
రాజమహేంద్రవరం–తిరుపతి విమాన సర్వీసు ప్రారంభం
కోరుకొండ: మధురపూడిలోని విమానాశ్రయం నుంచి తిరుపతికి తొలి విమాన సర్వీసు బుధవారం ప్రారంభమైంది. రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ జెండా ఊపి సర్వీసును ప్రారంభించారు. తొలుత వర్చువల్ ద్వారా ఢిల్లీలో కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరపు రామ్మోహన్‌నాయుడు, ఎంపీ పురందేశ్వరి ప్రారంభించారు. అలయన్స్ ఎయిర్ విమానయాన సంస్థకు చెందిన ఈ సర్వీసు వారానికి 3 రోజులు నిర్వహిస్తారు. మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ ఉదయం 7–40 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరిన ఈ సర్వీసు 9–25 గంటలకు రాజమహేంద్రవరం చేరుతుందన్నారు. ఇక్కడ నుంచి 9–50 గంటలకు తిరుపతికి బయలుదేరి ఉదయం 11–20 గంటలకు చేరుతుందన్నారు. మొదటి 35 సీట్లు రూ.1,999కు, తర్వాత 35 సీట్లు రూ.4,000కు అందిస్తామన్నారు. ఎమ్మెల్యేలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, ఆదిరెడ్డి శ్రీనివాసు, బత్తుల బలరామకృష్ణ, నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, రుడా చైర్మన్ బొడ్డువెంకటరమణ చౌదరి, ఎయిర్‌పోర్టు డైరెక్టర్ కె.ఎన్ శ్రీకాంత్, అలయన్స్ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.