రత్నగిరిపై భక్తజన ప్రవాహం
● సత్యదేవుని దర్శించిన 60 వేల మంది
● 8,600 వ్రతాల నిర్వహణ
● రూ.80 లక్షల ఆదాయం
అన్నవరం: రత్నగిరికి భక్తజన ప్రవాహం కొనసాగుతూనే ఉంది. కార్తిక సోమవారం పర్వదినం కావడంతో సత్యదేవుని దర్శనానికి భక్తులు వెల్లువెత్తారు. ఆలయ ప్రాంగణం, వ్రత మండపాలు, క్యూ లైన్లన్నీ భక్తులతో నిండిపోయాయి. తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకూ భక్తుల రద్దీ కొనసాగింది. సోమవారం వేకువజామునే సత్యదేవుని దర్శించేందుకు వేలాదిగా భక్తులు ఆదివారం రాత్రికే రత్నగిరికి చేరుకున్నారు. దీంతో, వేకువజామున ఒంటి గంటకే సత్యదేవుని ఆలయం తెరచి పూజలు చేశారు. అప్పటి నుంచే స్వామివారి వ్రతాల నిర్వహణ కూడా ప్రారంభించారు. ఉదయం ఆరు గంటల సమయానికే సుమారు 40 వేల మంది భక్తులు సత్యదేవుని దర్శించారు. స్వామివారి వ్రతాలు కూడా అప్పటికే 6 వేలు జరిగాయి. తరువాత వచ్చిన భక్తులు కూడా వ్రతాలాచరించి సత్యదేవుని దర్శించుకున్నారు. మొత్తంగా స్వామివారిని సుమారు 60 వేల మంది దర్శించుకున్నారు. వ్రతాలు 8,600 జరిగాయి. అన్ని విభాగాల ద్వారా దేవస్థానానికి రూ.80 లక్షల ఆదాయం వచ్చిందని దేవస్థానం అధికారులు తెలిపారు. నిత్యాన్నదాన పథకంలో సుమారు 6 వేల మంది భక్తులకు పులిహోర, దధ్యోదనం పంపిణీ చేశారు.
ఆ రోజుల్లో మళ్లీ రద్దీ
రత్నగిరిపై మంగళ. బుధవారాల్లో పెద్దగా భక్తుల రద్దీ ఉండదు. తిరిగి గురువారం నుంచి రద్దీ ఉండే అవకాశం ఉంది. గురువారం సత్యదేవుని జన్మ నక్షత్రం మఖను పురస్కరించుకుని సత్య దీక్షల విరమణ ఉంటుంది. దీనికి సత్య స్వాములు, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో వస్తారు. దీంతో, ఆ రోజు కొంత రద్దీ ఉండే అవకాశం ఉంది. మరలా శుక్రవారం నుంచి సోమవారం వరకూ తీవ్ర రద్దీ ఉంటుంది. ప్రధానంగా శనివారం ఏకాదశి కలిసి రావడంతో లక్షకు పైగా భక్తులు వస్తారని అధికారులు భావిస్తున్నారు.


