లెక్క తేల్చేందుకు.. | - | Sakshi
Sakshi News home page

లెక్క తేల్చేందుకు..

Feb 20 2026 6:33 AM | Updated on Feb 20 2026 6:33 AM

లెక్క

లెక్క తేల్చేందుకు..

రెండు దశల్లో జనగణనకు చర్యలు

ఏప్రిల్‌ నుంచి తొలిదశ ప్రారంభం

దీని ఆధారంగానే భవిష్యత్‌ ప్రణాళిక

సాక్షి, అమలాపురం: జనగణనకు అడుగులు పడుతున్నాయి.. 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడ్డాయి.. ఈసారి జరిగే జనాభా లెక్కలు రెండు దశల్లో జరగనున్నాయి.. ఐదేళ్లు ఆలస్యంగా ఈ గణనకు రంగం సిద్ధమైంది. దీనికి సంబంధించి గత ఏడాది జూన్‌ 15న కేంద్ర హోం శాఖ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ గణనలో పాల్గొనే అధికారులకు వివిధ రకాల శిక్షణ ఇస్తున్నారు. తొలి దశ ఏప్రిల్‌లో మొదలై సెప్టెంబర్‌ వరకూ కొనసాగనుంది. రెెండో దశ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో మొదలై మార్చి నెలాఖరు నాటికి పూర్తి కానుంది. దీని ఆధారంగానే ప్రభుత్వ పథకాలు అమలు కానున్నాయి.

తొలిసారి డిజిటల్‌ విధానంలో..

జనగణన – 2027లో తొలిసారిగా డిజిటల్‌ విధానాన్ని తీసుకువచ్చారు. ఇది పేపర్‌, పెన్ను లేకుండా కొనసాగనుంది. ఈ గణనలో పాల్గొనే అధికారులు ట్యాబ్‌ లేదా మొబైల్‌ యాప్‌ ద్వారా పూర్తి సమాచారం సేకరించి సాంకేతిక పద్ధతిలో నిక్షిప్తం చేయనున్నారు. దీనిపై మాస్టర్‌ ట్రైనీలకు శిక్షణ సాగుతోంది. శిక్షణ అనంతరం వీరంతా ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదు చేయనున్నారు. జనాభా లెక్కల్లో ఈసారి ప్రజలే స్వయంగా తమ వివరాలు నమోదు చేసుకునే వెసులుబాటు కూడా కల్పించారు. ఆన్‌లైన్‌లో తమ గృహ, కుటుంబ వివరాలను స్వయంగా నమోదు చేసుకోవచ్చు. తరువాత అధికారులు వీటిని పరిశీలించి నిర్ధారిస్తారు.

రెండో దశలో వ్యక్తి సమాచారం

రెండో దశ జనాభా లెక్కల్లో వ్యక్తి పూర్తి సమాచారం సేకరించనున్నారు. ఆ వ్యక్తి పేరు, ఇంటి యజమానితో అతని సంబంధం, లింగం, పుట్టిన తేదీ, వయసు, జన్మ స్థలం, వివాహ స్థితి, ఏ వయసులో వివాహం చేసుకున్నారు, ఎంతమంది పిల్లలున్నారు, మతం, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వైకల్యం, మాతృభాష, ఇతర భాషల పట్ల అవగాహన, అక్షరాస్యత, విద్యార్హతలు, ఆర్థిక కార్యకలాపాలు, ఏ పరిశ్రమలో పని చేస్తున్నారు, వ్యాపారం, ఉద్యోగం వంటి వివరాలను సేకరించనున్నారు.

ఇంటికో యూనిక్‌ కోడ్‌

మొదటి దశలో హౌస్‌ లిస్టింగ్‌ సెన్సస్‌ నిర్వహించనున్నారు. ఈ దశలో ప్రతి ఇంటికి వెళ్లి అక్కడ వాస్తవ పరిస్థితులపై సమాచారం సేకరించనున్నారు. దీనికోసం పట్టణ, పంచాయతీలను బ్లాక్‌లుగా విడదీయనున్నారు. ప్రతి ఇంటికీ ఒక యూనిక్‌ కోడ్‌ ఇవ్వనున్నారు. వీటిని జనాభా లెక్కల యాప్‌లలో నమోదు చేస్తారు. దీనికోసం ప్రతి ఇంటికి సిబ్బంది వెళ్లాల్సిందే. ఇందులో శాశ్వత, తాత్కాలిక నివాస గృహాలు, వాణిజ్య, ప్రభుత్వ భవనాలు వంటి వివరాలు నమోదు చేయనున్నారు. అలాగే ఆస్తుల వివరాలు, ఇళ్లు రకం, గదుల సంఖ్య, తాగునీరు, విద్యుత్‌, మరుగుదొడ్ల సౌకర్యం వంటివి ఉన్నదీ లేనిదీ నమోదు చేస్తారు. వంట గ్యాస్‌, టీవీ, ఫ్రిజ్‌, వాహనం వంటి వివరాలు సేకరిస్తారు. ఇంటర్‌ నెట్‌, మొబైల్‌ వాడకం వివరాలు నమోదు చేస్తారు. జిల్లాలో మొదటి దశ జనగణనలో పాల్గొనే 90 మంది మాస్టర్‌ ట్రైనీలకు ఆన్‌లైన్‌లో మూడు రోజులు పాటు శిక్షణ ఇస్తున్నారు. ఇందులో రెవెన్యూ, మున్సిపల్‌ అధికారులు ఉన్నారు. బ్లాక్‌ల వివరాలతో మ్యాప్‌లు కూడా సిద్ధం చేయనున్నారు.

సమగ్ర సమాచారం సేకరణ

జనాభా లెక్కల్లో పాల్గొనే సిబ్బంది సమగ్ర వివరాలు సేకరించనున్నారు. తొలి దశలో గృహ సముదాయ వివరాలు, యజమాని వివరాలు నమోదు చేస్తారు. రెండో దశలో వ్యక్తి పూర్తి సమాచారం సేకరిస్తారు. జనాభా లెక్కలు పూర్తయితే ప్రభుత్వ పథకాల రూపకల్పనకు ఆధారమవుతోంది. మౌలిక సదుపాయాల ప్రణాళికకు పూర్తిగా ఉపయోగపడుతోంది.

–ఆర్‌.మహేష్‌ కుమార్‌, జిల్లా కలెక్టర్‌

వాటి ఆధారంగానే..

దేశంలో ప్రతి పదేళ్లకు ఒకసారి జనగణన జరుగుతోంది. చివరి జనాభా లెక్కలు 2011లో జరిగాయి. నిర్ణీత షెడ్యూల్‌ ప్రకారం 2021లో జరగాల్సి ఉంది. కరోనా కారణంగా వాయిదాలపై వాయిదాలు పడుతూ ఎట్టకేలకు ఈ ఏడాది తొలి దశ మొదలు కానుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు, కేంద్ర, రాష్ట్ర ప్రాయోజిత కార్యక్రమాలకు, తీర ప్రాంతాల్లో నిధుల కేటాయింపునకు, వివిధ కార్పొరేషన్ల ద్వారా అందించే రాయితీలు, రుణాలు వంటి వాటికి యూనిట్ల సంఖ్య నిర్ధారణకు జనాభా లెక్కలే ప్రామాణికం. కానీ చాలా వాటిని 2011 జనాభా లెక్కలనే పరిగణనలోకి తీసుకోవడం వల్ల నష్టపోతున్నామని పలు వర్గాల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. జిల్లాలో ఇదే పరిస్థితి నెలకొంది. జనాభా, కుటుంబాలు, గృహాలు వంటి వివరాలపై ఇప్పటి వరకూ అంచనాలే తప్ప స్పష్టమైన లెక్కలు లేవు. జిల్లాలో జనాభాపై ఒక అంచనా రావడానికి గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలు కొంత వరకూ ఉపయోగపడ్డాయి. జిల్లా వ్యాప్తంగా అమలాపురం పార్లమెంట్‌ పరిధిలోని వచ్చే ఏడు నియోజకవర్గాల పరిగణనలోకి తీసుకుంటే 7,50,066 మంది పురుష ఓటర్లు, 7,60,389 మంది మహిళా ఓటర్లతోపాటు 17 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. మొత్తం 15,10,472 మంది ఓటర్లు ఉండడంతో కనీసం 19 లక్షల నుంచి 20 లక్షల మంది వరకు జనాభా ఉంటారని అంచనా వేసేవారు. కోనసీమను జిల్లాగా ఏర్పాటు చేసినప్పుడే రామచంద్రపురం నియోజకవర్గం పరిధిలో కాజులూరు, ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో తాళ్లరేవు కాకినాడ జిల్లాలో కలిపారు. తాజాగా మండపేట నియోజకవర్గం పూర్తిగా తూర్పు గోదావరి జిల్లాలో కలిసింది. దీనితో జిల్లా ఏర్పడినప్పుడు సుమారు 20 లక్షల మంది వరకూ ఉంటారనుకున్న జనాభా మరింత తగ్గనుంది.

లెక్క తేల్చేందుకు..1
1/1

లెక్క తేల్చేందుకు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement