారు. ఆ వివరాలను శుక్రవారం స్థానిక మీడియాకు తెలిపారు. ట్రాన్స్‌పోర్ట్ నడుపుతున్న మన్యం గణేశ్వర్రావు గత నెల 24న వ్యక్తిగత పనిపై హైదరాబాద్‌కు వెళ్తూ తనకున్న నాలుగు టిప్పర్లను తన స్నేహితుడైన అబ్బిరెడ్డి నాగేశ్వర్రావుకు చెప్పి అతని ఏఎన్‌ఆర్ లారీ కాటాకు ఎదురుగా ఉన్న ఖాళీ స్థలంలో పార్క్ చేశాడు. గత నెల 25న రాత్రి వాటిలో సుమారు రూ. 42 లక్షల ఖరీదైన ఒక టిప్పర్ చోరీకి గురైంది. దీంతో అబ్బిరెడ్డి నాగేశ్వర్రావు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తును సీసీ కెమేరాల సాయంతో విస్తృతం చేసిన పోలీసులకు నిందితులు కొవ్వూరు మండలం దొమ్మేరు సమీపంలో టిప్పర్‌తో సహా దొరికిపోయారు. ఇందులో రాజస్థాన్ రాష్ట్రంలోని ధహోటగావ్‌కు చెందిన షౌకత్ ఖాన్ (38), శేర్పూర్‌గావ్‌కు చెందిన జామాల్‌ఖాన్ (35), సోహిల్ (19)లతోపాటు హైదరాబాద్‌కు చెందిన మహ్మద్ ఫసీఉద్దీన్‌ఖాన్ (41) ఉన్నారు. సమావేశంలో సీఐ వీరయ్యగౌడ్, ఏస్సైలు ప్రియకుమార్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్