
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలి
వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్
రాజమహేంద్రవరం సిటీ: మెడికల్ కాలేజీల ప్రయివేటీకరణ చేయాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయం వల్ల మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని వైఎస్సార్ సీపీ రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇన్ చార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ధ్వజమెత్తారు. బుధవారం నగరంలో ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 సంవత్సరాలు అయినప్పటికీ రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజీ కూడా రాలేదన్నారు. మెడికల్ విద్య పేద, మధ్య తరగతి విద్యార్థులకు అందుబాటులో ఉండాలని సదాశయంతో నాటి ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి కేంద్రం నుంచి రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేయించారన్నారు. 5 మెడికల్ కాలేజీలు ఇప్పటికే పూర్తయి ఒక్కో కాలేజీలో 150 సీట్లతో విద్యార్థులకు తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు పూర్తి కాలేదంటూ దుష్ప్రచారం చేస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ముఖ్యమంత్రి చంద్రబాబు తన బినామీలకు పీపీపీ విధానం ద్వారా ధారాదత్తం చేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికలలో ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడం లేదన్నారు. సంక్షేమ పథకాలు 40 మందికి ఇచ్చి 100 మందికి ఇచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, తగిన సమయంలో వారు బుద్ధి చెబుతారన్నారు. రాజకీయ కక్షలు లేవు అంటూనే లిక్కర్ స్కాం చేశారంటూ ఎంపీ మిథున్‌రెడ్డిని అక్రమ అరెస్టు చేశారన్నారు. రాష్ట్రంలో నిబంధనలకు విరుద్ధంగా హైవేపై, బడి గుడి ఉన్న ప్రాంతాలలో మద్యం ఏరులై పారుతోందన్నారు. ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ధి చెప్పే రోజు వస్తుందన్నారు. విజయదశమి సందర్భం పార్లమెంట్ పరిధిలోని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.