మోగిన నగారా.. | - | Sakshi
Sakshi News home page

మోగిన నగారా..

Oct 15 2026 8:12 AM | Updated on Oct 15 2026 8:12 AM

● మూడు దశల్లో పల్లెపోరు

● ఒకే విడతలో పట్టణ ఎన్నికలు

● మున్సిపాలిటీల్లో 28న పోలింగ్‌,

30న ఫలితాలు

● ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు

నవంబర్‌ 3న పోలింగ్‌

● 342 గ్రామ పంచాయతీల్లోనూ

ఎన్నికల సందడి

సాక్షి, అమలాపురం: ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న స్థానిక ఎన్నికల నగారా మోగింది. పట్టణాలు, పల్లెల్లో ఎన్నికలకు రంగం సిద్ధమైంది. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్‌ బుధవారం ప్రకటించడంతో జిల్లాలోనూ రాజకీయ సందడి మొదలైంది. మున్సిపాలిటీలు, నగర పంచాయతీ, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌లు, గ్రామ పంచాయతీలకు వేర్వేరు దశల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. పట్టణ స్థానిక సంస్థలకు ఈ నెల 28న పోలింగ్‌ జరగనుండగా.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు నవంబర్‌ 3న జరగనున్నాయి. గ్రామ పంచాయతీలకు నవంబర్‌ 26, 29, డిసెంబర్‌ 2 తేదీల్లో మూడు దశల్లో పోలింగ్‌ నిర్వహించనున్నారు. మొత్తం మీద నోటిఫికేషన్‌ విడుదల నుంచి డిసెంబర్‌ రెండు మూడో దశ పంచాయతీ ఎన్నికల కౌంటింగ్‌ వరకు ఏకంగా 49 రోజుల పాటు పట్టణ, పల్లెలు అనే తేడా లేకుండా రాజకీయ సందడి.. ప్రచార హోరు.. గెలుపోటముల మీద చర్చల మీద చర్చలు.. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ నేతల ఫీట్లు.. పాట్లతో గడవనుంది. ఎన్నికల షెడ్యూల్‌ వెలువడటంతో ఆశావహులు, రాజకీయ పార్టీల్లో కదలిక మొదలైంది. ఎవరికి ఏ స్థానం కేటాయించాలి? ఎక్కడ ఎవరిని బరిలోకి దించాలి? అనే అంశాలపై పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు స్థానిక రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి.

రెండు పట్టణాలు.. ఒక నగర పంచాయతీ

జిల్లాలో అమలాపురం, రామచంద్రపురం మున్సిపాలిటీలతో పాటు ముమ్మిడివరం నగర పంచాయతీ ఉంది. వార్డుల పునర్విభజనతో కొత్తగా 11 వార్డులు పెరగగా.. మొత్తం వార్డుల సంఖ్య 91కి చేరింది. ఇందులో ఎన్నికల నిర్వహణ కోసం 102 పోలింగ్‌ బూత్‌లను గుర్తించారు. పట్టణ స్థానిక సంస్థల పరిధిలో మొత్తం 97,157 మంది ఓటర్లు ఉన్నారు.

మున్సిపల్‌ ఎన్నికల్లో వార్డు సభ్యుల గెలుపోటములతో పాటు చైర్మన్‌కు నేరుగా ఎన్నికల నేపథ్యంలో ఈ అభ్యర్థుల ఎంపిక రాజకీయ పార్టీలకు పెద్ద సమస్యగా మారనుంది. వార్డుల వారీగా బలాబలాలు, అభ్యర్థుల ఎంపిక, స్థానిక సమస్యలు ప్రచారంలో కీలకంగా మారనున్నాయి. కొత్తగా పెరిగిన వార్డులు, రిజర్వేషన్ల మార్పులు అభ్యర్థుల ఎంపికపై ప్రభావం చూపనున్నాయి.

గ్రామీణ ప్రాంతాల్లో భారీ ప్రక్రియ

గ్రామీణ స్థానిక సంస్థల పరిధిలో ఎన్నికల నిర్వహణ మరింత విస్తరంగా ఉండనుంది. జిల్లాలో 19 ఎంపీపీలు, 19 జెడ్పీటీసీ స్థానాలు, 430 ఎంపీటీసీ స్థానాలు ఉన్నాయి. వీటితో పాటు 342 గ్రామ పంచాయతీలు, 3,878 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికోసం సుమారు నాలుగు వేల పోలింగ్‌ కేంద్రాలను సిద్ధం చేయాల్సి ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం 10,90,975 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

ఎవరి ప్రయత్నాలు వారివి..

ఎంపీపీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు కావడంతో ఆశావహులు తమ రాజకీయ ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. ఏ మండలంలో ఏ పార్టీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయి? ఏ సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులకు అవకాశాలు దక్కనున్నాయి? అనే అంశాలు స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారనున్నాయి. పంచాయతీ ఎన్నికల్లోనూ సర్పంచ్‌, వార్డు సభ్యుల పదవుల కోసం పోటీ పడే ఆశావహులు తమ ప్రయత్నాలను వేగవంతం చేస్తున్నారు. మొత్తంగా స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనతో జిల్లాలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పట్టణాల్లో వార్డు పోరు.. మండలాల్లో పరిషత్‌ పోరు.. పల్లెల్లో సర్పంచ్‌ ఎన్నికలు రాజకీయ పార్టీలకు కీలకంగా మారనున్నాయి. పోలింగ్‌ తేదీలు సమీపించే కొద్దీ ప్రచారం, అభ్యర్థుల ఎంపిక, స్థానిక రాజకీయ చర్చలు మరింత ఊపందుకోనున్నాయి.

గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ ఇలా..

కార్యక్రమం ఒకటో దశ రెండో దశ మూడో దశ

నోటిఫికేషన్‌ నవంబర్‌ 13 నవంబర్‌ 16 నవంబర్‌ 19

నామినేషన్ల చివరి తేదీ 17 20 23

పరిశీలన 18 21 24

ఉపసంహరణ 21 24 27

పోలింగ్‌ 26 29 డిసెంబర్‌ 2

ఫలితాలు 26 29 డిసెంబర్‌ 2

మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు

బుధవారం ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది.

నామినేషన్లకు చివరి తేదీ : ఈ నెల 18

నామినేషన్ల పరిశీలన : 19

ఉపసంహరణ, తుది జాబితా : 21

పోలింగ్‌ : 28

ఓట్ల లెక్కింపు, ఫలితాలు : 30

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు

ఎన్నికల నోటిఫికేషన్‌ : ఈ నెల 19

నామినేషన్లకు చివరి తేదీ : 23

నామినేషన్ల పరిశీలన : 24

ఉపసంహరణ, తుది జాబితా : 27

పోలింగ్‌ : నవంబర్‌ 3

ఓట్ల లెక్కింపు, ఫలితాలు : నవంబర్‌ 5

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement