● పత్తికి ప్రభుత్వ ‘మద్దతు’ కరవు
● ఇదే అదనుగా దోచేస్తున్న దళారులు
● ధరలో సగానికి సగం కోత
● తీవ్రంగా నష్టపోతున్న రైతులు
పిఠాపురం: ప్రభుత్వం కేవలం మద్దతు ధర ప్రకటించి వదిలేసింది.. కొనుగోలును విస్మరించింది.. వచ్చిన దిగుబడి ఎక్కడ అమ్ముకోవాలో తెలియని దుస్థితిలోకి రైతును నెట్టేసింది.. ఇదే అదునుగా దళారులు రంగంలోకి దిగారు.. ధరలో సగానికి సగం కోత పెడుతున్నారు.. తెల్ల బంగారంగా పేరున్న పత్తి సాగు చేస్తున్న రైతుల దుస్థితి ఇది. జిల్లావ్యాప్తంగా సుమారు 7,500 మంది రైతులు 11,870 ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. జగ్గంపేట, గొల్లప్రోలు, తుని, శంఖవరం, ఏలేశ్వరం తదితర మండలాల్లో పత్తి సాగు జరుగుతోంది. జిల్లాలో ఏటా సుమారు 2.13 లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి వస్తుంది. ఇక్కడి రైతులు పండించిన పత్తిని ట్రేడర్లు కొనుగోలు చేసి, గుంటూరు, కరీంనగర్, ఖమ్మం, మహారాష్ట్ర తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తూంటారు. క్వింటాల్ పత్తికి ప్రభుత్వం ఈ ఏడాది రూ.8,110 మద్దతు ధర ప్రకటించింది. కొనుగోలును విస్మరించింది. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ద్వారా మార్కెట్ కమిటీల్లో ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మరీ పత్తి కొనుగోలు చేసేవారు. మద్దతు ధర అందేలా చేసి, రైతుకు నష్టం లేకుండా చర్యలు తీసుకున్నారు. కానీ, ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలన్న ధ్యాసే మరచింది. షరా మామూలుగానే దళారులు దీనిని అవకాశంగా తీసుకున్నారు. క్వింటాల్ పత్తికి రూ.4,100 మాత్రమే ఇస్తామని కరాఖండీగా చెబుతున్నారు. మద్దతు ధర ఇవ్వడానికి ససేమిరా అంటున్నారు. జిల్లాలో సాగయిన పొడవు పింజరి రకం పత్తికి ప్రభుత్వం కిలోకు రూ.82 మద్దతు ధర ప్రకటించింది. దళారులు మాత్రం రూ.42కు మాత్రమే కొంటాం తప్ప ఒక్క పైసా కూడా ఇవ్వబోమని తెగేసి చెబుతున్నారు. రూ.40 వేల వరకూ నష్టం
ఇప్పటికే రైతులు పత్తి సాగుకు ఎకరానికి రూ.80 వేల పెట్టుబడి పెట్టారు. మద్దతు ధర లభించకపోవడంతో ఎకరానికి సుమారు రూ.30 వేల నుంచి రూ.40 వేల వరకూ నష్టపోతున్నామని, తమ పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.
పెట్టుబడి కూడా దక్కదు
రెండెకరాల్లో పత్తి సాగు చేశాను. రూ.2 లక్షలకు పైగా పెట్టుబడి పెట్టాను. గతంలో నకిలీ విత్తనాలతో నష్టాల పాలయ్యాం. ఇప్పుడు ధర లేక నష్టపోతున్నాం. కిలో పత్తిని రూ.82కు కొనుగోలు చేయాల్సి ఉండగా రూ.41 మాత్రమే ఇ స్తున్నారు. కనీసం పెట్టుబడి అయినా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. అధికారులు ఈ విషయంపై విచారణ చేసి, తగిన చర్యలు తీసుకోవాలి.
– వులవకాయల శివ, చేబ్రోలు,
గొల్లప్రోలు మండలం
ఎప్పుడూ ఇంత దారుణం లేదు
పదేళ్లుగా పత్తి సాగు చేస్తున్నాం. ఎప్పుడూ పరిస్థితి ఇంత దారుణంగా లేదు. ప్రభుత్వ మద్దతు ధరకే ట్రేడర్లు కొనుగోలు చేసేలా చూడాల్సిన అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో, పత్తి కోత కోయడమే గగనంగా మారింది. పంట తీసే కూలి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. తీవ్ర నష్టాల్లో ఉన్న పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి.
– ఓరుగంటి వెంకట సత్యనారాయణ,
చేబ్రోలు, గొల్లప్రోలు మండలం
చర్యలు తీసుకుంటాం
గతంలో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు చేసేవారు. ప్రస్తుతం అటువంటి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. దీనిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పత్తి రైతుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారు నష్టపోకుండా తగిన చర్యలు తీసుకుంటాం.
– పి.స్వాతి, వ్యవసాయ శాఖ
సహాయ సంచాలకులు, పిఠాపురం
తెల్లబోతున్న తెల్ల బంగారం


