
రాములోరి భూములకు మోక్ష ం..
దేవదాయ శాఖకు 19.92 ఎకరాల అప్పగింత
కొత్తపల్లి: ధూప దీప నైవేద్యాలు నిర్వహించేందుకు పిఠాపురం మహారాజు గోర్స గ్రామంలో ఉన్న పురాతన సీతారామస్వామి ఆలయానికి కొంత భూమిని దానం చేశారు. దానిని పండించుకుంటూ కొందరు రైతులు 50 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నారు. భూమి తమదేనని, పట్టాలున్నాయంటూ దేవునికే శఠగోపం పెట్టేందుకు యత్నించారు. దీంతో గ్రామస్తులు చేసిన పోరాటం నేటికి ఫలించింది. జిల్లా రెవెన్యూ యంత్రాంగం ఆ భూమిని పోలీసుల సహకారంతో శనివారం దేవదాయ, ధర్మాదాయ శాఖ అధికారులకు అప్పగించారు. కొమరగిరి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 121, 122లో ఉన్న 19.92 ఎకరాలను కాకినాడ ఆర్డీఓ మల్లిబాబు, తహసీల్దార్ చిన్నారావు, పాడా పీడీ చైత్రవర్షిణి సమక్షంలో దేవదాయ శాఖ ఉప కమిషనర్ రమేష్, సహాయ కమిషనర్ నాగేశ్వరరావు సీతారామ ఆలయ ఈవో ధనలక్ష్మికి అప్పగించారు. ఈ నేపథ్యంలో గ్రామంలో భారీగా పోలీసులు మోహరించారు. కొత్తపల్లి–గోర్స, పండూరు–గోర్స రోడ్డులో వాహనాలను నిరోధించారు. ఉప కమిషనర్ రమేష్ మాట్లాడుతూ, ఈ భూములను 34 మంది రైతులు ఆక్రమించి సాగు చేస్తున్నారన్నారు. వీటిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించగా, రైతులు కోర్టును ఆశ్రయించారని చెప్పారు. గ్రామస్తుల సహకారంతో దేవదాయ శాఖ కోర్టులో పోరాడడంతో, ఇటీవల అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. సుమారు రూ.20 కోట్ల విలువైన ఈ భూమిని ఐదు భాగాలుగా చేసి, త్వరలో కౌలుకు బహిరంగ వేలం నిర్వహిస్తారన్నారు. పిఠాపురం సీఐ శ్రీనివాస్, ఎస్సై వెంకటేష్, అధికారులు పాల్గొన్నారు.
పోరాటం ఫలించింది
పురాతన సీతారాముల ఆలయానికి చెందిన ఆలయ భూములు అన్యాక్రాంతంపై గ్రామస్తులంతా ఒక్కటై పోరాడారు. కుటుంబ సభ్యులు, మహిళలు సైతం పాల్గొన్నారు. దేవుని ఆలయ భూముల కోసం రెవెన్యూ, దేవదాయ శాఖ అధికారుల చుట్టూ తిరిగాం. చివరకు అధికారులు స్పందించడం హర్షణీయం.
– రొంగలి వీరబాబు, సర్పంచ్, గోర్స
గ్రామస్తుల సహకారంతో..
పురాతన గోర్స సీతారామ ఆలయానికి కోట్ల రూపాయ లు విలువ చేసే భూమలు ఉన్నా అన్యాక్రాంతం కావడంతో ధూప దీప నైవేద్యాలు భారమైంది. కొన్నేళ్లుగా గ్రామస్తుల సహకారంతో స్వామివారి నిత్య కై ంకర్యాలు, ప్రతి సంవత్సరం స్వామి అమ్మవార్ల కల్యాణం జరుగుతుంది.
– అనంతాచార్యులు, సీతారామ ఆలయ అర్చకుడు

రాములోరి భూములకు మోక్ష ం..

రాములోరి భూములకు మోక్ష ం..