
విశ్వశాంతిని కాంక్షిస్తూ శాంతి కల్యాణం
మామిడికుదురు: అప్పనపల్లి శ్రీబాల బాలాజీ స్వామివారి సన్నిధిలో మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా నిర్వహించిన పవిత్రోత్సవాలు శుక్రవారంతో సంపూర్ణమయ్యాయి. మూడో రోజు స్వామివారికి, ఉభయ దేవేరులకు అలంకరించిన పవిత్రాలను తీసుకు వచ్చి చక్ర పెరుమాళ్లుకు సమర్పించారు. చతుస్థానార్చనలతో ఉత్సవాలను ప్రారంభించి శ్రీపుష్పయాగంతో ముగించారు. 108 కలశాలతో స్వామి, అమ్మవార్లకు శత కలశ స్నపన తిరు మంజన సేవ ఘనంగా నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పూజాదికాల్లో పాల్గొన్నారు. అనంతరం లోక కల్యాణం కోరుతూ శ్రీవారి శాంతి కల్యాణం కనుల పండువగా జరిపించారు. శ్రీపుష్ప యాగం, మహాదాశీర్వచనం, తీర్థ ప్రసాద గోష్ఠి, బుత్విక్ సన్మానంతో ఉత్సవాలు ముగిశాయి. ఆలయ కార్యనిర్వహణాధికారి ఎం.సత్యనారాయణరాజు ఆధ్వర్యంలో గుడివాడకు చెందిన త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామివారి శిష్య బృందం చలమచర్ల మురళీకృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు.