
అంతా చూసి.. ఆరా తీసి
ఫ రాయవరంలో బాణసంచా పేలుడిపై
పరిశీలన
ఫ ఘటనా స్థలాన్ని సందర్శించిన ద్విసభ్య కమిటీ
ఫ బాధితులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ త్రిమూర్తులు డిమాండ్
రాయవరం: కోనసీమ జిల్లాను కుదిపేసిన రాయవరం బాణసంచా పేలుడి ఘటనపై ద్విసభ్య కమిటీ సభ్యులు ఆరా తీశారు.. ఘటనా స్థలాన్ని పరిశీలించి నిబంధనల అమలును పరిశీలించారు.. ఈ నెల 8న రాయవరంలోని గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్‌లో బాణసంచా ప్రమాదం జరగ్గా, ఆ స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ద్విసభ్య కమిటీ సభ్యులు శుక్రవారం సందర్శించారు. ఇందులో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్.సురేష్‌కుమార్, ఈగల్ ఐజీ పీడీ రామకృష్ణలు ఉన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల, ఎస్పీ రాహుల్ మీనా, ఆర్డీఓ అఖిల, డీఎస్పీ బి.రఘువీర్‌లు ద్విసభ్య కమిటీకి ప్రమాదం జరిగిన తీరును వివరించారు. అక్కడ పరిశీలించిన సభ్యులు బాణసంచా యజమాని వెలుగుబంట్ల సత్యనారాయణమూర్తి (సత్తిబాబు) చిన్న కుమారుడు చిట్టిబాబును కూడా విచారణ చేశారు. ప్రమాదం జరిగిన గణపతి గ్రాండ్ ఫైర్ వర్క్స్ సమీపంలోని భవానీ గ్రాండ్ ఫైర్ వర్క్స్‌ను చూసిన ద్విసభ్య కమిటీ అక్కడ తీసుకున్న భద్రతా చర్యలను పరిశీలించింది. అనంతరం స్థానిక ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని, ప్రమాద ఘటనపై జిల్లా అధికారులతో సమీక్షించింది.
ప్రభుత్వం మొద్దునిద్ర వీడాలి
ఎంపీడీఓ కార్యాలయం వద్ద ద్విసభ్య కమిటీని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు కలిశారు. ప్రమాదంలో మృతి చెందిన యజమానిని మినహాయిస్తే, చనిపోయిన తొమ్మిది మంది కూలీలు నిరు పేదలేనని కమిటీ దృష్టికి తీసుకు వెళ్లారు. వారివి రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబాలని, ఘటన జరిగి పది రోజులవుతున్నా నేటికీ ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందలేదన్నారు. పేద కుటుంబాలకు న్యాయం చేయాల్సిన అవసరం ఉందన్నారు. మృతుల కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రమాదం జరిగిన రోజు రాష్ట్ర మంత్రులు సందర్శించినా, నేటికీ సాయం అందలేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా మొద్దు నిద్ర వీడాలని అన్నారు. ఎస్సీ, బీసీ వర్గాలకు చెందిన కూలీలకు కనీస న్యాయం చేయని ప్రభుత్వాన్ని ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో విశాఖపట్నం జిల్లా పరవాడ ఫార్మా కంపెనీలో ప్రమాదం జరిగినప్పుడు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పందిన తీరును ఎమ్మెల్సీ ఉదాహరించారు. ప్రమాదం జరిగిన వెంటనే 24 గంటలు తిరక్కుండానే ఒక్కో బాధిత కుటుంబానికి రూ.కోటి పరిహారం అందించిన ఘనత గత ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ఎమ్మెల్సీ వెంట సర్పంచ్ చంద్రమళ్ల రామకృష్ణ, ఎంపీపీ నౌడు వెంకటరమణ, వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధి సిరిపురపు శ్రీనివాసరావు, మండల సర్పంచుల సమాఖ్య అధ్యక్షుడు ఆరిఫ్, పార్టీ మండల శాఖ అధ్యక్షుడు వెలగల సత్యనారాయణరెడ్డి తదితరులు ఉన్నారు.
ప్రభుత్వానికి నివేదిస్తాం..
ప్రమాదం ఏ విధంగా జరిగిందీ.. బాధిత కుటుంబాల పరిస్థితి.. వారిని ఏ విధంగా ఆదుకోవాలనే అంశాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామని ద్విసభ్య కమిటీ సభ్యుడు ఎస్.సురేష్‌కుమార్ తెలిపారు. స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ బాణసంచా తయారీ కేంద్రానికి అన్ని అనుమతులు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తేలిందన్నారు. పోలీస్, రెవెన్యూ, ఫైర్, కార్మిక తదితర సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడామన్నారు. ప్రమాదంలో పది మంది చనిపోగా, ముగ్గురు బయట పడినట్లు తెలిపారు. ఫోరెన్సిక్ రిపోర్టు వచ్చిన తర్వాత ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలిసే అవకాశం ఉందన్నారు. అన్ని వివరాలతో కూడిన సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందజేస్తామన్నారు.
న్యాయం చేయాలంటూ..
బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ ప్రజా సంఘాల నేతలు నినాదాలు చేశారు. మండల పరిషత్ కార్యాలయం వద్దకు మృతుల కుటుంబాలకు చెందిన బంధువులు, ప్రజా సంఘాలు వచ్చి ఆందోళన చేశారు. కమిషనర్ బయటకు రావాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు. రాయవరం సర్పంచ్ చంద్రమళ్ల రామకృష్ణ, పీడీఎస్‌యూ రాష్ట్ర సహాయ కార్యదర్శి బి.సిద్ధూ, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నేత ధూళి జయరాజు, రైతు కూలీ సంఘ నేత వెంటపల్లి భీమశంకరం, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు కోన లాజర్ తదితరులు బాధిత కుటుంబాల తరఫున ద్విసభ్య కమిటీ సభ్యులకు వినతిపత్రం అందజేశారు. ఇదిలా ఉంటే బాధిత కుటుంబాలను ఆదుకోవాలని మండపేట వేగుళ్ల జోగేశ్వరరావు కమిటీ సభ్యులకు వినతిపత్రం అందించారు.

అంతా చూసి.. ఆరా తీసి

అంతా చూసి.. ఆరా తీసి