● హడావుడిగా శంకుస్థాపనలు
● ఎన్నికల వేళ కూటమి కుట్ర
అమలాపురం టౌన్: రెండున్నరేళ్లు గుర్తురాని అభివృద్ధి ఎన్నికల వేళ గుర్తొంచింది. అరచేతిలో స్వర్గం చూపించేందుకు ప్రగతి మంత్రం జపిస్తోంది. ఇప్పుడు తెగ హామీలు గుప్పిస్తోంది. క్షణం తీరక లేకుండా అంతా హడావుడిగా వరుస పెట్టి శంకుస్థాపనలు చేసేసింది. అమలాపురం, ముమ్మిడివరం, రామచంద్రపురం నియోజక వర్గాల్లో హామీలు, శంకుస్థాపనల జోరు కనిపించింది. అమలాపురం నియోజకవర్గంలో అక్కడి ఎమ్మెల్యే గత నాలుగు రోజుల కిందట మున్సిపాలిటీలో హ్యామ్ (హెచ్ఏఎం) నిధులతో రోడ్ల వెడల్పు, పట్టణ సుందరీకరణ, డివైడర్లు తదితర పనులకు శంకుస్థాపనలు చేశారు. అలాగే పట్టణంలో సీసీ రోడ్డుకు మంగళవారం శంకుస్థాపన చేశారు. అల్లవరం మండలం తూర్పులంకలో రెండు రోడ్లకు శంకుస్థాపనలు చేశారు. ముమ్మిడివరం నగర పంచాయతీ పరిధిలో వివిధ పనులకు అక్కడి ఎమ్మెల్యే గత వారం రోజుల కిందట శంకుస్థాపనలు చేశారు. రామచంద్రపురం మున్సిపాలిటీలో ఎమ్మెల్యే వివిధ పనులకు శంకస్థాపనలు చేశారు. కొబ్బరి కాయలు మాత్రం కొట్టేశారు గానీ పనులు ముందుకెళ్తాయో లేదోనని సర్వత్రా చర్చనీయాంశమవుతోం. స్థానిక ఎన్నికల వేళ ఈ ప్రచార హంగామాను అంతా అర్థం చేసుకుంటున్నారు.
హామీలు ఇస్తూ..
స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరుగనున్న క్రమంలో కూటమి ప్రజాప్రతినిధులు అభివృద్ధి మంత్రాన్ని తెగ జపిస్తున్నారు. అమలాపురం పట్టణాన్ని అభివృద్ధి పరంగా జిల్లాలోనే నంబర్ వన్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని హామీలు గుప్పిస్తున్నారు. ఎన్నికలు జరగనున్న క్రమంలో గ్రామాల్లో కూడా రోడ్ల, డ్రైన్లకు శంకుస్థాపనలు చేసేస్తున్నారు. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో శంకుస్థాపనలు చేసేస్తే, హామీలు ఇచ్చేస్తే పనులు కావని.. ఇది ప్రజాపత్రినిధుల ఎత్తుగడ అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇది ఎన్నికల స్టంటే అంటున్నారు.


