పంట మార్పిడితో మేలైన దిగుబడి | - | Sakshi
Sakshi News home page

పంట మార్పిడితో మేలైన దిగుబడి

Oct 19 2025 6:17 AM | Updated on Oct 19 2025 6:17 AM

పంట మ

పంట మార్పిడితో మేలైన దిగుబడి

చీడపీడల నుంచి రక్షణ

భూసారం పెంపు

ఎరువులు, మందుల ఖర్చు ఆదా

సమీకృత వ్యవసాయంపై

రైతులు దృష్టి సారించాలి

రబీ సీజన్‌లో సాగుకు సన్నాహాలు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): రైతులు భూముల్లో ప్రతి సారి సాగు చేసే పంటలనే మళ్లీ మళ్లీ వేస్తుండడంతో భూమిలో సారం తగ్గిపోయి పెట్టుబడులు పెరగడంతో పాటు దిగుబడులు కూడా తగ్గిపోతున్నాయి. దీంతో రైతులు నష్టాలు చవిచూస్తున్నారు. పంటల మార్పిడి చేయడం వల్ల భూమిలో నాణ్యత పెరిగి దిగుబడులు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, ఖర్చులు కూడా తగ్గుతున్నాయని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వాణిజ్య పంటలు లాభదాయకంగా ఉన్నందున రైతులు ఒకే పంటను అదే పొలంలో ప్రతి ఏడాది సాగు చేస్తున్నారు. దీని వల్ల భూసారం క్షిణించి, పంటలను చీడపీడలు విజృంభించి దిగుబడులు క్రమేపీ తగ్గుతున్నాయి. రెండు మూడు సంవత్సరాలకో సారైనా పంట మార్పిడి చేస్తేనే చీడపీడలను అదుపులో ఉంచే అవకాశం ఉంటుంది. పంట మార్పిడిపై చాలా మంది రైతులకు అవగాహన లేదు. పంట మార్పిడితో భూమిలో నీరు నిల్వ ఉండే శక్తి కలిగి భూసారం వృద్ధి చెందడంతో పాటు చీడపీడలు దూరమవుతాయి. ఫలితంగా సస్యరక్షణకు వినియోగించే మందుల ఖర్చు తగ్గించవచ్చు.

పంట మార్పిడితో లాభాలు

పంట మార్పిడి వల్ల చీడపీడలను అదుపులో ఉంచవచ్చు. ఒక పంటను ఆశించే చీడపీడలు రెండో పంటను ఆశించవు. పంట మార్పిడిలో రెండు మూడు పంటలను పండించడం వల్ల ఏదైనా ఒక పంటకు గిట్టుబాటు ధర రాకున్నా వేరే పంటల వల్ల తగిన లాభం పొందవచ్చు. పంటల మార్పిడితో వివిధ పంటల్లో వ్యవసాయ ఉత్పాదకతను పెంచుకోవచ్చు. రైతులందరూ ఒకే రకమైన పైరు వేయడం వల్ల చీడపీడల ఉధృతి అధికంగా ఉండి దిగుబడి తగ్గడమే కాక మార్కెట్‌లో గిట్టుబాటు ధర లభించక రైతులు నష్టపోతున్నారు. పంట మార్పిడి చేయడం వల్ల సస్యరక్షణ కోసం వాడే పురుగు మందులు ఖర్చు తగ్గించవచ్చు. వేర్లు భూమిలో తక్కువ లోతుకు చొచ్చుకుపోయే పైర్లను, వేర్లు ఎక్కువ లోతుకు చొచ్చుకుపోయే పైర్లతో పంట మార్పిడి చేయడం వల్ల భూమిలోని వివిధ పొరల్లో ఉన్న తేమ పోషకాలను సమర్థంగా వినియోగించుకుంటాయి. ప్రత్తి వేసిన పొలంలో మిరప పంట సాగు చేస్తే లాభసాటిగా ఉంటుంది. మిరప పంట వేసిన పొలంలో పత్తి సాగు చేస్తే పెట్టుబడులు తగ్గడంతో సాగు దిగుబడులు కూడా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మిరప పంట సాగు చేయడానికి ముందు సదరు భూమిలో జనుము, పిల్లి పెసర వంటి పంటలను సాగు చేసి, దాన్ని ట్రాక్టర్‌ ద్వారా తొక్కించిన తర్వాత పంటలు సాగు చేస్తే భూసారం పెరిగి చీడపీడలు దరిచేరవు. నులిపురుగులు ఉన్న ప్రాంతాల్లో టమోట, బెండ, పెసర, మినుము పంటలు వేయకూడదు. వాటిని వేస్తే పురుగులు మరింత అభివృద్ధి చెందుతాయి. పంట మార్పిడిలో భాగంగా నేలంతా పూర్తిగా కప్పే పంటలు ఎంపిక చేసుకోవాలి. వేరుశనగ, బొబ్బర్లు, పెసర, మినుము పంటలను వేయడంతో నేలను పూర్తిగా కప్పి ఉంచుతాయి. దీని వల్ల కలుపు మొక్కలు అధికంగా రాకుండా నివారించవచ్చు. వరి పంట తర్వాత పప్పుధాన్యాల పంటలను కానీ నూనె గింజల పంటలను కానీ సాగు చేయడం వల్ల వరిని తెగుళ్లు ఆశించకుండా ఉంటాయి. భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ చేసే శక్తి ఉన్నప్పుడు ఏడాదిలో రెండు పంటలు పండించుకునే అవకాశం ఉంటుంది. తేలికపాటి నేలలు, ఎర్ర ఇసుక, నేలల్లో మిశ్రమ పంటలను సాగు చేసుకోవచ్చు. కంది పంటలను సాగు చేయడం వల్ల నేలలో పైరు ఆకుల రాలి కుళ్లిపోవడం వల్ల నేలలో సేంద్రియ పదార్ధం పెరిగి భూ భౌతికస్థితి మెరుగుపడి భూసారం వృద్ధి చెందుతుంది. వేరుశనగ, కంది, పప్పుశనగ మొదలైనవి సాగు చేయడం వల్ల వాటి వేర్ల బుడిపెలోని రైజోబియం బ్యాక్టీరియా గాలిలోని నత్రజని స్థిరీకరించి నేలను సారవంతం చేస్తుంది. వాతావరణ కాలుష్యాన్ని నివారించి ప్రకృతిలో సమతుల్యతను పెంచడానికి వీలు కలుగుతుంది.

శాస్త్రవేత్తలకు అవగాహన

రైతులు సమీకృత వ్యవసాయం చేయాలని విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. వరికి బదులు ఇతర ప్రత్యామ్నాయ పంటలు సాగు చేసే విధంగా వారిని ప్రోత్సహిస్తున్నాం. ఇప్పటికే ఐదారు మండలాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. పంట మార్పిడి వల్ల కలిగే లాభాలను వివరిస్తున్నాం. – ఎన్‌.విజయ్‌కుమార్‌,

జిల్లా వ్యవసాయశాఖాధికారి, కాకినాడ

సమీకృత వ్యవసాయంపై అవగాహన

రైతులు సమీకృత వ్యవసాయంపై దృష్టి సారించే విధంగా రైతులకు వ్యవసాయశాఖ అధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోను సమీకృత వ్యవసాయంతో కలిగే లాభాలను శాస్త్రవేత్తలతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒక ఎకరంలో ఫిష్‌ కల్చర్‌, వరి, కోళ్లఫారం, కూరగాయాలు పండిచే విధంగా రైతుల్లో అవగాహన కల్పిస్తున్నారు. మెట్ట ప్రాంతంలో బోర్లు అందుబాటులో ఉన్న రైతులు వరికి బదులు రాగులు, కొర్రలు, జొన్న, మొక్కజొన్న, సజ్జలు సాగు చేసుకోవచ్చు. వరి పంట సుమారు 120 నుంచి 150 రోజులు వస్తుంది. అదే చిరు ధాన్యాలు సాగు చేస్తే 90 రోజుల్లో పంట పూర్తై సంవత్సరానికి మూడు పంటలు వేసుకోవచ్చు. ఇలా ఎకరానికి పెట్టుబడి పోను రూ.50 వేల నుంచి 60 వేల ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అదే వరి సాగు చేస్తే రెండు సీజన్‌లోను రూ.25 వేలు మిగులుతుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని రైతులు సమీకృత వ్యవసాయంపై దృష్టి సారించాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. ఈ రబీ సీజన్‌లో జిల్లాలోని అన్ని మండలాల్లో సమీకృత వ్యవసాయం చేసేందుకు ముందుకు వస్తున్న రైతులను ప్రోత్సహించి వారితో సమీకృత వ్యవసాయం చేయించేందుకు సన్నాహాలు చేస్తున్నారు మండల వ్యవసాయశాఖాధికారులు.

పంట మార్పిడితో మేలైన దిగుబడి 1
1/2

పంట మార్పిడితో మేలైన దిగుబడి

పంట మార్పిడితో మేలైన దిగుబడి 2
2/2

పంట మార్పిడితో మేలైన దిగుబడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement